పేషెంట్‌ కేర్‌కు ప్రాధాన్యమిస్తా

ABN , First Publish Date - 2021-11-02T06:24:33+05:30 IST

ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైదసేవలందించేందుకు కృషి చేస్తానని విజయవాడ జీజీహెచ్‌ నూతన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వై.కిరణ్‌కుమార్‌ అన్నారు.

పేషెంట్‌ కేర్‌కు ప్రాధాన్యమిస్తా
బాధ్యతలు స్వీకరించిన డాక్టర్‌ కిరణ్‌కుమార్‌

జీజీహెచ్‌ కొత్త సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ 


విజయవాడ, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైదసేవలందించేందుకు కృషి చేస్తానని విజయవాడ జీజీహెచ్‌ నూతన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వై.కిరణ్‌కుమార్‌ అన్నారు. ఓపీ పేషెంట్లకు సత్వర (జీరో అవర్‌) వైద్యసేవలందించడం.. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి అత్యంత ప్రాధాన్యమిస్తానని చెప్పారు. సోమవారం బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ, ‘గత పదేళ్లలో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి చాలా అభివృద్ధి చెందిందన్నారు. వందల సంఖ్యలో వెంటిలేటర్లు, అత్యాధునిక వైద్యపరికరాలు జీజీహెచ్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు. సూపర్‌ స్పెషాలిటీ విభాగంలోని ఆపరేషన్‌ థియేటర్ల లాంటివి కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో కూడా ఉండవన్నారు. అత్యంత ఖరీదైన మందులు సైతం జీజీహెచ్‌లో అందుబాటులో ఉన్నాయని నిపుణులైన వైద్యులు మెరుగైన వైద్యసేవలు అందించబట్టే ప్రభుత్వాసుపత్రికి రోగులు తండోపతండాలుగా తరలివస్తున్నారన్నారు. రోగుల తాకిడి పెరిగినా.. వైద్య సిబ్బంది సంఖ్య పెరగకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నమాట వాస్తవమేనన్నారు. 


తొలిరోజే మార్పులకు శ్రీకారం 

సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ తొలిరోజే ఆసుపత్రిలో మార్పులకు శ్రీకారం చుట్టారు. వార్డుల్లో రోగులకు అందుతున్న వైద్యసేవల తీరును పరిశీలించారు. క్యాజువాలిటీలో మరుగుదొడ్లకు మరమ్మతులు చేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఫార్మసీలోనూ, డయాగ్నొస్టిక్‌ బ్లాక్‌లోనూ అదనపు కౌంటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం ఆసుపత్రి అధికారులు, సిబ్బందితో మాట్లాడుతూ రోగులకు సత్వర వైద్యసేవలందించి ఫిర్యాదులు రాకుండా చూడాలంటూ దిశానిర్దేశం చేశారు. 

Updated Date - 2021-11-02T06:24:33+05:30 IST