దుర్గమ్మ దర్శన వేళలుమళ్లీ కుదింపు

ABN , First Publish Date - 2021-05-05T06:31:04+05:30 IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం బుధవారం నుంచి పాక్షిక కర్ఫ్యూ అమలు చేస్తున్నందున కనకదుర్గమ్మ దర్శనం వేళలను మళ్లీ కుదించారు.

దుర్గమ్మ దర్శన వేళలుమళ్లీ కుదింపు

ఉదయం 6.30 నుంచి 11 గంటల వరకే దర్శనం

 దుర్గామల్లేశ్వరులకు ఏకాంతంగానే నిత్యకైంకర్యాలు 

విజయవాడ, మే 4 (ఆంధ్రజ్యోతి) : కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం బుధవారం నుంచి పాక్షిక కర్ఫ్యూ అమలు చేస్తున్నందున కనకదుర్గమ్మ దర్శనం వేళలను మళ్లీ కుదించారు. కర్ఫ్యూ నేపథ్యంలో అమ్మవారి భక్తులకు బుధవారం నుంచి ఉదయం 6.30 నుంచి 11 గంటల వరకు మాత్రమే దర్శనానికి అనుమతించాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు. ఆర్జిత సేవలను పరోక్ష పద్ధతిలోనే కొనసాగించనున్నారు. శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్లకు నిత్యకైంకర్యాలను మాత్రం అర్చకులు నిర్దేశిత సమయాల్లో ఏకాంతంగానే నిర్వహించనున్నారు. సాధారణ రోజుల్లో ప్రతిరోజూ ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మవారి దర్శనాలు కొనసాగేవి. ఇటీవల కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తుండటంతో గత కొన్నాళ్లుగా ఉదయం 6.30 నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. తాజాగా బుధవారం నుంచి ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రభుత్వం కర్ఫ్యూ అమలు చేస్తుండటంతో ఉదయం 6.30 నుంచి 11 గంటల వరకు మాత్రమే అమ్మవారి దర్శనం కల్పించాలని నిర్ణయించినట్లు దేవస్థానం ఈవో డి.భ్రమరాంబ తెలిపారు.  


Updated Date - 2021-05-05T06:31:04+05:30 IST