ఎరువు బరువే!

ABN , First Publish Date - 2021-10-14T06:35:01+05:30 IST

జిల్లాలో ఎరువుల కొరత రైతులను కుంగదీస్తోంది.

ఎరువు బరువే!

జిల్లాలో కాంప్లెక్స్‌, పొటాష్‌ ఎరువుల కొరత

ప్రైవేటు వ్యాపారుల వద్ద బస్తాకు రూ.100 అదనం

చోద్యం  చూస్తున్న వ్యవసాయశాఖ


ఆంధ్రజ్యోతి- మచిలీపట్నం : జిల్లాలో ఎరువుల కొరత రైతులను కుంగదీస్తోంది. ప్రైవేటు వ్యాపారులు, డీలర్లు నిర్ణయించిన ధర చెల్లిస్తేనే రైతులకు కాంప్లెక్స్‌ ఎరువులు అందుతున్నాయి. ఆర్‌బీకేలు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్‌లు), హోల్‌సేల్‌ వ్యాపారులు, కంపెనీ గిడ్డంగులు, ఏపీ మార్క్‌ ఫెడ్‌ ద్వారా ఎరువులను అందుబాటులో ఉంచుతున్నట్టు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నా, ఆచరణలో అమలు జరగడం లేదు. అదునులో ఎరువు వేయకపోతే పంట దిగుబడి తగ్గిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.


పొటాష్‌ ఎక్కడ?

మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ (ఎంవోపీ)ని  ఆర్‌బీకేలకు, పీఏసీఎస్‌లకు మాత్రమే ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు. రైతులు కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం ఉండడం లేదు. వరి పైరు చిరుపొట్ట్ట దశలో ఉన్నపుడే ఎకరానికి 25 నుంచి30 కిలోల పొటాష్‌ ఎరువును వాడాలి. కానీ అది లభ్యం కావడంలేదని, ఇలా అయితే సాగు చేసినా ఫలితం ఉండదని రైతులు అంటున్నారు.


పెరిగిన ఎరువుల ధరలు ఇలా.. 

ఎరువుల ధరలు రెండున్నర నెలల వ్యవధిలో భారీగా పెరిగాయి. గతంలో 50 కిలోల 20:20:0:13 రకం ఎరువు ధర రూ.974 ఉండగా, నేడు రూ.1200కు చేరింది. 14:35:14 రకం ఎరువు ధర రూ.1236 నుంచి రూ.1450కి, 28:28:0 రకం ఎరువు రూ.1250 నుంచి రూ.1500కు, 10:26:26 రకం రూ.1250 నుంచి రూ.1300కు, పొటాష్‌ ధర రూ.800 నుంచి రూ.1000కి చేరాయి. వ్యాపారులు అదనంగా మరో రూ.వంద పెంచి విక్రయిస్తున్నారు. పొటాష్‌, 28:28:0 బస్తా ధర రూ.1750 వరకు పెరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. అన్ని కంపెనీలకు సంబంధించిన యూరియా 45 కిలోల బస్తా రవాణా చార్జీలు కలుపుకుని రూ.274కు విక్రయిస్తున్నారు. ఎరువుల దుకాణాల్లో ఇదే బస్తాను రూ.330కి పైగా విక్రయిస్తున్నారు. 


పూర్తిస్థాయిలో ఎరువులు అందేదెపుడో!

జిల్లాకు ఈ నెల నాలుగో తేదీకి 70 వేల టన్నుల యూరియా రావాల్సి ఉండగా, 46,900 టన్నులు వచ్చింది.  మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ 14,000 టన్నులకు గాను 7,540, కాంప్లెక్స్‌ ఎరువులు 56 వేల టన్నులకు గానూ, 43,500, సూపర్‌ ఫాస్పేట్‌ తొమ్మిది వేల టన్నులకు గాను ఏడు వేల టన్నులు వచ్చింది. డీఏపీ మాత్రమే పూర్తిస్థాయిలో వచ్చింది.  అన్ని రకాల ఎరువులూ కలిపి మొత్తం 1,72,500 టన్నులు రావాల్సి ఉండగా, 1,29,640 టన్నులు మాత్రమే దిగుమతి అయ్యింది. ఎరువుల నిల్వలు ఉన్నా, నిర్ణయించిన ధరకు దొరకడం లేదు.


అదును తప్పుతోంది

నాలుగు ఎకరాల భూమిని కౌలుకు సాగు చేస్తున్నా. పైరు చిరు పొట్ట దశలో ఉంది. ఆర్‌బీకేల్లో పొటాష్‌, కాంప్లెక్స్‌ ఎరువులు దొరకడంలేదు. ఎన్ని రోజులు తిరిగినా, ఎరువులు లేవనే సమాధానమే వస్తోంది. పైరుకు సకాలంలో పొటాష్‌ అందించకపోతే దిగుబడిపై ప్రభావం చూపుతుంది. వ్యవసాయశాఖ అధికారులు పట్టించుకోవడంలేదు. - కోడూరు బుచ్చిబాబు, చెన్నూరు, పెడన మండలం 

Updated Date - 2021-10-14T06:35:01+05:30 IST