గుజరాత్‌ను చూసొద్దాం..

ABN , First Publish Date - 2021-11-02T06:14:41+05:30 IST

గుజరాత్‌ను చూసొద్దాం..

గుజరాత్‌ను చూసొద్దాం..

28న ప్రత్యేక రైలు ప్రారంభం

కార్తీకంలో ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : శైవక్షేత్రాలతో ప్రసిద్ధిచెందిన గుజరాత్‌ను కార్తీకమాసంలో సందర్శించే అవకాశాన్ని ఐఆర్‌సీటీసీ కల్పించింది. ‘వైబ్రంట్‌ గుజరాత్‌’ పేరుతో పది రాత్రులు, పదకొండు పగళ్లు గుజరాత్‌ అందాలను ఆస్వాదించటానికి పిలిగ్రిమ్స్‌ స్పెషల్‌ టూరిస్ట్‌ రైలును నడుపుతున్నారు. ఈ నెల 28వ తేదీన ఈ రైలు విజయవాడ నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్రత్యేక టూరిస్ట్‌ రైలు గుజరాత్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాక అక్కడి నుంచి టూరిస్ట్‌ వాహనంలో సందర్శనీయ ప్రాంతాలకు తీసుకెళ్తారు. జ్యోతిర్లింగాల్లో ఒకటైన సోమనాథ్‌ ఆలయం, శ్రీకృష్ణుడి జన్మస్థలమైన ద్వారక, అనంతరం నాగేశ్వర్‌ జ్యోతిర్లింగ దర్శనం, ఓఖా నదీతీరాన ఉన్న శంఖోదర్‌ (బెట్‌ ద్వారక) ద్వీపం, అహ్మదాబాద్‌ సందర్శన, అనంతరం సర్దార్‌ వల్లభభాయ్‌ పటేల్‌ 597 అడుగుల అతిపెద్ద విగ్రహాన్ని చూడొచ్చు. ఈ విశేషాలన్నింటినీ వీక్షించాక తిరిగి డిసెంబరు 8వ తేదీ సాయంత్రం రైలు విజయవాడ చేరుకుంటుంది. 

చార్జీలు ఇలా..

స్లీపర్‌ (స్టాండర్డ్‌) రూ.10,400, ఏసీ త్రీ టైర్‌ (కంఫర్ట్‌) రూ.17,330గా నిర్ణయించారు. స్లీపర్‌ క్లాస్‌, ఏసీ త్రీ టైర్‌ రైలు ప్రయాణాలు, ధర్మశాల, వసతి గృహాల్లో బస, షేరింగ్‌ పద్ధతిన నాన్‌ ఏసీ రోడ్‌ కోచ్‌లలో ప్రయాణం, రైల్లో టూర్‌ ఎస్కార్ట్‌, సెక్యూరిటీ సదుపాయం, ఉదయం టీ/కాఫీ, అల్పాహారం, భోజనం, విందు, రోజుకు లీటర్‌ వాటర్‌ బాటిల్‌ వంటి సదుపాయాలు కల్పిస్తారు. ఇతర వివరాలకు 8287932312, 9701360675 నెంబర్లలో సంప్రదించవచ్చు. ఉభయ గోదావరి జిల్లాలు, రాయలసీమ జిల్లాలు, ఉత్తరాంధ్ర ప్రజలు కూడా ఈ ప్యాకేజీలను బుక్‌ చేసుకోవచ్చని విజయవాడ ఐఆర్‌సీటీసీ మేనేజర్‌ టి.మురళీకృష్ణ తెలిపారు.

Updated Date - 2021-11-02T06:14:41+05:30 IST