భారీగా బాణసంచా

ABN , First Publish Date - 2021-10-25T06:28:16+05:30 IST

దీపావళి సంబరాలను అంబరాన్నంటించే బాణసంచా.. పెద్ద ఎత్తున జిల్లాకు దిగుమతి అయింది.

భారీగా బాణసంచా

శివకాశీ, చైనాల నుంచి దిగుమతి 

గన్నవరం గోడౌన్లలో నిల్వ

గొల్లపూడి హోల్‌సేల్‌ మార్కెట్‌కూ సరుకు 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : దీపావళి సంబరాలను అంబరాన్నంటించే బాణసంచా.. పెద్ద ఎత్తున జిల్లాకు దిగుమతి అయింది. గన్నవరం, విజయవాడ, గొల్లపూడిలకు భారీగా సరుకు చేరింది. పండుగకు పక్షం రోజుల ముందుగానే 90శాతానికి పైగా సరుకును వ్యాపారులు దిగుమతి చేసుకున్నారు. శివకాశీతో పాటు చైనా సరుకు కూడా దిగుమతి అయింది. శివకాశీ నుంచి సింహభాగం స్టాండర్డ్‌ బ్రాండ్‌ను దిగుమతి చేసుకోగా, స్థానికంగా స్వయం ఉపాధి కేంద్రాల ద్వారా తయారు చేసిన మందుగుండు సామగ్రిని మరికొంత దిగుమతి చేసుకున్నారు. చైనా బ్రాండ్లు కూడా పోటాపోటీగా మన మార్కెట్‌లోకి వచ్చాయి. చైనా  బాణసంచాపై సోషల్‌ మీడియాలో అనేక రకాల ప్రచారం జరుగుతున్నప్పటికీ.. ఆరోగ్యంపై ప్రభావం చూపించే విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి గతంలోనూ ఇప్పుడు కూడా ఎలాంటి ప్రకటనలూ విడుదల కాలేదు. దీనికి తోడు స్టాండర్డ్‌తో సమానస్థాయిలో కూడా ఉండటం వల్ల డిమాండ్‌ మేరకే వ్యాపారులు దిగుమతి చేసుకున్నట్టు తెలుస్తోంది. పెద్ద బాణసంచా వ్యాపారులు గన్నవరం శివారు ప్రాంత గ్రామాల్లోని గోడౌన్లలో భారీగా సరుకును నిల్వ చేశారు. నేరుగా గోడౌన్ల నుంచే హోల్‌సేల్‌ వ్యాపారాలు నిర్వహించనున్నారు. ప్రజలకు కూడా ఈ గోడౌన్ల నుంచే టపాసులు విక్రయిస్తారు. విజయవాడలోని 60 మందికి పైగా లైసెన్స్‌ కలిగిన బాణసంచా వ్యాపారులు సరుకును దిగుమతి చేసుకుని తమ గోడౌన్‌ పాయింట్లలో నిల్వ ఉంచారు. నగరంలో టపాసుల విక్రయ స్టాల్స్‌ను ఏర్పాటు చేసేందుకు కార్పొరేషన్‌ టెండర్ల ప్రకటన కోసం వీరంతా ఎదురు చూస్తున్నారు. గొల్లపూడి హోల్‌సేల్‌ మార్కెట్‌కు కూడా బాణసంచా భారీగానే చేరింది. 


వెలుగులు నింపేనా ? 

గత ఏడాది కరోనా మొదటి దశలో అనేక ఆంక్షలను, ఇబ్బందులను బాణసంచా వ్యాపారులు చవిచూడాల్సి వచ్చింది. ఈ ఏడాది కరోనా ప్రభావం కాస్త తగ్గినా, సెకండ్‌ వేవ్‌లో చాలా కుటుంబాలను కరోనా బలంగా దెబ్బతీసింది. ఎంతో మంది కుటుంబ సభ్యులను కోల్పోయారు. దీనికితోడు ఆర్థిక ఇబ్బందులు కూడా పెరిగాయి. మరోపక్క పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడంతో సామాన్యులు ఎంత వరకు బాణసంచా కొనుగోలు చేస్తారన్నది సందేహమే. వ్యాపారులు ఆశించిన స్థాయిలో విక్రయాలు జరుగుతాయో లేదో చూడాల్సిందే. 

Updated Date - 2021-10-25T06:28:16+05:30 IST