గుంటు‘తిప్పలు’

ABN , First Publish Date - 2021-11-22T06:15:22+05:30 IST

గుంటుతిప్ప.. ముక్కుపుటాలు అదిరిపోయేటంత దుర్గంధాన్ని వెదజల్లే అతిపొడవైన డ్రెయిన్‌..

గుంటు‘తిప్పలు’
వ్యర్థాలతో నిండిపోయిన గుంటుతిప్ప డ్రెయిన్‌

తీవ్ర దుర్గంధానికి నిలయం

వేలాది మందికి నిత్యనరకం

మూడు నియోజకవర్గాల సరిహద్దుల్లో గుంటుతిప్ప డ్రెయిన్‌

ఆటోనగర్‌, ఇండస్ట్రియల్‌ ఏరియా వ్యర్థాలన్నీ ఇందులోనే

హైవేపై సీఎంను తాకిన దుర్గంధం

కదిలివచ్చిన సీఎంవో... 

పరిష్కారం హైవే వరకే పరిమితం

పైపైన కాదు.. శాశ్వత పరిష్కారం అవసరం


గుంటుతిప్ప.. ముక్కుపుటాలు అదిరిపోయేటంత దుర్గంధాన్ని వెదజల్లే అతిపొడవైన డ్రెయిన్‌.. ఆటోనగర్‌, ఇండస్ట్రియల్‌ ఏరియాల్లోని వ్యర్థాలతో నిండిపోయి..  భరించలేని దుర్గంధం వెదజల్లే అతిపెద్ద మురుగు కాల్వ. దీని కారణంగా ఎన్నో ఏళ్లుగా మూడు నియోజకవర్గాల సరిహద్దు ప్రాంతాల ప్రజలు చవిచూస్తున్న నరకం అంతా, ఇంతా కాదు. ఈ దుర్గంధం ఇటీవల జాతీయ రహదారిపై వెళుతున్న ముఖ్యమంత్రిని తాకింది. ఆయన అసహనం వ్యక్తం చేయడంతో సీఎంవో ముఖ్య కార్యదర్శి సహా, ఐఏఎస్‌ అధికారులంతా తరలి వచ్చారు. వీరంతా కలసి చేసిన పని.. గుంటుతిప్ప నుంచి హైవే మీదకు దుర్గంధం రాకుండా తాత్కాలిక చర్యలు చేపట్టడం. ఉన్నతాధికారులంతా దిగి వస్తే.. తమ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశించిన ప్రజలకు నిరాశే ఎదురయింది. కొద్ది సెకన్ల పాటు దుర్గంధం భరించలేక ఉక్కిరి బిక్కిరి అయిన ముఖ్యమంత్రి ఈ డ్రెయిన్‌ను స్వయంగా పరిశీలిస్తే ప్రజల బాధలు అర్థమయ్యేవి. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ నగరాన్ని ఆనుకుని ఉన్న మూడు నియోజకవర్గాల సరిహద్దు ప్రాంతాల ప్రజలు గుంటుతిప్ప డ్రెయిన్‌ నుంచి వెలువడే దుర్గంధంతో అల్లాడిపోతున్నారు. విజయవాడ తూర్పు, పెనమలూరు, గన్నవరం నియోజకవర్గ సరిహద్దు ప్రాంతాలన్నీ కలిసే చోట ఈ గుంటుతిప్ప డ్రెయిన్‌ పారుతుంది. నగరం మధ్య నుంచి, శివారు ప్రాంతాల మీదుగా వెళుతున్న అతిపెద్ద మురుగు కాలువ ఇది. అంతులేని కాలుష్యానికి కేంద్ర బిందువు. విజయవాడ గ్రేటర్‌ విలీన ప్రతిపాదిత జాబితాల్లో ఉన్న గ్రామాల పాలిట నరకం ఈ డ్రెయిన్‌. విజయవాడతో సమానంగా అభివృద్ధి చెందుతున్న ఈ గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న ఈ అతి పెద్ద సమస్యకు పరిష్కారం దొరకటం లేదు. పట్టణాభివృద్ధి సంస్థ, కార్పొరేషన్‌, పంచాయతీలు, ఐలా.. ఇలా ఎవరికి వారు ఇది తమ పరిధిలోనిది కాదని గాలికి వదిలేయటంతో ఈ సమస్య ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగానే ఉండిపోయింది.


గుంటుతిప్ప డ్రెయిన్‌ చరిత్ర ఇదీ

గుంటుతిప్ప డ్రెయిన్‌ ఒకనాటి సాగునీటి కాల్వ. ఇప్పుడిది అతిపెద్ద మురుగు కాల్వ. ఏడున్నర దశాబ్దాల క్రితం పటమట, కరెన్సీనగర్‌, మురళీనగర్‌, ప్రసాదంపాడు, ఆటోనగర్‌, కానూరు, ఇండస్ర్టియల్‌ ఎస్టేట్‌, సనత్‌నగర్‌ ఈ ప్రాంతాలన్నీ వ్యవసాయ భూములే. ఈ భూములకు సాగునీటి వనరు కృష్ణానది. ప్రకాశం బ్యారేజీ దగ్గర మొదలయ్యే తూర్పు ప్రధాన కాల్వ నుంచి కంట్రోల్‌ రూమ్‌ ఫ్లై ఓవర్‌ దిగువన మూడు ఉప కాల్వలు చీలతాయి. అవే బందరు కాల్వ, రైవస్‌, ఏలూరు కాల్వలు. వీటి ద్వారా దిగువ ప్రాంతాలకు సాగునీరు అందుతుంది. వీటిలో బందరుకాల్వను ఆనుకుని, పటమటలంక చిన్న వంతెన దగ్గర పంప్‌హౌస్‌ ఉండేది. ఈ పంప్‌హౌస్‌ నుంచి ప్రస్తుత కృష్ణవేణి రోడ్డు స్థానంలో పంటకాల్వ ఉండేది. ఇది ప్రస్తుత ఎన్టీఆర్‌ సర్కిల్‌ మీదుగా వెళ్లి, పంటకాల్వ రోడ్డులో రెండు పాయలుగా చీలుతుంది. ఇందులో ఒకటి ప్రస్తుత పంటకాల్వ రోడ్డు స్థానంలో ఉండేది. ఈ కాల్వ  ఆటోనగర్‌ మీదుగా సనత్‌నగర్‌కు చేరుకుంటుంది. అక్కడ సన్‌లైట్‌ మెటల్స్‌ నుంచి మురళీనగర్‌ మీదుగా వెళుతుంది. ఇక రెండవ పాయ పంటకాల్వ రోడ్డు మలుపులోని విజయనగర్‌ కాలనీ మీదుగా ప్రస్తుత ఆయుష్‌ హాస్పిటల్‌, కరెన్సీనగర్‌, రామవరప్పాడుల మీదుగా ప్రసాదంపాడు వరకు చీలింది. ఇది కూడా ఆటోనగర్‌, సనత్‌నగర్‌,  మురళీనగర్‌ల మీదుగా ప్రసాదంపాడుకు వచ్చే మొదటి కాల్వకు అనుసంధానమవుతుంది. ఈ రెండు పాయలూ కలిసి, ప్రసాదంపాడు వద్ద మళ్లీ ఒక్కటవుతాయి. ఇక్కడే హైవే దిగువ నుంచి పారుతూ రైవస్‌ కాల్వలో కలుస్తుంది. 


కాలుష్య కాసారం.. 

ఆటోనగర్‌ ఫస్ట్‌ క్రాస్‌రోడ్డు చివర నుంచి సనత్‌నగర్‌ సరిహద్దులో ప్రస్తుత గుంటుతిప్ప డ్రెయిన్‌ ప్రారంభమవుతుంది. సనత్‌నగర్‌ పంచాయతీ, ఎగువ ప్రాంతం నుంచి కూడా దీనిలోకి మురుగు నీరు చేరుతుంది. ఇక్కడి నుంచి సన్‌లైట్‌ మెటల్స్‌ మీదుగా మురళీనగర్‌ వైపు, అక్కడి నుంచి నేరుగా ప్రసాదంపాడు వరకు సాగుతుంది. ఈ మధ్యలో ఆటోనగర్లో ఉన్న పలు కాల్వలు ఈ డ్రెయిన్‌కు అనుసంధానం అవుతాయి. ఆటోనగర్‌లోని వ్యర్థాలన్నీ ఆ కాల్వల ద్వారా గుంటుతిప్ప డ్రెయిన్‌లో కలుస్తాయి. సన్‌లైట్‌ మెటల్స్‌ ఎగువన ఉన్న పరిశ్రమలు, కానూరు నుంచి వచ్చే మురుగు కూడా దీనిలోనే కలుస్తుంది. ఇలా వ్యర్థజలాలన్నీ వచ్చి చేరటంతో గుంటుతిప్ప కాలుష్య కాసారంగా మారింది. ఆక్రమణలతో ఈ డ్రెయిన్‌ క్రమంగా కుచించుకుపోతోంది. దీంతో పూడిక పేరుకుపోయి, భరించలేని దుర్గంధం వెలువడుతోంది. పంటకాల్వ రోడ్డు మలుపు నుంచి విజయనగర్‌ కాలనీ మీదుగా ఆయుష్‌ హాస్పిటల్‌ సమీపం నుంచి వచ్చే కాలువ కూడా ఆక్రమణలకు గురి కావటం వల్ల కుచించుకుపోయింది. దీని నుంచి వెలువడే దుర్గంధం ప్రసాదంపాడు హైవే వరకు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. దీని కారణంగా ఆటోనగర్‌, సనత్‌నగర్‌, కానూరు, మురళీనగర్‌, కరెన్సీనగర్‌, ప్రసాదంపాడు, రామవరప్పాడు ప్రజలు నిత్యం నరకం చవిచూస్తున్నారు. 


అధికారులు వచ్చి చేసిందేమిటి? 

ఇటీవల కాన్వాయ్‌లో వెళుతున్న ముఖ్యమంత్రి హైవేపై దుర్గంధాన్ని భరించలేకపోయారు. ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికార యంత్రాంగం కదలి వచ్చింది. అయితే అధికారులు ఈ సమస్యను ప్రజల కోణంలో చూడలేదు. సీఎంవో కార్యదర్శి స్వయంగా వచ్చి ఈ కాల్వను కొంత వరకు పరిశీలించారు. ఆయన ఈ డ్రెయిన్‌ను ఆసాంతం పరిశీలిస్తే పరిస్థితి వేరుగా ఉండేది. హైవే మీదకు దుర్గంధం వెదజల్లకుండా ఏమి చేయలో ఆలోచించారు. ఇందుకోసం ఆగమేఘాల మీద పొక్లెయినర్లను తెప్పించి డ్రెయిన్లో పూడిక తీయించారు. గుర్రపు డెక్కను తొలగించారు. హైవే మీదకు దుర్వాసన రాకుండా ఉండటానికి కాల్వమీద చప్టాలు వేయాలనే ఆలోచన చేశారు. ఇందుకు అవసరమైన బడ్జెట్‌ను ఇంకా నిర్దేశించలేదు. 


చేయాల్సింది ఇదీ..

జనావాసాల నడుమ ఉన్న ఈ అవుట్‌ఫాల్‌ డ్రెయిన్‌ను తక్షణం మళ్లించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికిప్పుడు కాదనుకుంటే.. ఆటోనగర్‌లో కూడా భూగర్భ మురుగునీటి వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. లేదంటే ఐలా పరిధిలో సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి.. ఆటోనగర్‌ నుంచి వచ్చే వ్యర్థాలను శుద్ధి చేసే ప్రక్రియను ప్రారంభించాలి. లేదంటే గుంటుతిప్ప డ్రెయిన్‌ను పునర్నిర్మించాలి. ఇలా పునర్నిర్మిస్తే, కాంక్రీట్‌ డ్రెయిన్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. పైన చప్టాలు వేస్తే డ్రెయిన్‌ కనపడదు. నీరు నిల్వ ఉండటానికి  అవకాశం ఉండదు. ఈ ప్రాజెక్టును చేపట్టాలంటే కనీసం రూ.25 కోట్లయినా బడ్జెట్‌ అవసరం అవుతుంది. ఆ పనులను ప్రభుత్వం, మునిసిపల్‌, పంచాయతీరాజ్‌, ఐలా, ఏఎంఆర్‌డీఏ వంటి శాఖలు సంయుక్త భాగస్వామ్యంలో చేపట్టవలసి ఉంది. 



Updated Date - 2021-11-22T06:15:22+05:30 IST