గూడు.. గోడు..
ABN , First Publish Date - 2021-09-03T06:20:22+05:30 IST
గూడు.. గోడు..

జగనన్న ఇళ్ల నిర్మాణ తీరుపై అధికారుల్లో టెన్షన్ టెన్షన్
ఇళ్ల నిర్మాణాల గ్రౌండింగ్‌కు మంత్రి పెద్దిరెడ్డి గడువు
పనులకు అనుకూలించని వాతావరణం
వర్షంలో కుదరదంటున్న లబ్ధిదారులు
ఏం చేయాలో తెలియక అధికారులు సతమతం
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. అన్నట్టుగా ఉంది జిల్లాలో అధికారుల పరిస్థితి. 15 రోజుల్లో జగనన్న ఇళ్ల నిర్మాణాల గ్రౌండింగ్ పూర్తిచేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించగా, భారీ వర్షాలకు తటాకాలుగా మారిన లే అవుట్లలో పనులేం ప్రారంభిస్తామని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మౌలిక సదుపాయాలు లేకుండా అడుగు ముందుకు వేయలేమంటున్న లబ్ధిదారుల మాటలతో మరింత టెన్షన్‌లో మునిగిపోతున్నారు.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : జిల్లాలో జగనన్న ఇళ్ల పరిస్థితి ఘోరంగా మారింది. ఇళ్ల నిర్మాణాల తీరుపై తీవ్ర అసహనం చెందిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గ్రౌండింగ్‌కు పక్షం రోజుల సమయం ఇచ్చారు. కీలకమైన అనేక అంశాలను వదిలేసి బేస్‌మెంట్ పనులు ప్రారంభించటానికి ఆయన గడువును నిర్దేశించారు. పక్షం రోజుల తర్వాత ఇళ్ల పురోగతిపై ప్రత్యేకంగా సమీక్షిస్తానని చెప్పారు. దీంతో జిల్లా యంత్రాంగంలో టెన్షన్ మొదలైంది.
హడావుడి ప్రయత్నాలు.. అయినా..
ఇళ్ల బేస్‌మెంట్ పనులు మొదలు పెట్టించాలని ఉన్నతాధికారులు కిందిస్థాయి అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. అధికారులేమో లబ్ధిదారులను కంగారు పెడుతున్నారు. లబ్ధిదారులేమో వర్షంలో నిండిన లే అవుట్లలో ఇప్పట్లో పనులు ప్రారంభించలేమని, శీతాకాలం, వేసవికాలంలో చూస్తామని చెబుతున్నారు. మంత్రి పెద్దిరెడ్డి ఇచ్చిన గడువుతో టెన్షన్‌లో ఉన్న జిల్లా యంత్రాంగానికి లబ్ధిదారుల మాటలు తలనొప్పిగా మారాయి.
గడువుకు పూర్తయ్యేనా?
జిల్లాలో లక్షకు పైగా గ్రౌండింగ్ అయినట్లు కిందటి జిల్లా సమీక్ష సమావేశంలో అధికారులు తెలిపారు. శంకుస్థాపనలు జరిపినవన్నీ గ్రౌండింగ్ ఖాతాలో చూపించారు. బేస్‌మెంట్ పనులు మొదలైతే తప్ప గ్రౌండింగ్ కానట్టుగా మంత్రి పెద్దిరెడ్డి తేల్చారు. బేస్‌మెంట్ పనులైనవి 3,400 ఇళ్లు మాత్రమేనని అధికారులు చెప్పడంతో ఆయన అసహనం చెందారు. ఈ సమయంలో పక్షం రోజుల సమయం ఇచ్చారు. ఈ సమావేశం జరిగి ఇప్పటికే వారం గడిచింది. ఈ వారంలో అదనంగా ఒక్కశాతం కూడా బేస్‌మెంట్ పనులు చేయలేదు. దీనికి కారణం వర్షాలు కురవటమే. అంతకుముందు కురిసిన వర్షాలకే చాలా లే అవుట్లు నీటితో నిండి పోయాయి. ప్రస్తుత వర్షాలకు లే అవుట్లలోకి వెళ్లలేని పరిస్థితి.
వ్యవసాయ భూముల్లో లే అవుట్లను మరిచారా?
జిల్లాలో 3లక్షల మంది ఇళ్ల పట్టాల లబ్ధిదారుల కోసం మొత్తం 6,051.37 ఎకరాలు అవసరమయ్యాయి. ఇందులో 1,864.50 ఎకరాల ప్రభుత్వ భూములను సేకరించగా, మిగిలిన 4,186.87 ఎకరాలు పట్టా భూములు. ఈ పట్టా భూములను రైతుల నుంచి కొన్నారు. ఈ భూములు లోతట్టున ఉంటాయి. వర్షాలు పడితే నీటి నిల్వకు అనుకూలంగా ఉంటాయి. ఇలాంటి భూముల్లో 1,507 లే అవుట్లు వేశారు. ప్రభుత్వ భూముల్లో 857 లే అవుట్లు ఉండగా, పట్టా భూముల్లో 610 ఉన్నాయి. వీటిలో 90 శాతం పైగా లే అవుట్లు లోతట్టున ఉన్నాయి. వర్షాలకు ఇవన్నీ నీటితో నిండిపోతున్నాయి.