లెక్కలేకుండా..!

ABN , First Publish Date - 2021-08-27T05:52:43+05:30 IST

లెక్కలేకుండా..!

లెక్కలేకుండా..!

జగనన్న ఇళ్ల నిర్మాణ తీరుపై అధికారుల  కాకి లెక్కలు

రెండు టేబుళ్లతో అంకెల గారడీ

అర్థంకాక తలలు పట్టుకుంటున్న వైనం

మెటీరియల్‌ ఇండెంట్‌, సరఫరాలో గందరగోళం

గోడౌన్లలోనే  చాలావరకు మెటీరియల్‌

 పంపిణీ చేస్తే ఇళ్లు పూర్తయ్యే అవకాశం

అంకెల గారడీ ఇలా..

అధికారులు లెక్కల్లో చూపించిన గ్రౌండింగ్‌ అయిన ఇళ్లు : 1,03,880

వాస్తవ పరిస్థితి : 3,400

గ్రౌండింగ్‌ అయిన ఇళ్లకు ఖర్చు చేసింది (అధికారుల లెక్క)

ఒక టేబుల్‌లో :  రూ.61.04 కోట్లు

మరో టేబుల్‌లో : రూ.21.19 కోట్లు

పూర్తయిన ఇళ్లు (అధికారుల లెక్క)

ఒక టేబుల్‌లో : 494

మరో టేబుల్‌లో : 38

తిమ్మిని బమ్మిని చేసి, లెక్కల్లో తిరకాసులు చూపించి, అసలు పరిస్థితిని దాచేసి, అవాస్తవాలను పట్టికల్లో చూపించేసి అధికారులు పట్టపగలే లెక్కల చుక్కలు చూపించారు. జగనన్న ఇళ్ల నిర్మాణాల తీరుపై ఇన్‌చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం నగరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులు అరచేతిలో అంకెల గారడీ చేసి చూపించారు. జిల్లాలో జగనన్న ఇళ్ల మంజూరు, గ్రౌండింగ్‌కు మధ్య తేడాలను కాకి లెక్కల రూపంలో కళ్లకు కట్టారు. వాస్తవ పరిస్థితులేంటో చూద్దాం.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : జిల్లాకు మంజూరైన జగనన్న ఇళ్లు 2.71 లక్షలు. వీటిలో శంకుస్థాపనలు జరిగిన 1.03 లక్షల ఇళ్లలో గ్రౌండింగ్‌లో  (పనులు ప్రారంభించినవి) వాస్తవ పరిస్థితి కేవలం 3,400 ఇళ్లకే ఉంది. లబ్ధిదారులకు ఇచ్చామని అధికారులు చెప్పుకొంటున్న మెటీరియల్‌ ప్రాతిపదికన చూస్తే కనీసం 25వేల ఇళ్లయినా మొదలుకావాలి. మరి 3,400 ఇళ్లే బేస్‌మెంట్‌ పనుల్లో ఎందుకు ఉంటాయి? 

అధికారుల లెక్కలు - వాస్తవ పరిస్థితికి మధ్య తేడా

జిల్లాలో ఇళ్ల నిర్మాణ ప్రగతి ఆశాజనకంగా లేదు. అధికారిక లెక్కల ప్రకారం చూస్తే.. జిల్లాలో 2,73,940 మందికి ప్లాట్లు ఇచ్చారు. టిడ్కో ఇళ్లు, గ్రామ సచివాలయాల పరిధిలోని లబ్ధిదారులతో కలిపితే మొత్తం 3,03,092 ఇళ్లు మంజూరైనట్టు చెబుతున్నారు. ఈ లబ్ధిదారులకు సంబంధించి మొదటి దశలో 1,67,541 ఇళ్లు మంజూరయ్యాయి. తాజాగా ప్రభుత్వం 44,183 మంజూరు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన చూస్తే మొత్తం 2,11,724 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో లక్ష ఇళ్లకు పైగా గ్రౌండ్‌ అయ్యాయని, పనులకు 1,89,466 మంది శ్రీకారం చుట్టారని, గ్రౌండింగ్‌ అయినవి 1,03,880 ఉన్నాయని మంత్రి పెద్దిరెడ్డికి అధికారులు చెప్పిన లెక్క ఇది. వాస్తవానికి 1,03,800 ఇళ్లు అనేవి కేవలం శంకుస్థాపనలు చేసినవే. వీటన్నింటినీ గ్రౌండింగ్‌గా చూపారు. గ్రౌండింగ్‌ అంటే పనులు ప్రారంభించటం. ముందుగా బేస్‌మెంట్‌ పనులు ప్రారంభిస్తేనే అవి గ్రౌండ్‌ అయినట్టుగా భావించాలి. బేస్‌మెంట్‌ పనులు మొదలుకాకుండా గ్రౌండింగ్‌గా చూపించలేం. ఇదే విషయాన్ని మంత్రి పెద్దిరెడ్డి గట్టిగా నిలదీస్తే కానీ, అసలు విషయం చెప్పలేదు. అధికారికంగా ఇప్పటివరకు కేవలం 3,400 ఇళ్లే బేస్‌మెంట్‌ పనుల వరకు వచ్చాయి. జిల్లాస్థాయిలో పూర్తయిన ఇళ్లు (అధికారిక లెక్కల ప్రకారం) కేవలం 494 మాత్రమే. ఇది వివిధ జిల్లాలతో కృష్ణాజిల్లాను పోల్చుతూ చూపించిన లెక్క. మరో టేబుల్‌లో జిల్లాకు సంబంధించి సమగ్రంగా ఇచ్చిన నివేదికలో ఫిజికల్‌గా 38 ఇళ్లే పూర్తయినట్టు చూపారు. ఇదేమి లెక్కో హౌసింగ్‌ అధికారులకే తెలియాలి. 

ఇళ్ల ఆర్థిక ప్రగతి దారుణం

జిల్లాలో మొత్తం 2,11,724 మంది లబ్ధిదారులకు సంబంధించి ప్రాజెక్టు వ్యయం రూ.3,811 కోట్లు.  పేమెంట్ల విషయానికొస్తే.. గ్రౌండింగ్‌ అయిన ఇళ్లకు ఇప్పటివరకు ఖర్చు చేసింది కేవలం రూ.61.04 కోట్లుగా వివిధ జిల్లాలతో సరిపోల్చుతూ చూపించారు. జిల్లాస్థాయిలో చూపిన సమగ్ర లెక్కలకు వస్తే రూ.19 కోట్లు ఖర్చుగా చూపించారు. మెటీరి యల్‌ పరంగా చేసిన ఖర్చు రూ.2.31 కోట్లు. మొత్తంగా ఇప్పటివరకు రూ.21.19 కోట్లే ఖర్చు చేసినట్లు చూపించారు. ఈ నివేదికల్లోని లెక్కల చిక్కుముడిని అధికారులే విప్పాలి. 

సిమెంట్‌, స్టీల్‌ వినియోగం ఇలా..

జిల్లాలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి 15,529 మెట్రిక్‌ టన్నుల సిమెంట్‌ అవసరమవుతుందని ఇండెంట్‌ ఇచ్చారు. ఈ ఇండెంట్‌లో సగం కంటే ఎక్కువ అంటే.. కేవలం 8,770.90 మెట్రిక్‌ టన్నుల సిమెంటే సరఫరా అయింది. లబ్ధిదారులకు ఇచ్చామని అధికారులు చెబుతున్న లెక్క 6,452.60 మెట్రిక్‌ టన్నులు. గోడౌన్లలో ఇంకా 2,318.30 మెట్రిక్‌ టన్నుల సిమెంట్‌ నిల్వ ఉంది. మూడొంతుల లబ్ధిదారులు తమకు సిమెంట్‌ రాలేదని వాపోతుంటే 6,452.60 మెట్రిక్‌ టన్నుల సిమెంట్‌ను ఇచ్చామని చెబుతున్నదేమిటి? పోనీ.. ఈ లెక్కలే కరెక్టు అనుకుంటే గోడౌన్లలో 2,318 టన్నుల సిమెంట్‌ను ఎందుకు నిల్వ ఉంచాలి? స్టీల్‌ వినియోగాన్ని పరిశీలిస్తే.. ఇళ్ల నిర్మాణానికి 3,252.70 మెట్రిక్‌ టన్నులు అవసరమని నిర్ణయించారు. సరఫరా అయింది 1,948.55 మెట్రిక్‌ టన్నులు. అధికారిక లెక్కల ప్రకారం లబ్ధిదారులకు ఇచ్చిన స్టీల్‌ కేవలం 567.69 మెట్రిక్‌ టన్నులే. గోడౌన్లలో ఇంకా 1,380.85 మెట్రిక్‌ టన్నుల స్టీల్‌ నిల్వ ఉంది. వీటిన్నింటినీ లబ్ధిదారులకు ఇవ్వకుండా ఎందుకు దాచారో తెలియని పరిస్థితి.

ఇసుక సరఫరా ఇలా..

రెండు పద్ధతుల్లో ఇసుకను ప్రొక్యూర్‌ చేయాలని నిర్ణయించారు. నే రుగా లే అవుట్ల తోలకానికి 30,185 మెట్రిక్‌ టన్నుల ఇసుక అవసరమని ఇండెంట్‌ పెట్టారు. లబ్ధిదారులు తెచ్చుకునే విధానంలో ఇసుక కూపన్ల పేరుతో 41,340 మెట్రిక్‌ టన్నుల ఇసుక అవసరమని ఇండెంట్‌ పెట్టారు. మొత్తంగా ఈ రెండింటికీ కలిపి 71,495 మెట్రిక్‌ టన్నుల ఇసుక అవసరమని ఇండెంట్‌ పెట్టారు. సరఫరా చూస్తే లే అవుట్లకు 11,575 మెట్రిక్‌ టన్నుల మేర, కూపన్లకు సంబంధించి 4,345 మెట్రిక్‌ టన్నుల మేర ఇసుక ను అందించారు. ఈ రెండింటికీ కలిపి మొత్తంగా చూస్తే 15,920 మెట్రిక్‌ టన్నులే సరఫరా చేశారన్నది అధికారుల లెక్కల సారాంశం. వాస్తవానికి ఈ స్థాయిలో పంపిణీ చేసినా కనీసం 25వేల ఇళ్లు నిర్మాణంలో ఉండాలి. మరి ఆ స్థాయిలో ఇళ్లు ఎందుకు లేవన్నది అధికారులే చెప్పాలి. 


Updated Date - 2021-08-27T05:52:43+05:30 IST