కల్లాల్లోనే ధాన్యం!
ABN , First Publish Date - 2021-05-20T05:54:12+05:30 IST
కల్లాల్లోనే ధాన్యం!

ఫ వర్షానికి భయపడి పట్టలు కప్పుతున్న రైతులు
ఫ వాతావరణంలో మార్పులు రావడంపై భయాందోళన
ఫ కానరాని వ్యవసాయశాఖ అధికారులు
విజయవాడ రూరల్, మే 19 : ఇటు రైతులు, అటు ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు అధికార యంత్రాంగం రబీ ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించింది. వాతావరణంలో వస్తున్న మార్పులకు రైతులలో భయాందోళన వ్యక్తమవుతుండటంతో ధాన్యం కొనుగోలు కోసం రైతులకు కూపన్లు జారీ చేశారు. ఆ ప్రకారమే సంచులను కూడా అందజేశారు. అయితే ధాన్యం బస్తాల లోడును ఎపుడు ఎత్తుతారో తెలియకపోవడంతో రైతులలో భయం మరింత పెరుగుతోంది. మరోవైపు పక్షం రోజుల క్రితం కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన బిల్లులు నేటికీ తమ బ్యాంకు ఖాతాలలో జమ కాలేదని విజయవాడ రూరల్ మండల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి గత నెలాఖరు నుంచే మండలంలోని పలు గ్రామాల్లో ప్రైవేటు వ్యాపారులు ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకంటే రూ.రూ.350 తక్కువకే వ్యాపారులు రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేశారు. అయితే వాళ్లకు కూడా డబ్బులు రాలేదు. వారం రోజులుగా ధాన్యం కొనుగోళ్లపై అన్ని గ్రామాలలో ఆందోళనలు వ్యక్తం అవుతుండటంతో, తప్పనిసరి పరిస్థితులలో మండలంలో పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. వాస్తవానికి ప్రతి గ్రామ సచివాలయంలోనూ రైతు భరోసా కేంద్రం (ఆర్‌బీకే) ఉంది. ఆర్‌బీకేలలోనే ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉండగా, ఎక్కడా అలా జరుగుతున్న దాఖలాలు లేవు. మండలంలో 19 ధాన్యం కొనుగోలు కేంద్రాలను (పీపీసీ) ప్రారంభించినట్లు అధికారులు ప్రకటించగా, వాటిలో ఐదారు కేంద్రాలలో మినహా మిగిలిన వాటిలో పూర్తిస్థాయిలో కొనుగోళ్లు జరగడంలేదు. ఆర్‌బీకేలు ఉన్నప్పటికీ, ప్రైవేటు వ్యాపారులే ధాన్యం కొనుగోలు చేసి, రైతుల పేరుతో ఆర్‌బీకేలలో పేర్లు నమోదు చేస్తుండటం గమనార్హం. మండలంలోని కొత్తూరు తాడేపల్లి, జక్కంపూడి, అంబాపురం, పీ నైనవరం, పాతపాడు, కుందావారి కండ్రికలో కేవలం 10 శాతం మాత్రమే ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయించాల్సిన వ్యవసాయశాఖ అధికారులు మండలంలో ఎక్కడా కనిపించడంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధాన్యం కొనుగోళ్లపై నెల రోజులుగా ఆందోళన చెందుతున్నా, మండలస్థాయి అధికారి ఎక్కడా గ్రామాలకు వచ్చిన దాఖలాలే లేవంటున్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అధికారులపై ఒత్తిడి తెచ్చి రైతులకు సంచులను అందజేసి, కొనుగోలు కోసం కూపన్లను పంపిణీ చేయించారు. కల్లాల్లో ధాన్యం కాటా వేసినప్పటికీ, ఆయా గ్రామాలలో బస్తాలు ఇంకా కల్లాల్లోనే ఉన్నాయి. అంబాపురం, పీ నైనవరం, కొత్తూరు తాడేపల్లి, పాతపాడు, కుందావారి కండ్రిలో ఇంకా రోడ్లపైనా, ప్లాట్లలో రైతులు ధాన్యాన్ని ఆరబెడుతూనే ఉన్నారు.
పేరుకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినా పూర్తిస్థాయిలో కొనుగోళ్లు జరగడంలేదని రైతులు విమర్శిస్తున్నారు.
ఎఫ్‌టీవో జనరేషన్‌లో మాయాజాలం
ధాన్యం కొనుగోలు కేంద్రాలలోని ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ (ఎఫ్‌టీవో) జనరేషన్‌లో పెద్ద ఎత్తున మాయాజాలం జరుగుతోంది. పక్షం రోజుల క్రితం ధాన్యం అమ్మిన రైతులకు నేటి వరకు బ్యాంకు ఖాతాలలో డబ్బు జమకాకపోగా, నాలుగైదు రోజుల క్రితం అమ్మిన వారికి మాత్రం ఖాతాలో డబ్బులు పడటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం రూపొందించిన వెబ్‌సైట్‌లో ఎవరెవరు, ఎపుడు ఎంత ధాన్యాన్ని విక్రయించారు, ఎఫ్‌టీవో ఎపుడు జనరేట్ అయింది, డబ్బులు ఎపుడు జమ అయ్యాయి, ఒకవేళ కాకపోతే కారణం ఏంటనే విషయాలు స్పష్టంగా తెలుస్తాయి.
రూ.19.60 కోట్ల ధాన్యం కొనుగోలు
విజయవాడ రూరల్ మండలంలోని 15 పీపీసీలలో 743 మంది రైతుల నుంచి రూ.19.60 కోట్ల విలువైన 10,487 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. అయితే, ఇప్పటి వరకు 374 మందికి రూ.10.75 కోట్లను బ్యాంకు ఖాతాలలో జమ చేయగా, మరో 369 మంది రైతులకు రూ.8.85 కోట్లను చెల్లించాల్సి ఉంది. వీరంతా ఈ నెల మొదటి వారంలోనే ప్రైవేటు వ్యాపారులకు ధాన్యం విక్రయించారు. వ్యాపారులు రైతుల పేరుతో ఆర్‌బీకేలలో విక్రయించినట్లుగా ఎఫ్‌టీవోలను జారీ చేయించారు. అయినప్పటికీ డబ్బులు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమకంటే వెనుక అమ్మిన వారికి డబ్బులు వస్తే, తమకు ఎందుకు రావని రైతులు ప్రశ్నిస్తున్నారు.