18నుంచి.. ‘రైతు కోసం తెలుగుదేశం’: దేవినేని

ABN , First Publish Date - 2021-09-15T01:56:49+05:30 IST

కృష్ణా: రైతులకు జరుగుతున్న అన్యాయంపై వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు.. ఈ నెల 18వ తేదీ నంచి రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు

18నుంచి.. ‘రైతు కోసం తెలుగుదేశం’: దేవినేని

కృష్ణా: రైతులకు జరుగుతున్న అన్యాయంపై వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు.. ఈ నెల 18వ తేదీ నంచి రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. మంగళవారం మైలవరం టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని రైతులకు గోరంత ఇచ్చి.. కొండంత ఇచ్చినట్లుగా ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. రైతు భరోసా కేంద్రాలన్నీ.. బోగస్ కేంద్రాలని చెప్పారు. గత సంవత్సరం అమ్మిన ధాన్యం డబ్బులను ఇప్పటికీ ఇవ్వలేదని మండిపడ్డారు.


రైతుల కష్టాలను పక్కనబెట్టి.. పోలవరం ఏమయిందని కన్నబాబు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో ఇరిగేషన్ మంత్రి ఉన్నాడా.. అని ప్రశ్నించారు. పోలవరం నిర్వాసితులకు కనీసం వరద సాయం కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. కృష్ణా, గోదావరి నదులన్నింటినీ తీసుకెళ్లి బోర్డుల చేతిలో పెట్టేశారని ధ్వజమెత్తారు. కేసుల భయంతోనే సీఎం జగన్‌మోహన్ రెడ్డి నోరు మెదపడం లేదన్నారు.


ఈ 28 నెలల్లో ఏం ఉద్దరించారో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 15లక్షల మంది కౌలు రైతులుంటే 41వేల మందినే చూపించారన్నారు. కరెంటు బిల్లుల రూపంలో రూ.11వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపి.. దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. చదువుకున్న వాళ్ళతో సినిమా టికెట్లు, మటన్ కొట్టిస్తారా.. కాలేజీలు తనఖా పెట్టి అప్పులు తెస్తారా.. అంటూ ఫైర్ అయ్యారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి పరాభవం తప్పదని ఆయన హెచ్చరించారు.

Updated Date - 2021-09-15T01:56:49+05:30 IST