డ్వాక్రా గ్రూపుల రుణాల గోల్‌మాల్‌పై ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-11-02T06:26:50+05:30 IST

డ్వాక్రా గ్రూపుల రుణాల గోల్‌మాల్‌పై ఫిర్యాదు

డ్వాక్రా గ్రూపుల రుణాల గోల్‌మాల్‌పై ఫిర్యాదు

తిరువూరు, నవంబరు 1: తమ గ్రూపులకు రుణాలు ఇవ్వకుండానే అప్పు చెల్లించాలంటూ వెలుగు సిబ్బంది ఇబ్బంది పెడుతున్నారని పలువురు డ్వాక్రా గ్రూపు మహిళలు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద మహిళలు ఆందోళన నిర్వహించాక స్పందన కార్యక్రమంలో వినతిపత్రం అందించారు. వావిలాల శివారు రాజుగూడెం గ్రామానికి చెందిన అంబేడ్కర్‌, నవోదయ, ప్రగతి, మధర్‌థెరెస్సా, శ్రీలక్ష్మి, హరిత గ్రూపులకు 2010లో వీవో అకౌంట్‌నుంచి రూ.3.30 లక్షలు తమ గ్రూపుల సభ్యుల ఖాతాలకు జమ అయినట్లు వెలుగు సిబ్బంది తెలిపారని సభ్యులు పేర్కొన్నారు. తదుపరి గ్రూపు సభ్యుల ప్రమేయం లేకుండానే తమ ఖాతాల్లో ఉన్న నగదును ఎటుంటి సంతకాలు, తీర్మానాలు లేకుండా డ్రా చేసుకున్నారని వారు ఆరోపించారు. ప్రస్తుతం 2010లో తమ ఖాతాల్లో జమ అయిన రుణాలు తిరిగి చెల్లించాలని వెలుగు అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదివరకు తీసుకున్న రుణాలు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నామని, తాము తీసుకోని నగదును చెల్లించమని ఒత్తిడి తెస్తున్నారని, దీనిపై పూర్తి దర్యాపు చేయించి తమకు న్యాయం చేయాలని తహసీల్దార్‌ స్వర్గం నరసింహారావుకు మహిళలు వినతిపత్రం అందించారు.  ఆందోళనలో విజయలక్ష్మి, విజయకుమారి, నిర్మల, నాగలక్ష్మి, సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-02T06:26:50+05:30 IST