అమరావతి రాజధాని కాదంటే ప్రజలు ఉద్యమిస్తారు

ABN , First Publish Date - 2021-12-08T06:15:36+05:30 IST

అమరావతి రాజధాని కాదంటే ప్రజలు ఉద్యమిస్తారు

అమరావతి రాజధాని కాదంటే ప్రజలు ఉద్యమిస్తారు
మాట్లాడుతున్న కొల్లు రవీంద్ర, కొనకళ్ల నారాయణ

 జగన్‌పై ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయి

అమరావతి ఉద్యమానికి రూ. 10 లక్షల విరాళమిచ్చిన బందరు ప్రజలు :  కొల్లు రవీంద్ర

మచిలీపట్నం టౌన్‌, డిసెంబరు 7: ప్రతిపక్ష నేతగా అమరావతి రాజధానిని అంగీకరించి ప్రజల నుంచి ఓట్లు దండుకున్న జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చాక మాట మార్చి ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తూ అమరావతిని రాజధాని కాదంటే ప్రజలు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. మంగళవారం టీడీపీ మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ, టీడీపీ మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణతో కలిసి ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌ను చంద్రబాబు ఎంతగా అభివృద్ధి చేశారో ప్రజలందరికీ తెలుసన్నారు. మూడు రాజధానుల పేరుతో జగన్‌రెడ్డి ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారని, అమరావతి న్యాయబద్ధంగా అందరికీ అందుబాటులో ఉంటుందని రవీంద్ర పేర్కొన్నారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రకు సంఘీభావంగా సోమవారం బందరులో నిర్వహించిన యాత్రలో నియోజకవర్గ ప్రజలు, టీడీపీ కార్యకర్తలు అందించిన రూ.10 లక్షల విరాళాన్ని అమరావతి ఉద్యమకారులకు అందిస్తామని ఆయన తెలిపారు. ప్రధాన మంత్రి సైతం రైతులు వ్యతిరేకించే మూడు చట్టాలను వెనక్కి తీసుకున్నారని, జగన్‌రెడ్డి కూడా మూడు రాజధానుల ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని రవీంద్ర డిమాండ్‌ చేశారు. సీఎం జగన్మోహనరెడ్డిపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. మూడు రాజధానులపై బ్యాలెట్‌ పెడితే అమరావతికే ఎక్కువ ఓట్లు వస్తాయన్నారు. మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ మోటమర్రి బాబాప్రసాద్‌, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌, తెలుగురైతు మచిలీపట్నం పార్లమెంటు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ, ఎండీ ఇలియాస్‌ పాషా, పిప్పళ్ల కాంతారావు, పార్టీ బందరు రూరల్‌ మండల అధ్యక్షుడు కుంచే నాని, తెలుగు మహిళ మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షురాలు లంకిశెట్టి నీరజ, తలారి సోమశేఖర్‌, జడ్పీటీసీ మాజీ సభ్యుడు లంకే నారాయణప్రసాద్‌, బత్తిన దాసు పాల్గొన్నారు. అమరావతి ఉద్యమానికి మద్దతుగా ఇద్దరు చిన్నారులు తమ కిడ్డీ బ్యాంక్‌లో దాచుకున్న సొమ్మును, బొర్రపోతుపాలెం సర్పంచ్‌ గట్టే సుశీలాదేవి సేకరించిన రూ.20 వేలను, కరగ్రహారానికి చెందిన వడ్డి కాసులు, నాగుల్‌మీరా, బత్తిన నాగమణి, బత్తిన నాగులు, సిరివెళ్లపాలేనికి చెందిన వెంకటేశ్వరరావు తదితరులు నగదును కొల్లు రవీంద్రకు విరాళాలుగా అందించారు.

పాలన చేతకాకపోతే తప్పుకోవాలి: మాజీ ఎంపీ కొనకళ్ల 

అన్ని వర్గాల ప్రజలను సంప్రదించి అమరావతిని రాజధానిగా చంద్రబాబు ఏర్పాటు చేశారని, అధికార వికేంద్రీకరణ పేరుతో అమరావతిని రాజధాని కాదనడం సబబు కాదని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ అన్నారు.  ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం విశాఖపట్నంలో రాజధానిని ఎలా నిర్మిస్తుందని ఆయన ప్రశ్నించారు. అక్షర క్రమంలో ఆదిలో ఉండే రాష్ట్రాన్ని అధోగతికి జగన్‌ తీసుకువెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిపాలించడం చేతకాకపోతే సీఎం పదవికి జగన్‌ రాజీనామా చేసి తప్పుకోవాలని, అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని నెట్టివేయవద్దని కొనకళ్ల సూచించారు. Updated Date - 2021-12-08T06:15:36+05:30 IST