మా స్థలంలో గోదాములు కడితే ఊరుకోం!

ABN , First Publish Date - 2021-11-28T05:55:30+05:30 IST

వందేళ్లుగా చెరువు మట్టిని వినియోగించుకుని జీవిస్తున్నాం. ఇప్పుడు అది లాగేసుకుంటే మా పరిస్థితి ఏమిటంటూ కుమ్మరి వృత్తిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మా స్థలంలో గోదాములు కడితే ఊరుకోం!

కుమ్మర్ల చెరువులో చదును పనులను అడ్డుకున్న వృత్తిదారులు 

ఎస్కకవేటర్‌ను అడ్డుకుని ధర్నా 

మద్దతు తెలిపిన టీడీపీ

విజయవాడ రూరల్‌, నవంబరు 27 : వందేళ్లుగా చెరువు మట్టిని వినియోగించుకుని జీవిస్తున్నాం. ఇప్పుడు అది లాగేసుకుంటే మా పరిస్థితి ఏమిటంటూ కుమ్మరి వృత్తిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నున్నలో కుమ్మర, శాలివాహన వృత్తిదారులకు కేటాయించిన స్థలంలో ధాన్యాన్ని నిల్వ చేసేందుకు గోదాముల నిర్మాణానికి తలపెట్టిన చదును పనులను శనివారం వారు అడ్డుకున్నారు. సుమారు ఎకరం విస్తీర్ణంలో రెండు గోదాముల నిర్మాణానికి నున్నలోని ఆర్‌ఎస్‌ నంబరు 537/1లో భూమిని ఎస్కకవేటర్‌తో చదును పనులను ప్రారంభించారు. విషయం తెలియడంతోనే స్థానిక కుమ్మర, శాలివాహన వృత్తిదారులకు అక్కడకు వెళ్లి పనులను ఆపాలని డిమాండ్‌ చేస్తూ అడ్డుకున్నారు. దీంతో వీఆర్‌వోలు తొర్లికొండ శంకర్‌, శ్రీనివాసరావు, చాంద్‌ హుటాహుటీన ఘటనాస్థలానికి చేరుకున్నారు. గోదాముల నిర్మాణానికి ఎకరం స్థలం కేటాయించారని, అందుకే పనులు చేస్తున్నట్లు తెలిపారు. కుమ్మర వృత్తి చేసుకునేందుకు చెరువు మట్టిని వాడుకుంటున్నామని, అలాంటి చెరువు స్థలాన్ని తమకు కాకుండా చేస్తారా అంటూ వృత్తిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం తెలిసిన జిల్లా కుమ్మర, శాలివాహన సంఘం అధ్యక్షుడు బొమ్మిన శ్రీనివాసరావు అక్కడకు చేరుకుకుని పనులను జరగనీయండా వృత్తిదారులతో కలిసి ఎస్కవేటర్‌కు అడ్డంగా కూర్చుని ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుమ్మర వృత్తిదారులు వందేళ్లగా చెరువు మట్టిని వినియోగించుకుని జీవస్తున్నాని, చెరువు మట్టి అనువుగా ఉంటుందని, ఇక్కడ నుంచి రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నామన్నారు. రెవెన్యూశాఖ తమకు సుమారు ఐదెకరాల స్థలం కేటాయించిందని, అందులో గోదాములను నిర్మిస్తామంటే వృత్తిదారుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తక్షణమే చెరువులో గోదాముల నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ధర్నాకు టీడీపీ మచిలీపట్నం పార్లమెంటు ఉపాధ్యక్షుడు దండు సుబ్రహ్మణ్యం రాజు మద్దతు ప్రకటించారు. నున్న రూరల్‌ ఎస్సై హైమావతి సిబ్బందితో కలసి అక్కడకు చేరుకుని చెరువు భూమిని గోదాముల నిర్మాణానికి కేటాయించినట్లు ఆధారాలు ఏమైనా ఉంటే చూపించాలని, అలాగే కుమ్మర్లకు చెరువును కేటాయించినట్లు రెవెన్యూశాఖ నుంచి ఏమైనా పత్రాలు ఉంటే చూపించాలని కోరారు. అప్పటి వరకు చెరువులో ఎలాంటి పనులు చేపట్టవద్దని ఆమె ఆదేశించారు.

Updated Date - 2021-11-28T05:55:30+05:30 IST