పేర్ని నానీ.. పద్ధతి మార్చుకో!

ABN , First Publish Date - 2021-03-14T05:41:39+05:30 IST

పేర్ని నానీ నీ పద్ధతి మార్చుకో..

పేర్ని నానీ.. పద్ధతి మార్చుకో!
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హితవు


మచిలీపట్నం: ‘‘పేర్ని నానీ నీ పద్ధతి మార్చుకో. నన్ను దుర్భాషలాడినా నేనేమీ బాధపడను. కానీ ఒక మంత్రి అయి ఉండి రాష్ట్రపతిపై నోరుపారేసుకోవడం సబబు కాదు. శివరాత్రి నాడు కక్షసాధింపు చర్యతోనే నన్ను అరెస్టు చేయించారు. పోలీసులను మీ చెప్పుచేతల్లో పెట్టుకుని టీడీపీ నాయకుల అరెస్టుల కోసం వినియోగించడం సబబా’’ అని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. శనివారం మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో వైసీపీ నాయకులు యథేచ్ఛగా పోలింగ్‌ బూత్‌ల వద్ద తిరిగారని, మంత్రి పేర్ని నాని కుమారుడు పోలింగ్‌ కేంద్రాల చుట్టూ తిరగలేదా అని రవీంద్ర ప్రశ్నించారు. తనను పోలీసులు అడుగడుగునా పోలింగ్‌ కేంద్రాల వద్ద అడ్డగించారన్నారు. ఎక్కడా పోలింగ్‌ కేంద్రాల లోపలకు వెళ్లలేదని, బయట నుంచే పోలింగ్‌ శాతం అడిగామని చెప్పారు. కొన్ని కేంద్రాల్లో వైసీపీ నాయకులు ఆగడాలు చేస్తున్నారని తెలిసి ఆ కేంద్రాలకు వెళ్లామన్నారు.


పేర్ని నాని నివశిస్తున్న సొంత డివిజన్‌లో పోలింగ్‌ ఏజెంట్లపై కేసులు బనాయించి పోలింగ్‌ కేంద్రాలు లేకుండా చేసేందుకు ప్రయత్నాలు చేశారన్నారు. దినకర్‌ అనే ఎస్సీ కార్యకర్తపై అక్రమంగా దాడులు చేశారన్నారు. తలలు పగిలిన టీడీపీ కార్యకర్తలను ఆస్పత్రుల్లో చేర్చితే పోలీసుస్టేషన్‌కు వెళ్లాలని అక్కడి వైద్యులు ఆంక్షలు విధించారన్నారు. మంత్రి కొడాలి నానితో కలిసి పేర్ని నాని అక్రమంగా ఇసుక అమ్మకాలు జరిపారని, ఆ డబ్బును ఎన్నికల్లో ఖర్చు పెట్టారని అన్నారు. భారత్‌ సాల్ట్స్‌ వద్ద ట్రాన్స్‌పోర్టును వైసీపీ నాయకులే నిర్వహిస్తున్నారన్నారు. చిలకలపూడిలో జనసేనతో కలిసి వైసీపీ అభ్యర్థులు ఎన్నికల్లో కుమ్మక్కయ్యారన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలియచేసే హక్కు ఉంటుందని, రాస్తారోకోలు, ధర్నాలు చేస్తే కేసులు కట్టారని అన్నారు.


మోకా భాస్కరరావు హత్య కేసుతో తనకు సంబంధం లేకపోయినా అరెస్టు చేసి రాజమండ్రి జైలులో ఉంచారన్నారు. తాపీతో మంత్రిపై దాడి చేసిన వ్యక్తికి, తనకు సంబంధం లేకపోయినా ఆ కేసులో తనను ఇరికిద్దామని ప్రయత్నం చేశారన్నారు. ఆరోజు మాజీ సీఎం చంద్రబాబు జోక్యం చేసుకోవడం వల్ల ఆ కేసులో ఇరుక్కోకుండా బయటపడ్డానన్నారు. ఈ సమావేశంలో మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ మోటమర్రి బాబా ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-03-14T05:41:39+05:30 IST