ఎఫ్‌ఎంసీల జారీపై మార్గదర్శకాలు

ABN , First Publish Date - 2021-07-24T06:37:29+05:30 IST

విజయవాడ తూర్పు మండల రెవెన్యూ కార్యాలయం ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్ల (ఎఫ్‌ఎంసీ) జారీకి దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

ఎఫ్‌ఎంసీల జారీపై మార్గదర్శకాలు

  ఆంధ్రజ్యోతి కథనం కోట్‌ చేస్తూ అంతర్గత సర్క్యులర్‌ 

విజయవాడ, జూలై 23 (ఆంధ్రజ్యోతి):  విజయవాడ తూర్పు మండల రెవెన్యూ కార్యాలయం ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్ల (ఎఫ్‌ఎంసీ) జారీకి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఆంధ్రజ్యోతిలో ‘ఎఫ్‌ఎంసీకి ఓ రేటు’ శీర్షికన ప్రచురితమైన కథనంపై జిల్లా రెవెన్యూ యంత్రాంగం స్పందించి ఎఫ్‌ఎంసీల జారీపై మార్గదర్శకాలు జారీ చేసింది. సబ్‌ కలెక్టర్‌ ప్రవీణ్‌ చంద్‌ స్పందిస్తూ ఎఫ్‌ఎంసీల జారీ సులభతరం చేయాలని నిర్దేశించారు. ఇదే క్రమంలో కిందిస్థాయి సిబ్బంది నిర్వాకాలపై తూర్పు తహసీల్దార్‌ ఎల్లారావు కూడా సీరియస్‌ అయ్యారు. అంతర్గతంగా సిబ్బందిని హెచ్చరించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎఫ్‌ఎంసీల జారీని సులభతరం చేయటం కోసం కొన్ని మార్గదర్శకాలను రూపొందించారు. వాటిని అంతర్గత సర్క్యులర్‌లో పొందుపరిచారు. అంతర్గత సర్క్యులర్‌లో ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురితమైన కథనంపై స్పందించారు. కథనం సారాంశం మొత్తాన్ని క్లుప్తంగా సర్క్యులర్‌లో క్రోడీకరించారు. ఇక మీదట ఎఫ్‌ఎంసీల జారీ విషయంలో డిప్యూటీ తహసీల్దార్‌, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, సీనియర్‌ అసిస్టెంట్‌, వార్డ్‌ రెవెన్యూ కార్యదర్శులకు నిర్దేశిస్తూ మొత్తం ఆరు మార్గదర్శకాలను నిర్దేశించారు. వీటికి అనుగుణంగా ఆరోపణలు, అవకతవకలకు వీలులేకుండా ఎఫ్‌ఎంసీ ధ్రువీకరణ పత్రాలను వేగంగా జారీ చేయాలని నిర్దేశించారు. విచారణాధికారులు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసినా, అవకతవకలకు పాల్పడినా తక్షణం శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తూర్పు తహసీల్దార్‌ ఎల్లారావు ఆ ఆదేశాలలో పేర్కొన్నారు.

మ్గాదర్శకాలివీ..

 మరణించిన వ్యక్తి మండల పరిధిలో నివాసి అయి ఉండాలి.

 మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులు అందరూ విచారణకు అందుబాటులో ఉండవలసిన అవసరం లేదు. అందుబాటులో ఉన్న కుటుంబసభ్యుల నుంచి మాత్రమే వాంగ్మూలము తీసుకోవాలి.

 పంచనామా చేసే విషయంలో.. మృతుడు/మృతురాలు ప్రాంతానికి చెందిన బాధ్యతాయుత వ్యక్తులే పంచనామాదారులుగా ఉండాలి.

  మరణించిన వ్యక్తి  కుటుంబ సభ్యుల (పిల్లలు)లో ఎవరైనా దూర ప్రాంతంలో ఉంటే వారిని విచారణ కోసం ఒత్తిడి చేయకూడదు.

  కార్యాలయం నుంచి అభ్యంతరాల స్వీకరణకు 7 రోజుల వ్యవధిగల నోటీసును జారీ చేసినపుడు మృతుడు/ మృతురాలు నివశించే వార్డు సచివాలయంలో తప్పనిసరిగా ప్రచురించాలి.

  ఎఫ్‌ఎంసీకి సంబంధించిన దరఖాస్తులు రాగానే వార్డు రెవెన్యూ సెక్రటరీలు వెంటనే ప్రాథమిక విచారణ చేసి వారి రిమార్కులతో 3 రోజులలోపు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ లాగిన్‌కు పంపించాలి.


Updated Date - 2021-07-24T06:37:29+05:30 IST