మాయచేసి మాస్టర్‌ ప్లాన్‌

ABN , First Publish Date - 2021-12-19T06:10:34+05:30 IST

మాయచేసి మాస్టర్‌ ప్లాన్‌

మాయచేసి మాస్టర్‌ ప్లాన్‌
వీఎంసీ మాస్టర్‌ ప్లాన్‌లో పార్కు స్థలంగా పేర్కొన్న భూమి

రూ.20 కోట్ల వీఎంసీ పార్కు స్థలం స్వాహా  

మేయర్‌, కమిషనర్‌ సాక్షిగా కబ్జాకు ఆమోదం

వీఎంసీ సమావేశ అజెండాలో 18వ ఐటెమ్‌

కార్పొరేటర్‌ అడపా శేషు ఒత్తిడితో ఏకపక్షంగా ఓకే

5,330 గజాల స్థలంలో 4,228 గజాలు 

ప్రైవేట్‌ వ్యక్తులకు సమర్పయామి 

టౌన్‌ప్లానింగ్‌ సర్వేయర్‌ నివేదికపై అనుమానాలు

వీఎంసీ మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం అది పార్కు స్థలం. ఈ స్థలంపై కబ్జాగద్దల కన్ను పడింది. దాని విలువ రూ.20 కోట్ల పైచిలుకు ఉండటంతో ఎలాగైనా స్వాహా చేయాలని అధికార వైసీపీ నాయకులు పావులు కదిపారు. ఆగమేఘాలపై టౌన్‌ప్లానింగ్‌ సర్వేయర్‌తో సర్వే చేయించడం.. ఆ స్థలం ప్రైవేటుదని తేల్చేయడం.. దాన్ని వీఎంసీ సాధారణ సమావేశంలో అజెండాగా చేర్చేయడం.. ఆమోదించేయడం జరిగిపోయాయి. సుమారు రూ.20 కోట్ల పైచిలుకు విలువైన  స్థలాన్ని సాక్షాత్తూ వీఎంసీ మేయర్‌, కమిషనర్‌ సాక్షిగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేశారు. 

(విజయవాడ-ఆంధ్రజ్యోతి) : విజయవాడలోని 45వ డివిజన్‌ విద్యాధరపురం రెవెన్యూ గ్రామంలోని ఆర్‌ఎస్‌ నెంబరు 19/1, 19/2ఏలో 5,330.80 చదరపు గజాల స్థలం ఉంది. ఈ భూమిని వీఎంసీ పార్కుగా మాస్టర్‌ ప్లాన్‌లో పేర్కొన్నారు. 2006, డిసెంబరు 29న మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ జారీ చేసిన జీవో ఎంఎస్‌ నెంబరు 674 ప్రకారం విజయవాడ నగరపాలక సంస్థ ఆమోదిత మాస్టర్‌ ప్లాన్‌లో ఈ మొత్తం స్థలాన్ని పార్కుగా పేర్కొన్నారు. 2006 నుంచి మాస్టర్‌ ప్లాన్‌లో పార్కుగా ఉన్న స్థలం రాత్రికి రాత్రే ప్రైవేటు స్థలంగా మారిపోయింది. ఈ పార్కు భూమిని నివాస వినియోగానికి మార్పు చేయాల్సిందిగా కోరుతూ సామా వెంకటస్వామి అనే వ్యక్తితో పాటు మరో తొమ్మిది మంది వీఎంసీకి దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తుపై టౌన్‌ప్లానింగ్‌ విభాగం వారు సర్వే చేసి నివేదికను ప్రైవేట్‌ పార్టీలకు అనుగుణంగా ఇచ్చారు. మొత్తం భూమిలో కేవలం 1,102.80 చదరపు గజాలే అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌లో ఉందని, మిగిలిన 4,228 చదరపు గజాలు ప్రైవేట్‌ భూమి అని నివేదికలో పేర్కొన్నారు. భూమి సర్వేయర్‌ రిపోర్టులో తారుమారు కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా మార్పు చేయాలంటే వీఎంసీ కౌన్సిల్‌తో పాటు ప్రభుత్వ ఆమోదం కూడా పొందాలి. ఆనక ప్రభుత్వానికి ప్రతిపాద నలు పంపాలి. ప్రస్తుతం తొలి అంకం ముగి సింది. అయితే, మాస్టర్‌ ప్లాన్‌లో ఉన్న దానికి విరుద్ధంగా సర్వేయర్‌ నివేదిక ఇవ్వడం వెనుక భారీ మొత్తమే చేతులు మారిందని, రాజకీయ ఒత్తిళ్లు పనిచేశాయని టీడీపీ ఆరోపిస్తోంది.

సభ్యుల అభ్యంతరాలు గాలికి..

విద్యాధరపురంలోని 45వ డివిజన్‌ పరిధిలో ఉన్న పార్కు స్థలాన్ని నివాసయోగ్యంగా మార్చి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు జరిగిన ప్రయత్నాలను అడ్డుకునేందుకు శనివారం నాటి నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశంలో టీడీపీ సభ్యులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అజెండాలో 18వ అంశంగా పేర్కొన్న ఈ భూ వినియోగ మార్పిడిపై సమగ్ర దర్యాప్తు జరగాలని టీడీపీ కార్పొరేటర్లు పట్టుబట్టారు. దీంతో మేయర్‌, కమిషనర్‌ తర్జనభర్జనలు పడ్డారు. అయితే, వైసీపీ కార్పొరేటర్లు అడపా శేషు, అరవ సత్యం దీన్ని ఆమోదించాల్సిందేనంటూ పట్టుబట్టడంతో చివరికి ఏకపక్షంగా ఆమోదించేశారు. టీడీపీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ ఉమ్మడి వెంకటేశ్వరరావు, కార్పొరేటర్‌ ముమ్మనేని ప్రసాద్‌, సీపీఎం కార్పొరేటర్‌ బోయి సత్యబాబు వాయిదా వేయాలని కోరినా ఫలితం లేకపోయింది. 15 ఏళ్లుగా గుర్తుకురాని యాజమాన్య హక్కులు రాత్రికి రాత్రే గుర్తుకు రావడం ఏమిటని టీడీపీ సభ్యులు ప్రశ్నించారు. దీని వెనుక భారీ కుంభకోణం ఉందని, దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-12-19T06:10:34+05:30 IST