వైసీపీలో వర్గపోరు

ABN , First Publish Date - 2021-02-01T06:50:36+05:30 IST

గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యంత కీలకమైన విజయవాడ రూరల్‌ మండలంలో అధికార వైసీపీని వర్గపోరు పట్టి పీడిస్తోంది.

వైసీపీలో వర్గపోరు

విజయవాడ రూరల్‌లోని కీలక గ్రామాల్లో రెబల్‌ ప్యానల్స్‌

దుట్టా, యార్లగడ్డ వర్సెస్‌ వంశీ గ్రూపులు

విజయవాడ రూరల్‌ : గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యంత కీలకమైన విజయవాడ రూరల్‌ మండలంలో అధికార వైసీపీని వర్గపోరు పట్టి పీడిస్తోంది. సర్పంచ్‌ పదవులకు ప్రధానమైన గ్రామాల్లో రెబల్‌ ప్యానల్స్‌ నామినేషన్లను దాఖలు చేశాయి. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ గ్రూపులతో  వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డాక్టర్‌ దుట్టా రామచంద్రరావు, డీసీసీబీ చైర్మన్‌ యార్లగడ్డ వెంకట్రావు గ్రూపులు ఢీ అంటే ఢీ అని తలపడుతున్నాయి. చివరి క్షణం వరకు రెండు గ్రూపుల మధ్య రాజీకి విశ్వప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో మండలంలో అత్యధికంగా ఓటర్లున్న రామవరప్పాడు, నున్న, నిడమానూరు, అంబాపురం, పి.నైనవరం గ్రామాల్లో వైసీపీకి సొంత పార్టీ నుంచే పోటీ ఎదురవుతోంది. 

ఫ రామవరప్పాడులో ఎమ్మెల్యే వంశీ వర్గం నుంచి వరి శ్రీదేవి ప్యానల్‌ పోటీ చేస్తుండగా, అదే గ్రామంలో దుట్టా, యార్లగడ్డ వర్గానికి చెందిన తుపాకుల శివలీల ప్యానల్‌ పోటీకి దిగడంతో అక్కడ పార్టీ పరిస్థితి అయోమయంగా తయారైంది. ఇక్కడ ఆరు నెలల నుంచి రెండు వర్గాలు పంచాయతీని కైవసం చేసుకునేందుకు ఎవరి ఎత్తులు వారు వేస్తున్నారు. 

ఫ గతంలో ఎన్నడూ లేనివిధంగా నున్నలోనూ వైసీపీకి వర్గపోరు తప్పలేదు. వంశీ వర్గం సర్పంచ్‌ అభ్యర్థిగా కాటూరి సరళను ఎంపిక చేసింది. అయితే, దుట్టా, యార్లగడ్డ వర్గం పెయ్యల రజనీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఈ రెండు గ్రూపుల మధ్య ఒక దశలో ఒడంబడిక కుదిరినప్పటికీ, ఉప సర్పంచ్‌ విషయంలో రాజీ ఫార్ములా బెడిసికొట్టింది. దీంతో నున్నలోనూ వైసీపీ రెండు ప్యానల్స్‌ పోటీ చేస్తున్నాయి. 

ఫ నిడమానూరులో వైసీపీ నుంచి వంశీ వర్గం తరఫున మాజీ సర్పంచ్‌ శీలం రంగారావు పోటీ చేస్తుండగా, ఆ గ్రామ వైసీపీ కన్వీనర్‌, వంశీ గ్రూపునకే చెందిన మాదల నానిబాబు మద్దతుతో పమిడిముక్కల కిరణ్‌ రెబల్‌గా పోటీ చేస్తున్నారు. ఏఎంసీ మాజీ చైర్మన్‌ కొమ్మా కోటేశ్వరరావు (కోట్లు) రాజీకోసం పలుమార్లు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. 

ఫ అంబాపురంలో ఎమ్మెల్యే వంశీ ఆశీస్సులతో వైసీపీ గ్రామ కన్వీనర్‌ నల్లమోతు చంద్రశేఖర్‌ సర్పంచ్‌ పదవికి పోటీ చేస్తుండగా, ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడిగా ఉన్న తోడేటి బెంజిమెన్‌ వైసీపీలోని తన వర్గం, టీడీపీ మద్దతుతో సర్పంచ్‌ పదవికి నామినేషన్‌ను దాఖలు చేశారు. ఎమ్మెల్యే వంశీ అభిమానినని చెబుతూ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న గండికోట సీతయ్య స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. దీంతో ఆ గ్రామంలో వైసీపీ అభ్యర్థి పరిస్థితి కక్కలేక, మింగలేకుండా ఉంది. 

ఫ పి.నైనవరం గ్రామ కన్వీనర్‌ దావు వెంకటేశ్వరరావు వంశీ వర్గం నుంచి పోటీ చేస్తుండగా, అదే పార్టీకి చెందిన ఒక గ్రూపు, టీడీపీ వర్గీయులతో కలిసి మరో అభ్యర్థిని పోటీకి దించింది. దీంతో విజయవాడ రూరల్‌ మండలంలో అధికార వైసీపీకి ఎన్ని పంచాయతీలు దక్కుతాయనే అనుమానాలు కలిగిస్తోంది.

Updated Date - 2021-02-01T06:50:36+05:30 IST