కూత మార్చిన గీత

ABN , First Publish Date - 2021-02-08T06:37:29+05:30 IST

కబడ్డీ... కబడ్డీ... కబడ్డీ... అన్న కూత వారి రాతను మార్చింది. పాఠశాల స్థాయిలో మొదలు పెట్టిన ఆ కూతను డిగ్రీ పట్టాలు చేతపట్టుకునే వరకు ఆపలేదు. ఆ కూతే వారికి కొలువులకు దారి చూపించింది.

కూత మార్చిన గీత
ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన కబడ్డీ క్రీడాకారులు, కోచ్‌లు

 కబడ్డీ క్రీడాకారుల ఆత్మీయ సమ్మేళనం

అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేయాలని నిర్ణయం

విజయవాడ సిటీలైఫ్‌, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి) : కబడ్డీ... కబడ్డీ... కబడ్డీ... అన్న కూత వారి రాతను మార్చింది. పాఠశాల స్థాయిలో మొదలు పెట్టిన ఆ కూతను డిగ్రీ పట్టాలు చేతపట్టుకునే వరకు ఆపలేదు. ఆ కూతే వారికి కొలువులకు దారి చూపించింది. జాతీయ, రాష్ట్రస్థాయిల్లో  క్రీడాకారులుగా గుర్తింపు తీసుకొచ్చింది. జిల్లాలో కబడ్డీ అసోసియేషన్‌ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు వివిధ స్థాయిలో ఆడి వివిధ రంగాల్లో స్థిరపడిన క్రీడాకారులు, ఇప్పటికీ అదే కూతను కొనసాగిస్తున్న వారు ఒక కుటుంబంగా కలిశారు. విజయవాడ శేషసాయి కల్యాణ మండపంలో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం జరిగింది. జిల్లాలో 1975వ సంవత్సరంలో కబడ్డీ అసోసియేషన్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 600 మంది క్రీడాకారులు కబడ్డీలో నైపుణ్యాన్ని సంపాదించారు. వీరిలో ఎక్కువ మంది జాతీయ, రాష్ట్రస్థాయిల్లో ఆడారు.  క్రీడాకారులను తయారు చేసిన కోచ్‌లు 30 మంది వరకు ఉన్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఆడిన క్రీడాకారుల్లో సుమారుగా 150 మంది వరకు పోలీసు, రైల్వే, ఆర్టీసీ, ఇన్‌కమ్‌టాక్స్‌ శాఖల్లో ఉద్యోగాలను సంపాదించారు. మరికొంతమంది వివిధ చోట్ల వ్యాయామ ఉపాధ్యాయులు, ఫిజికల్‌ డైరెక్టర్లుగా పనిచేస్తున్నారు. వాళ్లందరిని ఒక వేదిక మీదకు తీసుకొచ్చింది జిల్లా కబడ్డీ అసోసియేషన్‌. ఈ ఆత్మీయ సమ్మేళనానికి జిల్లా నలుమూలల నుంచి 250 మంది పాత, కొత్త క్రీడాకారులు కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. ఆటపాటలతో సందడిగా గడిపారు. కబడ్డీలో మెలకువలను నేర్పిన కోచ్‌లను సత్కరించారు.


అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేస్తాం 

 శ్రీకాంత్‌, కబడ్డీ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి

దేశంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్‌కు మంచి గుర్తింపు ఉంది. ఇక్కడ శిక్షణ పొందిన క్రీడాకారులు ఏజట్టులో ఆడినా రాణిస్తారు. ఇది ఇక్కడితో ఆగిపోకూడదు. జిల్లా నుంచి చాలామంది క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఆడారు. ఇక్కడి నుంచి అంతర్జాతీయ స్థాయికి క్రీడాకారులను పంపాలనుకుంటున్నాం. జిల్లాలో కబడ్డీలో రాణించి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వాళ్లంతా నెలకు రూ.1000 అందజేస్తారు. ఆ సొమ్ముతో ఆటలో బాగా రాణిస్తున్న క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయిలో ఆడే విధంగా తయారు చేస్తాం. ఇలా సేకరించిన నిధులతో జిల్లా నుంచి ఎంత కాదన్నా ముగ్గురు, నలుగురు క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి  తయారు చేయవచ్చు.








Updated Date - 2021-02-08T06:37:29+05:30 IST