బంగారం చోరీ.. మహిళపై కేసు

ABN , First Publish Date - 2021-07-12T05:56:53+05:30 IST

బంగారం చోరీ.. మహిళపై కేసు

బంగారం చోరీ.. మహిళపై కేసు

వన్‌టౌన్‌, జూలై 11: ఇంట్లో పనులు చేస్తానని నమ్మబలికి కూరగాయల వ్యాపారి ఇంట్లో బంగారు ఆభరణాలు చోరీ చేసిన మహిళపై ఆదివారం గవర్నర్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్వాతంత్య్ర సమరయోధుల భవనం ఎదురుగా గోపాల కృష్ణయ్య వీధిలో శ్రీసాయిలక్ష్మి అపార్ట్‌మెంట్‌లో ఉండే వెన్నం రత్నారావు కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. పని మనిషి కావాలని అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌ పోచయ్యకు చెప్పాడు. శనివారం పోచయ్య వద్దకు ఓ యువతి వచ్చి అపార్ట్‌మెంట్‌లో పని చేస్తాను అని అడిగింది. రత్నారావు భార్యకు చెప్పడంతో ఆమె అపార్ట్‌మెంట్‌ కిందకు వచ్చి వివరాలు అడిగింది. తన పేరు లక్ష్మి అని, రాజమండ్రికి చెందిన మహిళనని సమీపంలోని ఆంజనేయస్వామి గుడి దగ్గరలో ఉంటున్నానని చెప్పింది. రత్నారావు భార్య ఆదివారం ఉదయం 7 గంటలకు వచ్చి ఇంట్లో పనులు చేయమని చెప్పింది. పని మనిషి ఆదివారం తన వెంట 14 ఏళ్ల బాలికను తీసుకుని రత్నారావు ఇంటికి వచ్చింది. బెడ్‌రూమ్‌లో పని చేస్తుండగా బాలికకు బాత్‌రూమ్‌ సమస్య అని చెప్పి అక్కడ నుంచి కిందకు వెళ్లింది. బయటకు వెళ్లిన పని మనిషి రాకపోవడంతో అనుమానం వచ్చిన రత్నారావు, అతని భార్య బెడ్‌రూమ్‌లోకి వెళ్లి చూడగా కబోర్డ్‌లో ఉంచిన 65 గ్రాముల బంగారపు చైన్‌, 20 గ్రాముల బంగారపు ఉంగరం కనిపించలేదు. అపార్ట్‌మెంట్‌ కిందకు వచ్చి పని మనిషి గురించి ఆరా తీసి స్థానికంగా వెదికారు. కనిపించకపోవడంతో రత్నరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Updated Date - 2021-07-12T05:56:53+05:30 IST