అలరించిన మువ్వల సవ్వడి

ABN , First Publish Date - 2021-03-24T06:45:39+05:30 IST

శ్రీ సిద్దేంధ్ర యోగి నాట్య మహోత్సవాలు కూచిపూడిలోని శ్రీ సిద్దేంధ్ర నాట్య కళా వేదికపై మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి.

అలరించిన మువ్వల సవ్వడి

కూచిపూడి, మార్చి 23: శ్రీ సిద్దేంధ్ర యోగి నాట్య మహోత్సవాలు కూచిపూడిలోని శ్రీ సిద్దేంధ్ర నాట్య కళా వేదికపై మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. బిస్మిల్లా ఖాన్‌ అవార్డు గ్రహీత డా.చింతా రవిబాలకృష్ణ నృత్య దర్శకత్వంలో ప్రదర్శింపబడిన భక్తప్రహ్లాద యక్ష గానం ఆద్యంతమూ భక్తిభావంలో ముంచెత్తింది. నరసింహస్వామిగా తాడేపల్లి సాయి కృష్ణ, హిరణ్య కశ్యపునిగా డాక్టర్‌ చింతా రవిబాలకృష్ణ, ప్రహ్లాదగా ధన్యశ్రీ, లీలావతిగా స్వర్ణశ్రీలు నర్తించారు. ప్రదర్శనకు నట్టువాంగం సుబ్రహ్మణ్య ప్రసాద్‌, గాత్రం సూర్యనారాయణ, మృదంగం హరినాథ శాస్త్రి, వయోలిన్‌ ఆంజనేయులు, ప్లూట్‌ కుమార్‌, మేకప్‌ సోమశేఖర్‌లు సహకరించి నాట్యాంశానికి వన్నె తెచ్చారు. అనంతరం డాక్టర్‌ చింతా రవిబాలకృష్ణ శిష్య బృందం ప్రదర్శించిన పలు కూచిపూడి నాట్యాంశాలు రసజ్ఞులైన ప్రేక్షకులను రంజింపచేశాయి. అనంతరం కళాకారులు పసుమర్తి మృత్యుంజయ, పసుమర్తి కుమార దత్తులు ప్రదర్శించిన కూచిపూడి బృంద నాట్యం ప్రేక్షకులను మంత్రముగ్ధులను గావించాయి. ఈ కార్యక్రమంలో మణిపాల్‌ గ్రూప్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ కె.వి.శ్రీనివాస్‌, అఖిల భారత కూచిపూడి నాట్యకళా మండలి కార్యదర్శి పసుమర్తి కేశవప్రసాద్‌లు జ్యోతి ప్రజ్వళన చేసి సభా కార్యక్రమాలు ప్రారంభించారు. అనంతరం కళాకారులకు మెమోంటోలు అందించి అభినందించారు. 

Updated Date - 2021-03-24T06:45:39+05:30 IST