రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-07-24T06:14:23+05:30 IST

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి: కలెక్టర్‌

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి: కలెక్టర్‌
కోకిలంపాడులో ఈ-క్రాప్‌ నమోదును పరిశీలిస్తున్న కలెక్టర్‌ నివాస్‌

కోకిలంపాడు(తిరువూరు), జూలై 23: రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోందని, సబ్సిడీ పథకాలు పొందాలంటే సాగుకు ఈ-క్రాప్‌ తప్పక చేయించాలని కలెక్టర్‌ జె.నివాస్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని కోకిలంపాడులో ఈ-క్రాప్‌ నమోదును ఆయన పరిశీలించారు. రైతుభరోసా, ఉచిత విద్యుత్‌, పంట రుణాలు, ఉచిత పంటల బీమా, వడ్డీలేని రుణాలు, ఇన్‌పుట్‌ సబ్సిడీ, భూసార పరీక్షలు, దిగుబడి అయిన పంటకు మార్కెటింగ్‌ సౌకర్యం, మద్దతు ధర కల్పించడం, సబ్సిడీపై నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు పొందవచ్చని ఆయనన తెలిపారు. గ్రామంలో కల్వర్టు సమస్యను రైతులు కలెక్టర్‌కు చెప్పారు. సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు. గ్రామ సచివాలయాలన్ని సందర్శించారు. తహసీల్దార్‌ నరసింహారావు, ఎంపీడీవో బాలవెంకటేశ్వరరావు పాల్గొన్నారు. 

వరదలపై అధికారులు అప్రమత్తం

తిరువూరు: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఉత్పన్నమయ్యే ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు కలెక్టర్‌ జె.నివాస్‌ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో బయోగ్యాస్‌ ప్లాంట్‌, కంపోస్ట్‌ యార్డులను మున్సిపల్‌ అధికారులతో కలిసి ఆయన పరిశీలించాక విలేకరులతో మాట్లాడారు. ఎగువన భారీ వర్షాల వల్ల ప్రకాశం బ్యారేజ్‌కి వరద వచ్చి చేరుతోందన్నారు. శుక్రవారం ఉదయానికి 50 వేల క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజ్‌కి వచ్చిందన్నారు. పులిచింతల నుంచి మరో 50 వేల క్యూసెక్కుల నీరు బ్యారేజ్‌కి చేరుతుందని ఈ రాత్రికి మరింత వరదనీరు బ్యారేజిలోకి వచ్చే అవకాశం ఉందన్నారు. బ్యారేజ్‌ అన్ని గేట్లు పైకెత్తి నీటిని దిగువకు వదులుతున్నామని, లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ముంపునకు గురికాకుండా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. 


Updated Date - 2021-07-24T06:14:23+05:30 IST