ఆ వాహనాలు ఎక్కడ కనిపించినా సీజ్‌ చేయండి.. కీలక ఆదేశాలు..

ABN , First Publish Date - 2021-12-28T05:52:30+05:30 IST

ఆ వాహనాలు ఎక్కడ కనిపించినా సీజ్‌ చేయండి.. కీలక ఆదేశాలు..

ఆ వాహనాలు ఎక్కడ కనిపించినా సీజ్‌ చేయండి.. కీలక ఆదేశాలు..

  • రవాణా శాఖ అధికారుల చేతికి అక్రమ రిజిస్ర్టేషన్ల జాబితా
  • దొంగ వాహనాలు ఎక్కడ కనిపించినా సీజ్‌ చేయాలని ఆదేశాలు 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) :  అక్రమ రిజిస్ర్టేషన్ల వ్యవహారంలో గుర్తించిన వాహనాలను సీజ్‌ చేయాలని రవాణా శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇతర రాష్ట్రాల వాహనాల పేరిట జిల్లాకు చెందిన డాన్‌ జరిపిన అక్రమ రిజిస్ర్టేషన్ల జాబితాను రవాణా శాఖ విచారణాధికారులు వెలికి తీశారు. జాబితాలో ఉన్న వాహనాలు ఎక్కడ కనిపించినా తక్షణం స్వాధీనం చేసుకోవాలని, ఇచ్చిన చిరునామాల్లో పరిశీలించి, వాటిని కూడా స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. దీంతో పలువురు వాహన యజమానులు రవాణా శాఖ అధికారులకు సరెండర్‌ అయి, వాస్తవాలు చెప్పి బయటపడాలని చూస్తున్నారు.


అయితే డాన్‌ మాత్రం నిజాలు బయటపెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వారిని హెచ్చరిస్తున్నట్టు తెలుస్తోంది. తనకు రాజకీయ పలుకుబడి ఉన్నదని, రవాణాశాఖ మంత్రి ద్వారానే విషయాన్ని సెటిల్‌ చేస్తానని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అభయం ఇస్తున్నట్టు సమాచారం. దీంతో ముందుకు వచ్చే వాహన యజమానులు కూడా వెనకడుగు వేస్తున్నారు. ఈ స్కామ్‌లో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, మహా అయితే 420 చీటింగ్‌ కేసు తప్ప ఏమీ పెట్టలేరని కూడా సదరు డాన్‌ చెబుతున్నట్టు తెలుస్తోంది. 


మరోపక్క దొంగ ఆర్‌సీలు పొందిన వారు తమకు సహకరించకపోతే.. అదుపులోకి తీసుకుని విచారించాలని జాబితాలు చేతపుచ్చుకున్న రవాణాశాఖ ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నట్టు సమాచారం. లేని వాహనాలకు రిజిస్ర్టేషన్‌ చేయించడం, కాలం తీరిన వాహనాలకు దొంగ ఆర్‌సీలో పొందు పరిచిన చాసిస్‌ నెంబర్లను ట్యాంపరింగ్‌ చేయించటం రెండూ నేరాలేనని, ఈ కేసులను తేలిగ్గా తీసుకోకూడదని రవాణాశాఖ ఉన్నతాధికారులు కూడా భావిస్తున్నారు. అక్రమ రిజిస్ర్టేషన్ల వ్యవహారం తమ శాఖకు, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చేలా ఉండటంతో.. రవాణా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబు కూడా సీరియస్‌గా దృష్టి సారించారు.

Updated Date - 2021-12-28T05:52:30+05:30 IST