థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొంటాం
ABN , First Publish Date - 2021-08-19T05:39:54+05:30 IST
‘కరోనా థర్డ్ వేవ్ వస్తే సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు యంత్రాంగం మొత్తం సర్వసన్నద్ధమై ఉంది.
ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ బెడ్స్ పెంపు
ప్రతి ఆసుపత్రిలోనూ ఆక్సిజన్ ప్లాంట్
వైద్యులు, అదనపు సిబ్బంది నియామకాలు
21న పిల్లల వైద్య నిపుణులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు
వారం, పదిరోజులకొకసారి ఫీవర్ సర్వే
గ్రామస్థాయిలోనే కొవిడ్ కేర్ సెంటర్లు
‘ఆంధ్రజ్యోతి’తో డీఎంహెచ్‌వో సుహాసిని
‘కరోనా థర్డ్ వేవ్ వస్తే సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు యంత్రాంగం మొత్తం సర్వసన్నద్ధమై ఉంది. కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ముప్పును ఎదుర్కొనేందుకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నాం.’ అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ ఎం.సుహాసిని చెప్పారు.. కొవిడ్ మూడో దశ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో జిల్లాలో చేపట్టిన ముందస్తు చర్యల గురించి డీఎంహెచ్‌వో సుహాసిని ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... - ఆంధ్రజ్యోతి, విజయవాడ
ఆక్సిజన్ పడకల పెంపు
కరోనా సెకండ్ వేవ్‌లో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కొవిడ్ ఆసుపత్రుల్లో ఐసీయూ, ఆక్సిజన్ పడకలను పెంచుతున్నాం. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సహా జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ పడకలకు కూడా పైప్‌లైన్లు ఏర్పాటు చేసి, అన్ని బెడ్స్‌నూ ఆక్సిజన్ బెడ్స్‌గా మార్చుతున్నాం. సెకండ్ వేవ్‌లో కొవిడ్ చికిత్స చేసేందుకు జిల్లావ్యాప్తంగా 77 ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతులు ఇచ్చాం. థర్డ్‌వేవ్ పరిస్థితులను బట్టి అవసరమైతే జిల్లాలో న్యూరో, సర్జరీలు నిర్వహించే కొన్ని ఆసుపత్రులను మినహాయించి మిగిలిన ప్రైవేటు ఆసుపత్రులను కూడా కొవిడ్ ఆసుపత్రులుగా మారుస్తాం. 100 పడకలు దాటిన ప్రతి ఆసుపత్రిలోనూ 1000 ఎల్‌పీ సామర్థ్యంతో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ (పీఎస్‌ఏ ప్లాంట్)లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కొవిడ్ ఆసుపత్రులన్నింటిలో ప్లాంట్‌లను ఏర్పాటు చేస్తున్నాం. 50 పడకలతో ఐసీయూ సౌకర్యాలున్న ఆసుపత్రుల్లో ఎల్‌ఎంవో ట్యాంకుల్లో ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నాం. చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి కొవిడ్ ఆసుపత్రిలో ఎన్ని ఆక్సిజన్ బెడ్స్ ఉంటే, అన్నింటికీ డి-టైపు ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు సిద్ధంగా ఉంచాలని ఆదేశాలిచ్చాం. థర్డ్‌వేవ్ వచ్చి, తీవ్రస్థాయిలో ఉధృతి పెరిగినా ఎలాంటి సమస్య లేకుండా ఐదు నుంచి 10 శాతం ఆక్సిజన్ పడకలు రిజర్వ్‌లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం.
పిల్లలకు కొవిడ్ వస్తే..
థర్డ్‌వేవ్‌లో చిన్నపిల్లలపై వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతున్న నేపథ్యంలో ఆ దిశగానూ ఏర్పాట్లు చేస్తున్నాం. కరోనా సోకిన చిన్నపిల్లలకు మెరుగైన వైద్యసేవలందించేందుకు విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో 100 పడకలతో, కొత్త ఆసుపత్రిలో మరో 150 పడకలతో ప్రత్యేక వార్డును సిద్ధం చేస్తున్నాం. గన్నవరంలోని పిన్నమనేని సిద్ధార్థ, ఇబ్రహీంపట్నంలోని నిమ్రా ఆసుపత్రుల్లో కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతి పడకకూ నియోనాటల్ వెంటిలేటరు ఏర్పాటు చేస్తున్నాం. పిల్లలకు మూడు షిఫ్ట్‌ల్లో కొవిడ్ చికిత్స అందించేందుకు అనుభవం ఉన్న జనరల్ డ్యూటీ డాక్టర్లు, స్టాఫ్‌నర్సులు, ఎంఎన్‌వో, ఎఫ్‌ఎన్‌వో, ఇతర పారామెడికల్ సిబ్బంది, శానిటేషన్ వర్కర్స్‌ను ఇప్పటికే తీసుకున్నాం. మూడు నెలల కాలపరిమితితో తాత్కాలిక ప్రాతిపదికన ప్రత్యేకంగా చిన్నపిల్లల వైద్యనిపుణులకు ఈనెల 21న మచిలీపట్నంలోని డీఎం అండ్ హెచ్‌వో కార్యాలయంలో వాక్-ఇన్-ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాం. ఇందులో ఎంపికైన వైద్యనిపుణులకు నెలకు రూ.1.50 లక్షలు గౌరవ వేతనం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. థర్డ్‌వేవ్‌లో చిన్నారులెవరూ ఇబ్బందులు పడకుండా మెరుగైన వైద్యసేవలందించేందుకు వైద్యనిపుణులు సేవా దృక్పథంతో ముందుకు రావాలని కోరుతున్నాం.
గ్రామాల్లోనే కొవిడ్ కేర్ సెంటర్లు
జిల్లాలో కొవిడ్ తీవ్రతను గుర్తించేందుకు వారం, పది రోజులకొకసారి ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నాం. వైద్యసిబ్బంది ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారు. జ్వరాలు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారిలో కొవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు నిర్వహించి వారికి వైద్యసేవలు అందించేందుకు గ్రామస్థాయిలోనే కొవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే 845 కొవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటుకు ప్రణాళికను సిద్ధం చేశాం. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న బాధితులు ఈ కొవిడ్ కేర్ సెంటర్లకు వెళ్లి చికిత్సతోపాటు మందులు కూడా తీసుకోవచ్చు. ఇన్‌ఫెక్షన్ ఎక్కువైన బాధితులకు అక్కడే అత్యవసర వైద్యసేవలందించేందుకు వీలుగా రెండు, మూడు పడకలు, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను అందుబాటులో ఉంచుతాం. అప్పటికీ ఆరోగ్యం మెరుగుపడకపోతే ప్రభుత్వ అంబులెన్స్‌ల్లోనే పెద్దాసుపత్రులకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నాం.
అందరికీ వ్యాక్సిన్
కొవిడ్ టీకా అందరూ తీసుకోవలసిందే. థర్డ్‌వేవ్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ఇప్పటికే వేగవంతం చేశాం. పిల్లలకు వ్యాక్సిన్ అందుబాటులో లేకపోయినా, పుట్టబోయే పిల్లలకు వైరస్ సోకకుండా గర్భిణులకు, ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు వ్యాక్సిన్ వేస్తున్నాం. అయితే చాలామంది గర్భిణులు, తల్లులు టీకా తీసుకోవడానికి భయపడుతున్నారు. గర్భిణులు తన కడుపులో పెరుగుతున్న బిడ్డతోపాటు కుటుంబ సభ్యులను రక్షించుకునేందుకు కొవిడ్ టీకా తీసుకోవాలని అవగాహన కల్పిస్తున్నాం. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు ఒక లక్షా 50 వేల మందికి పైగా గర్భిణులు, తల్లులకు కొవిడ్ టీకాలు ఇచ్చాం. ఎవరికీ ఎలాంటి సమస్య ఎదురు కాలేదు.
వ్యాక్సిన్ కొరత లేదు
జిల్లాలో వ్యాక్సిన్ కొరత లేదు. ప్రభుత్వం పాఠశాలలను పునఃప్రారంభించిన నేపథ్యంలో జిల్లాలో ఉపాధ్యాయులకు కూడా కొవిడ్ టీకా అందించడంలో ప్రాధాన్య మిస్తున్నాం. ఇప్పటికే సగానికిపైగా ఉపాధ్యాయులు వ్యాక్సిన్ తీసుకున్నారు. జిల్లాలో 45 ఏళ్ల వయసు దాటినవారు సుమారు 12 లక్షల మంది ఉన్నారు. వారిలో 10 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చాం. మొత్తంగా ఇప్పటి వరకు జిల్లాలో 25 లక్షల వరకు టీకా డోసులు అందించాం.