బడికి వెళ్లకుండా పనులు చేస్తున్న 14 ఏళ్లలోపు బాలలు.. కృష్ణా జిల్లాలో ఎంతమంది ఉన్నారంటే..

ABN , First Publish Date - 2021-07-12T18:42:41+05:30 IST

బడిబయట బాలలను..

బడికి వెళ్లకుండా పనులు చేస్తున్న 14 ఏళ్లలోపు బాలలు.. కృష్ణా జిల్లాలో ఎంతమంది ఉన్నారంటే..

బడిఈడు పిల్లలను బడుల్లో చేర్చండి

జిల్లాలో 4,117 మంది బాలల గుర్తింపు

12 నుంచి 15వ తేదీలోగా చేరికలు పూర్తిచేయాలి

ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల


ఆంధ్రజ్యోతి- మచిలీపట్నం: బడిబయట బాలలను పాఠశాలల్లో చేర్పించే కార్యక్రమం ఈనెల 12వ తేదీ నుంచి ప్రారంభించి 15వ తేదీలోగా పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బడిఈడు బాలలను గుర్తించి, వారిని పాఠశాలలో చేర్చినట్టు చూపడం ప్రతీఏటా జరుగతున్న తుంతు. ఈ ఏడాది మూడు, నాలుగు విడతల్లో పోలీ్‌సశాఖ ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమం, వివిధశాఖలద్వారా బడికి వెళ్లకుండా పనులు చేస్తున్న 14 ఏళ్లలోపు బాలలను గుర్తించారు. జిల్లాలో ఈ తరహాలో గుర్తించిన బాలలు 4117మంది ఉన్నారు. కరోనా సమయంలో పాఠశాలలు తెరచుకోవడంలేదు. ఎప్పటికి తెరచుకుంటాయో తెలియనిస్థితి. బడిబయట బాలలను పాఠశాల్లో చేర్చించినట్టు రికార్డుల్లో నమోదు చేసినా పాఠశాలలు కొనసాగని నేపధ్యంలో వారు పాఠశాలలకు వెళ్లే అవకాశాలు తక్కువగానే ఉంటాయి. 4117మందిని పాఠశాలల్లో చేర్చేందుకు జిల్లా విద్యాశాఖ అధికారి, సమగ్రశిక్షా విభాగం సమన్వయకర్తలు, ఎంఈవోలు,  సీఆర్‌పీలు, పార్ట్‌టైం పద్ధతిపై పనిచేసే ఉపాధ్యాయులు తగుచర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో బడిబయట ఉన్న బాలల సంఖ్య ఇంకా అధికంగానే ఉంటుందనేది వాస్తవం. కుటుంబపరిస్థితులు, ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రత్యేక పరిస్థితులు, పేదరికం తదితర కారణాల నేపధ్యంలో చాలామంది బాలలు బడికి వెళ్లకుండా బాలకార్మికులుగానే మగ్గిపోతున్నారు. వీరిని ఎప్పటికి గుర్తిస్తారు, ఎప్పటికి పాఠశాలలకు పంపుతారు, వారిలో ఎంతమంది పాఠశాలలో విద్యను కొనసాగిస్తారనేది ప్రశ్నార్థకమే. 


ప్రతిపాదనలు ఇలా

జిల్లాలో 4,117 మంది బాలలు పాఠశాలలకు దూరంగా ఉన్నట్టు గుర్తించగా, వారిని వివిధపాఠశాలల్లో చేర్చాలని ప్రభుత్వం సూచన చేసింది. బడిబయట ఉన్న బాలలు నివసించే ప్రాంతాలకు దగ్గరలోని పాఠశాలల్లో 732మందిని, ప్రత్యేక అవసరాలు గల బాలలకోసం ఏర్పాటు చేసిన పాఠశాలల్లో 50మందిని చేర్చాలని సూచన చేసింది. కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాలు(కేజీబీవీ)లలో 1052మందిని, గురుకుల పాఠశాలల్లో నలుగురిని, నాన్‌ రెసిడెన్షియల్‌ ప్రత్యేక శిక్షణా కేంద్రాల్లో 1396మందిని, మరసాలు, వేదపాఠశాలల్లో 883 మందిని చేర్చాలని ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలోకస్తూర్భా గాంధీబాలికా విద్యాలయాలు(కేజీబీవీ)లలో 1052మందిని చేర్చుకోవడానికి అవకాశం ఉంటుందా లేదా అనేది అనుమానమే.

Updated Date - 2021-07-12T18:42:41+05:30 IST