కనీస సదుపాయాలు కరవు!

ABN , First Publish Date - 2021-10-19T06:02:54+05:30 IST

కనీస సదుపాయాలు కరవు!

కనీస సదుపాయాలు కరవు!
ఉప్పలూరులో జగనన్న కాలనీ

  ఇబ్బందులు పడుతున్న జగనన్న కాలనీ లబ్ధిదారులు 

 పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు

ఉప్పలూరు (కంకిపాడు), అక్టోబరు 18 :  వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీల్లో కనీస సౌకర్యాలు లేక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  నియోజకవర్గంలో సుమారు 7 వేల మందికి ఇళ్ల స్థలాలు కేటాయించటం జరిగింది. అయితే కాలనీల్లో కనీస సదుపాయాలు, అవసరాలను కల్పించడంలో ప్రభుత్వ అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు పూర్తిగా  విఫలం చెందారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇళ్ల స్థలాలు కేటాయించాం నిర్మాణ పనులు చేపట్టండి లేకుంటే తిరిగి తీసేసుకుంటామంటూ హుకుం జారీ చేసిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా కనీస సదుపాయాలు కల్పించడం లేదంటూ  లబ్ధిదారులు వాపోతున్నారు.   ఇళ్లు నిర్మించుకోండి అంటూ లబ్ధిదారులపై ఒత్తిడి తెస్తున్న అధికారులు అందుకు అవసరమైన కనీస సదుపాయాలు కల్పించడంపై దృష్టి సారించలేదు. ప్రభుత్వం లబ్ధిదారులకు ఇసుక, ఇనుము, సిమెంట్‌ ఇచ్చి చేతులు దులుపుకుంటుంది. నిర్మాణాలు ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, వెంటనే బిల్లులు మంజూరు చేయాలని, లేకుంటే తాము మరిన్ని ఇబ్బందులు పాలవుతామని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

రోడ్లు లేవు.. విద్యుత్‌ లేదు..

ఇంటి నిర్మాణ పనులకు అవసరమైన విద్యుత్‌ సదుపాయం లేదు. ఇళ్లు నిర్మించినా శంకుస్థాపన చేసుకునేందుకు విద్యుత్‌ సౌకర్యం కల్పించలేదు. ఇంటి నిర్మాణానికి మెటీరియల్‌ రావాలంటే కనీసం రోడ్లు కూడా సక్రమంగా లేదు. రూపాయి అయ్యే చోట పది రూపాయల అదనపు ఖర్చు అవుతుందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లు తడుపుకు నేందుకు అవసరమైన మంచినీరు కూడా లేకపోవడం దురదృష్టకరమని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-10-19T06:02:54+05:30 IST