ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి
ABN , First Publish Date - 2021-04-06T06:29:33+05:30 IST
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి
ఉంగుటూరు, ఏప్రిల్ 5 : పీవో,ఏపీవోలు, ఇతర పోలింగ్ సిబ్బందిని సమన్వయపరుచుకుంటూ ప్రశాంత వాతావరణంలో, పకడ్బందీగా ఎన్నికలు జరిగేలా చూడాల్సిన బాధ్యత జోనల్ అధికారులపై వుందని ఎంపీడీవో కె.జ్యోతి అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో జోనల్, రూట్ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా జరగాలంటే జోనల్ అధికారులు తమ విధులను సమర్ధవంతంగా నిర్వర్తించాలన్నారు. అన్ని పోలింగ్ స్టేసన్లను ముందుగానే పరిశీలించి, అక్కడ లోటుపాట్లను సరిచేయాలని తెలిపారు. ఎన్నికల రోజు తమ పరిధిలోని ప్రతి పోలింగ్‌స్టేషన్‌ను రెండు, మూడుసార్లు సందర్శించి పోలింగ్ విధానాన్ని పరిశీలించాలన్నారు. సమయానికి పోలింగ్ ప్రారంభమయ్యేలా, సకాలంలో ముగిసేలా చర్యలు తీసుకోవాలని, ఎన్నికల సరళి సమాచారాన్ని ఎప్పటికప్పుడు సక్రమంగా అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ విజయకుమార్, సూపరింటెండెంట్ కె.రమణబాబు, సీనియర్ అసిస్టెంట్ ప్రభాకరరావు. మధు తదితరులు పాల్గొన్నారు.