ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు వల

ABN , First Publish Date - 2021-12-08T06:12:02+05:30 IST

ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు వల

ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు వల
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న నందిగామ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి

 రూ.8 లక్షలు స్వాహా చేసిన ఇద్దరు కేటుగాళ్ల అరెస్టు

ఒకరు తెలంగాణలోని రెడ్డిపల్లి ఉప సర్పంచ్‌

జగ్గయ్యపేట, డిసెంబరు 7: ఇంటి నుంచి ఉద్యోగం చేస్తూ వేల రూపాయలు సులువుగా సంపాదించండి అంటూ దినపత్రిల్లో ఆకర్షణీయమైన ప్రకటనలు ఇచ్చి నిరుద్యోగుల నుంచి రూ.8 లక్షల వరకు వసూలు చేసిన తెలంగాణకు చెందిన ఇద్దరు ఘరానా మోసగాళ్లను అరెస్టు చేసినట్టు నందిగామ డీఎస్పీ జి.నాగేశ్వరరెడ్డి తెలిపారు. మంగళవారం జగ్గయ్యపేట పోలీస్‌ స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు. ‘తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా భీమారం మండలం రెడ్డిపల్లి ఉపసర్పంచ్‌ దాసరి రవి (29),  దాసరి సంపత్‌ (27) ఇంటి వద్దనే ఉద్యోగాలు పేరుతో పత్రికల్లో ప్రకటనలు ఇవ్వగా.. పట్టణంలోని కాగితాల బజారుకు చెందిన నిరుద్యోగ యువతి(19) గత సెప్టెంబరు 18న వారికి ఫోన్‌ చేసింది. అకౌంట్‌ వెరిఫికేషన్‌, ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌, ల్యాప్‌టాప్‌, ఫోన్ల కోసం అని చెప్పి ఆమె వద్ద విడతల వారీగా రూ.65,500 నిందితులు తమ ఖాతాల్లో వేయించుకున్నారు. మళ్లీ రూ.7 వేలు చెల్లించాలనడంతో ఉద్యోగం వద్దు..తాను పంపిన నగదు తిరిగి ఇచ్చేయ్యాలని యువతి కోరింది. అప్పటి నుంచి నిందితులు ఫోన్‌ ఎత్తడం లేదు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేయగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 40 మంది వద్ద ఇలా రూ.8 లక్షల వసూలు చేశారని తేలింది.’ అని డీఎస్పీ తెలిపారు. నిందితులు బిహార్‌ వెళ్లి ఈ తరహా నేరాలపై శిక్షణ పొంది వచ్చిన రెడ్డిపల్లి గ్రామానికి చెందిన దాసు రమేష్‌ డైరెక్షన్‌లో మోసాలకు పాల్పడ్డారని ఆయన చెప్పారు. వీరిపై తెలంగాణ రాష్ట్రం రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రెండు, విశాఖపట్నంలో రెండు కేసులు నమోదైనట్టు డీఎస్పీ తెలిపారు. రెడ్డిపల్లి గ్రామంలో ఇదే తరహాలో మోసాలకు పాల్పడటంపై శిక్షణ ఇచ్చే 8 మంది ఉన్నట్టు తమ విచారణలో తేలిందన్నారు. నిందితుల వద్ద రూ.40 వేలు, సిమ్‌కార్డులు, ఆండ్రాయిడ్‌ ఫోన్‌, ఏటీఎం కార్డులు, 2 సాధారణ ఫోన్లు, పాస్‌బుక్‌ను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ వివరించారు. కేసు ఛేదనలో క్రియాశీలకంగా వ్యవహరించిన కానిస్టేబుల్స్‌ వి.లక్ష్మీనారాయణ, సురేష్‌కుమార్‌కు రివార్డును ప్రకటించారు.
Updated Date - 2021-12-08T06:12:02+05:30 IST