టైలరింగ్‌, కార్పెంట్‌ షాపుల దగ్ధం

ABN , First Publish Date - 2021-02-01T06:32:18+05:30 IST

స్థానిక రథశాల పక్కన ఆదివారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో టైలరింగ్‌ షాపు, కార్పెంట్‌ షాపు పూర్తిగా దగ్ధమయ్యాయి.

టైలరింగ్‌, కార్పెంట్‌ షాపుల దగ్ధం

ఆగిరిపల్లి, జనవరి 31 : స్థానిక రథశాల పక్కన ఆదివారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో టైలరింగ్‌ షాపు, కార్పెంట్‌ షాపు పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురుగా ఉన్న శోభనాచలస్వామి దేవస్థానానికి చెందిన రథశాల షాపుల సముదాయంలోని టైలరింగ్‌ దుకాణంలో తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో మంటలు వ్యాపించాయి. రథశాలకు నైట్‌వాచ్‌మెన్‌గా ఉంటున్న గోపాల్‌ వెంటనే అప్రమత్తమై స్థానికులను నిద్రలేపి, పోలీసులకు, అగ్నిమాపకశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై పి.కిషోర్‌ సిబ్బందితో ఘటనా స్థలానికి  చేరుకొని స్థానికుల సాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. నూజివీడు నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో రెండు షాపుల్లోని వస్తు సామగ్రి, దుస్తు లు, మిషన్లు, టేకు, వేప కలప పూర్తిగా కాలి బూడిదయ్యాయి. రూ.5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు.   

నైట్‌వాచ్‌మెన్‌కు నజరాన

 రథశాల వద్ద విధి నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించిన నైట్‌వాచ్‌మెన్‌ గోపాల్‌ను దేవస్థానం ఈవో శ్రీనివాసరావు అభినందించి రూ.వెయ్యి నగదు బహుమతి అందించారు.  


Updated Date - 2021-02-01T06:32:18+05:30 IST