అధికార వికేంద్రీకరణకు జగన్ సరికొత్త అర్ధం చెప్పారు: మర్రెడ్డి
ABN , First Publish Date - 2021-07-21T19:32:45+05:30 IST
అధికార వికేంద్రీకరణ అనే మాటకు జగన్మోహన్ రెడ్డి సరికొత్త అర్థం చెప్పారని తెలుగు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు.
అమరావతి: అధికార వికేంద్రీకరణ అనే మాటకు జగన్మోహన్ రెడ్డి సరికొత్త అర్థం చెప్పారని తెలుగు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. స్థానికసంస్థల అభివృద్ధికి, పంచాయతీల బలోపేతానికి వినియోగించాల్సిన 14వ ఆర్థికసంఘం నిధులు రూ.344.93కోట్లను లాగేసుకున్నారని ఆరోపించారు. పంచాయతీల్లో తాగునీరు, రోడ్లు,డ్రైనేజ్‌లు, పారిశుధ్య నిర్వహణకు ఖర్చు చేయాల్సిన నిధులను విద్యుత్ బకాయిల పేరుతో ప్రభుత్వమే లాక్కుందన్నారు. రాజ్యాంగ వ్యవస్థలో సర్పంచ్‌లను తోలుబొమ్మలను చేసి, వాలంటీర్లు, కలెక్టర్లను అడ్డంపెట్టుకొని ముఖ్యమంత్రి పంచాయతీలను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. పల్లెల అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి వినియోగించాల్సిన నిధులను ముఖ్యమంత్రి, తన అప్పుకోసం దారి మళ్లించడం అన్యాయమని ఆయన మండిపడ్డారు.
కేంద్ర ఇంధన సంస్థల నుంచి జగన్ ప్రభుత్వం తొలివిడతలో తీసుకున్న రూ.3,300కోట్ల రుణానికి సంబంధించి, విద్యుత్ బకాయిల పేరుతో పంచాయతీలకు దక్కాల్సిన రూ.344కోట్లను లాక్కున్నారన్నారు. పల్లెల్లో ఇప్పటికే అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్‌లు, ప్రభుత్వ నిర్వాకంతో తలలుపట్టుకున్నారని తెలిపారు. పౌరసరఫరాల శాఖా మంత్రి చెప్పినట్లు నెలాఖరులోపు ధాన్యం రైతులు బకాయిలు చెల్లించకుంటే, ఆయన ఇంటిని రైతు సంఘాలు ముట్టడిస్తాయని హెచ్చరించారు. ధాన్యం రైతుల ఆందోళనలు, నిరసలనకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపి, అన్నదాతలకు బాసటగా నిలవాలని మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు.