లాసెట్ టాపర్ 53 ఏళ్ల మహిళ
ABN , First Publish Date - 2021-10-22T05:12:52+05:30 IST
లాసెట్ టాపర్ 53 ఏళ్ల మహిళ

రాష్ట్ర ప్రఽథమ ర్యాంకు సాధించిన నగరానికి చెందిన హరిప్రియ
ఆంధ్రజ్యోతి, విజయవాడ
ఆమె పేరు మోపూరు హరిప్రియ.. వయసు 53 ఏళ్లు.. ఏపీ ట్రాన్స్‌కోలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా పనిచేస్తున్నారు. ఓవైపు ఉద్యోగం, మరోవైపు కుటుంబ బాధ్యతలతో క్షణం తీరిక లేకుండా ఉన్న ఆమె ఏపీ లాసెట్‌లో మూడేళ్ల బీఎల్/ఎల్ఎల్బీ పరీక్షలో నేటితరం విద్యార్థులతో పోటీపడి రాష్ట్ర స్థాయిలోనే ఫస్ట్ ర్యాంకు సాధించారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తిచేసిన ఆమె ప్రస్తుతం విజయవాడలోని ఏపీ ట్రాన్స్‌కో ప్రధాన కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)గా పనిచేస్తున్నారు. ఆమె భర్త తూపిలి రవీంద్రబాబు కూడా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే గత ఏడాది ఏపీ లాసెట్-2020లో రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించారు. న్యాయవాద వృత్తిపై మమకారంతో ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ ఇచ్చేసి ప్రస్తుతం విజయవాడలోనే సిద్ధార్థ లా కాలేజీలో లా చేస్తున్నారు. ఆయన స్ఫూర్తితో హరిప్రియ ఈ ఏడాది లాసెట్ రాశారు. గత ఏడాది లాసెట్‌లో తన భర్త రవీంద్రబాబు 101 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు కైవసం చేసుకోగా, హరిప్రియ ఈ ఏడాది లాసెట్‌లో 101 మార్కులే సాధించి ప్రథమ ర్యాంకును కైవసరం చేసుకోవడం విశేషం.
ఫస్ట్ ర్యాంకు వస్తుందనుకోలేదు : హరిప్రియ
‘మా వారిని చూసి నేను కూడా లాసెట్ రాశాను. రాష్ట్రస్థాయిలో ఫస్ట్ ర్యాంకు వస్తుందనుకోలేదు. జనరల్ నాలెడ్జి, కరెంట్ ఎఫైర్స్ బాగా చూశాను. రాజ్యాంగంలో ఆర్టికల్స్ చదివాను. లాసెట్ కోసం ఏడు నెలలు కష్టపడి చదివాను. పిల్లలకు స్ఫూర్తిగా ఉంటుందని లాసెట్ రాశానే తప్ప ఇప్పుడు కాలేజీలో చేరి లా చేసే ఉద్దేశం లేదు. నేను ఉద్యోగంలోనే కొనసాగుతాను. అని హరిప్రియ పేర్కొన్నారు.
లాసెట్‌లో జిల్లాకు ఐదు టాప్ ర్యాంకులు
ఏపీ లాసెట్ ఫలితాల్లో జిల్లాకు రాష్ట్రస్థాయిలో ఐదు టాప్ ర్యాంకులు లభించాయి. మూడేళ్ల బీఎల్/ఎల్ఎల్బీ కోర్సులో విజయవాడకు చెందిన మోపురు హరిప్రియ మొదటి ర్యాంకును కైవసం చేసుకుని సత్తా చాటారు. పీజీ లాసెట్ రెండేళ్ల కోర్సుల్లో నగరానికే చెందిన తాతపూడి రమేశ్‌బాబు మూడో ర్యాంకు, గిరిపురానికి చెందిన మన్నం సుసన్య నాల్గో ర్యాంకు, ప్రజాశక్తినగర్‌కు చెందిన పర్వతనేని మమత ఏడో ర్యాంకు, చల్లపల్లి రాధానగర్‌కు చెందిన కంతేటి లక్ష్మీతరుణి పదో ర్యాంకు సాధించారు.