మిల్లు మాయ!
ABN , First Publish Date - 2021-08-25T06:20:23+05:30 IST
ఇదో పెద్ద మాయ.

ప్రభుత్వ లెక్కల్లోలేని మిల్లుకు ధాన్యం
రైతుల కష్టార్జితం స్వాహా
ఐపీ పెట్టిన మిల్లర్.. మోసాన్ని ఆలస్యంగా గుర్తించిన రైతులు
కొనుగోలు చేసిన ధాన్యానికి లెక్కచెప్పేవారే లేరు
రైతులు నిలదీస్తే.. జేసీ చెప్పారంటున్న కిందిస్థాయి అధికారులు
రాజకీయ పైరవీలకు ‘రెవెన్యూ’ సహకారం!
ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి కథనంతో అధికారుల గుండెల్లో గుబులు
ఇదో పెద్ద మాయ. రాజకీయ నాయకులు, రెవెన్యూ అధికారులూ ఒక్కటై ధాన్యం మిల్లు మాటున రైతులను నిలువునా దోచుకున్నారు. అధికారుల సూచనతో అనధికార మిల్లుకు ధాన్యాన్ని తోలిన రైతులు నిండా మునిగిపోయారు. మిల్లర్ ఐపీ పెట్టగా, కష్టించిన రైతులు కన్నీరు పెడుతున్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని సివిల్ సప్లయిస్ కొనుగోలు చేస్తుంది. ఆ ధాన్యాన్ని ఏ మిల్లుల్లో ఆడించాలో రెవెన్యూ ఉన్నతాధికారులు నిర్ణయిస్తారు. ఇలా ఎంపిక చేసిన మిల్లుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. దీని ప్రకారం ఆయా మిల్లులకే ధాన్యాన్ని తరలించాల్సి ఉంటుంది. దీనిని ఆసరాగా చేసుకుని అధికార పార్టీ నేతలు చక్రం తిప్పారు. తమ అనుచరగణమైన మిల్లర్ల ప్రయోజనాల కోసం ఒత్తిళ్లు తీసుకువచ్చారు. క్షేత్రస్థాయిలో అధికారులు సహకరించారు. దీంతో గోల్‌మాల్ జరిగిపోయింది. రైతులు రోడ్డెక్కటంతో కింది స్థాయి అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : జిల్లాలోని చాట్రాయి మండలం మర్లపాలెం గ్రామంలో రైతులు నాలుగు లోడ్లతో తమ ధాన్యాన్ని ఇటీవల మిల్లులకు తరలించారు. లోడుకు 30 మంది రైతులు ఇలా తమ ధాన్యాన్ని తోలారు. ఆన్‌లైన్‌లో నమోదైన మిల్లులకు మాత్రమే ధాన్యాన్ని తోలాల్సి ఉండగా.. ప్రభుత్వ లెక్కలో లేని మిల్లులకు కూడా తరలించారు. ఈ సంగతిని రైతులు ఆలస్యంగా గుర్తించారు. ధాన్యం తోలి నాలుగు నెలలైనా డబ్బు రాకపోవటంతో అనుమానం వచ్చిన రైతులు ఆరా తీయగా, ప్రభుత్వ లెక్కలో లేని మిల్లుకు తరలించినట్టు గుర్తించారు. సూపర్‌వైజర్ల సూచనమేరకే తరలించినందున వారినే రైతులు నిలదీశారు. సదరు మిల్లర్ ఐపీ పెట్టాడని, ఆ డబ్బులు రావాలంటే సెటిల్ చేసుకోవాలని సూపర్‌వైజర్లు చెప్పడంతో రైతులు తాము మోసపోయామని గుర్తించారు. అసలు ప్రభుత్వ లెక్కలో లేని మిల్లుకు తోలించామని ఆ తర్వాత గ్రహించారు. మర్లపాలెం ఇన్‌చార్జి త్రినాథ్, కొత్తగూడెం ఇన్‌చార్జి శ్రీనివాస్‌లతో పాటు ఫీల్డ్ ఇన్‌చార్జి విజయ్ ఈ మాయ మిల్లు వెనుక ఉన్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఎన్నిసార్లు వీరిని కలిసినా స్పందించటం లేదని చెబుతున్నారు. తాము కష్టపడి పండించిన పంటకు డబ్బులు ఇవ్వకపోగా, మిల్లుకు తోలిన ధాన్యం కూడా మాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు తక్షణం విచారణ జరిపించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాకు చెందిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి తక్షణమే స్పందించి తమకు న్యాయం చేయాలని అభ్యర్థిస్తున్నారు.
అధికారుల తీరుపై సందేహాలు
ఈ వ్యవహారంపై ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేయటంతో ఈ ఘటనకు బాధ్యులైన వారిలో ఒణుకు మొదలైంది. దీనిపై వెంటనే విచారించి చర్యలు తీసుకుంటామని ప్రకటన విడుదల చేశారు. ప్రకటన అయితే విడుదల చేశారు కానీ, అధికారులు చేసిన తప్పును ఏ విధంగా సరిదిద్దాలి? పాత్రధారులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని దానిపై ఊగిసలాటలోనే ఉన్నారు. ఈ వ్యవహారంపై డీఎస్‌ఎంఎస్ మేనేజర్ ప్రసాద్‌ను ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి వివరణ కోరగా విచారణ జరుపుతున్నట్టు మాత్రమే చెప్పారు. ఏ గ్రామంలో రైతులు అన్యాయానికి గురయ్యారో కూడా ఆయన చెప్పలేకపోతున్నారు. గట్టిగా అడిగితే మంత్రి దృష్టికి తీసుకువచ్చామని, విచారించి న్యాయం చేస్తామని చెబుతున్నారు. రైతులు ధాన్యం అమ్ముకుని నాలుగు నెలలైనా ఈ ఘటనపై విచారణ జరపకపోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది.
ఉన్నతాధికారులపై మోపే ప్రయత్నం
రైతులకు జరిగిన మోసానికి బాధ్యత వహించాల్సిన క్షేత్రస్థాయి అధికారులు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రానికి తాళాలు వేశారు. రైతులు గట్టిగా నిలదీస్తే ఇది తమ పరిధిలోని వ్యవహారం కాదని, జేసీ మౌఖికంగా చెప్పటం వల్లనే ఆ మిల్లుకు తరలించాలని చెప్పామంటున్నారు. ట్రినిటీ ట్రేడర్, మర్రిబంధం మిల్లుకు తాము ధాన్యాన్ని తోలించినట్టు మర్లపాలెం, కొత్తగూడెం రైతులు చెబుతున్నారు. ట్రినిటీ ట్రేడర్స్ మిల్లు ఆన్‌లైన్‌లో లేకపోయినా, ప్రభుత్వ అనుమతులు లేకపోయినా.. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు తాము చేయాల్సి వచ్చిందని అధికారులు చెప్పారని రైతులు అంటున్నారు. ఈ వ్యవహారంపై జేసీ ఉన్నత స్థాయిలో విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.