ఉద్యోగాలు ఇచ్చేస్తా.. కేసు వెనక్కి తీసుకోండి
ABN , First Publish Date - 2021-08-25T06:30:27+05:30 IST
స్టేట్‌గెస్ట్‌హౌస్ (ఎస్‌జీహెచ్)లో లైంగిక వేధింపుల కేసు మరో మలుపు తిరిగింది.

తొలగించిన మహిళా సిబ్బందిపై కాంట్రాక్టర్ ఒత్తిడి
గెస్ట్‌హౌస్ లైంగిక వేధింపుల కేసులో మరో మలుపు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : స్టేట్‌గెస్ట్‌హౌస్ (ఎస్‌జీహెచ్)లో లైంగిక వేధింపుల కేసు మరో మలుపు తిరిగింది. ఒకపక్క నిందితులు క్రాంతి, ఫజల్, శ్రీధర్ కేసు నుంచి తప్పించుకోవడానికి పైరవీలను సాగిస్తుండగా, మరోపక్క వారికి వత్తాసు పలుకుతూ మహిళలను విధుల నుంచి తొలగించిన కాంట్రాక్టర్ రంగంలోకి దిగాడు. ఈ ముగ్గురూ తమను లైంగికంగా వేధించారని ఆరుగురు మహిళలు దిశ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే వారి నుంచి పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు.
ఆరోపణలను ఎదుర్కొంటున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు క్రాంతి, ఫజల్, శ్రీధర్‌లను ఇప్పటి వరకు స్టేషన్‌కు పిలిపించకుండా గెస్ట్‌హౌస్‌లో విచారణ చేశారు. తొలగించిన మహిళలకు ఏం కావాలో అది చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ ముగ్గురూ ఇప్పటికే అనేక రాయబారాలు పంపారు. తాజాగా వారికి అవుట్‌సోర్సింగ్ కాంట్రాక్టర్ వకల్తా పుచ్చుకున్నారు. ఎక్కడైతే విధుల నుంచి తొలగించామో అక్కడే మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని ఆయన భరోసా ఇస్తున్నట్టు తెలిసింది. కేసు వాపసు తీసుకోవాలని బాధిత మహిళల ఇళ్లకు వెళ్లి మరీ ఒత్తిడి చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కామాంధుల లీలలు హద్దులు మీరడంతో అధికారులకు ఫిర్యాదు చేసినందుకు ఆరుగురు మహిళా సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. ఈ తొలగింపు విషయంతో తమకు సంబంధం లేదని గెస్ట్‌హౌస్‌లోని ప్రొటోకాల్ అధికారులు చెబుతున్నారు. వయస్సు మీద పడడంతోనే ముందస్తుగా కాంట్రాక్టర్ వారిని తొలగించారని చెబుతున్నారు. వయస్సు రీత్యా విధుల నుంచి తొలగించినప్పుడు మొత్తం ఆరుగురికీ ఉద్యోగాలు ఇస్తామని కాంట్రాక్టర్ రాయబారం నడపడం వెనుక అసలు మర్మం ఏమిటో అర్థం కావడం లేదు. క్రాంతి, ఫజల్, శ్రీధర్ ఒకరికొకరు పరస్పరం సహకరించుకుని మహిళలపై లైంగిక వేధింపులకు దిగారు. తిరస్కరించే సరికి వారితోపాటు వాళ్లకు మద్దతుగా నిలిచిన వారికి గెస్ట్‌హౌస్‌లో స్థానం లేకుండా చేశారు. కాంట్రాక్టర్‌పై ఒత్తిడి చేసి ఇతరులకు అనుమానం రాకుండా ‘వయసు’ను అడ్డుపెట్టుకుని ఆరుగురినీ విధుల నుంచి తొలగించారు. వాస్తవానికి ఆరుగురిలో ముగ్గురు మాత్రమే పెద్ద వయస్సు వాళ్లు ఉన్నారు. ఇప్పడు వాళ్లకూ ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
రోడ్డున పడతామనే భయంతోనే..
కొద్దిరోజుల్లో ఫజల్ పెళ్లిపీఠలు ఎక్కబోతున్నాడు. ఈ కేసు విషయంలో రచ్చ జరిగి, వ్యవహారం కాబోయే వధువుకు చేరితే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న ఆందోళన అతడిని వెంటాడుతోంది. దీనితోపాటు ఫజల్, క్రాంతి, శ్రీధర్‌లు గెస్ట్‌హౌస్‌లో సుఖాలకు అలవాటు పడ్డారు. ఇక్కడి నుంచి తొలగిస్తే బతుకు రోడ్డున పడుతుందన్న భయం వారిలో కనిపిస్తోంది. ఇందుకోసమే అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లోనూ రాయబారాలు నడుపుతున్నారు. మొన్నటి వరకు బాధితులకు ఎంతోకొంత ముట్టజెప్పి, కేసు లేకుండా చేసుకుందామనుకున్నారు. ఈ వ్యూహం బెడిసికొట్టడంతో అధికార యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నారు. తాజాగా కాంట్రాక్టర్‌ను రంగంలోకి దింపారు.