ప్రతిరోజూ స్పందనతో సమస్యల పరిష్కారం
ABN , First Publish Date - 2021-07-24T06:41:40+05:30 IST
వారానికి ఒక రోజే కాకుండా ఇకపై ప్రతిరోజు స్పందన కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల ప్రజలకు సత్వర న్యాయం చేకూరుతుందని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ అన్నారు.

ఎస్పీసిద్ధార్థ కౌశల్
మచిలీపట్నం టౌన్, జూలై 23 : వారానికి ఒక రోజే కాకుండా ఇకపై ప్రతిరోజు స్పందన కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల ప్రజలకు సత్వర న్యాయం చేకూరుతుందని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ అన్నారు. మచిలీపట్నం ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ప్రతి రోజూ స్పందన కార్యక్రమాన్ని ఎస్పీ ప్రారంభించి ప్రసంగించారు. ప్రజలకు మరింత చేరువయ్యే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. మధ్యహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు సమస్యలను ఎస్పీ కార్యాల యంలో తెలియజేయవచ్చన్నారు. ఫిర్యాదు దారులతో నేరుగా మాట్లాడుతూ, విచారణ జరిపి 24 గంటల్లో న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. విదేశాల్లో ఉన్న వారు కూడా వీడియో కాల్ ద్వారా మాట్లాడే అవకాశం కల్పించామన్నారు. ఇందుకు వాట్సాప్ నెంబర్ 91829 90135, 08672-254200కు కాల్ చేయవచ్చన్నారు.
తొలి రోజు 12 ఫిర్యాదులు
మొదటి రోజు నిర్వహించిన స్పందనలో 12 ఫిర్యాదులు అందాయి. స్పందనకు హాజరయ్యే ఫిర్యాదుదారులకు ఒక షెడ్డు, రిస్పెషన్ కౌంటర్ ఏర్పాటు చేశారు. ఏఆర్ ఏఎస్పీ సత్యనారాయణ, డీఎస్పీలు ధర్మేంద్ర, మసుంబాషా, భరత్ మాతాజీ, రాజీవ్‌కుమార్, మురళీకృష్ణ, విజయ్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు.
సీసీ కెమెరాలకు మరమ్మతులు
జిల్లాలో పనిచేయని సీపీ కెమెరాలపై ఎస్పీ సిద్ధార్థ కౌశల్ దృష్టి సారించారు. జిల్లాలో 4700 సీసీ కెమెరాలుండగా, 300 సరిగా పనిచేయడం లే దు. మచిలీపట్నంలో 108 కెమెరాలకు 18 పనిచేయడం లేదు. నేర దర్యాప్తుకు దోహదపడే సీసీ కెమెరాల మరమ్మతులపై దృష్టి సారిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.