ఇరిగేషన్‌ పనులపై శ్వేతపత్రం విడుదల చేయండి: దేవినేని ఉమా

ABN , First Publish Date - 2021-10-19T06:29:23+05:30 IST

ఇరిగేషన్‌ పనులపై శ్వేతపత్రం విడుదల చేయండి: దేవినేని ఉమా

ఇరిగేషన్‌ పనులపై శ్వేతపత్రం విడుదల చేయండి: దేవినేని ఉమా

విద్యాధరపురం, అక్టోబరు 18: వైసీపీ పాలన వచ్చిన తరువాత 29 నెలల కాలంలో జరిగిన ఇరిగేషన్‌ పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ఇరిగేషన్‌ రంగాన్ని అన్ని విధాలుగా నాశనం చేసిందని, పోలవరాన్ని రూ.912 కోట లిఫ్ట్‌ ఇరిగేషన్‌గా మార్చడంలో కమిషన్‌ మతలబు ఉందని ఆయన ఆరోపించారు. పక్క రాష్ట్రాల వారితో కుమ్మక్కయి జూరాల ప్రాజెక్టును గాలికొదిలేసి ముఖ్యమంత్రి, ఇరిగేషన్‌ మంత్రి మొద్దు నిద్రపోతున్నారని, ఇదే జరిగితే రాయలసీమ ఎడారిగా మారుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్టంలో సాగునీటి రంగాన్ని భ్రష్టు పట్టించారని, ముందుచూపు లేకుండా బాధ్యతారాహిత్యంగా జగన్మోహనరెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 29 నెలల కాలంలో ఒక్క ప్రాజెక్టును కూడా ప్రారంభించకపోగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయలేదని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి నోరు తెరవరని, ఇరిగేషన్‌ మంత్రి పత్తా లేరని ఎద్దేవా చేశారు. 13 జిల్లాలలోని నదులన్నిటినీ అనుసంధానం చేసి, 50 లక్షల ఎకరాలకు నీరిచ్చే 960 మెగావాట్ల విద్యుత్‌ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారన్నారు. ఈ ప్రాజెక్టుతో ఏడాదికి రెండువేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని, ఇటువంటి ప్రాజెక్ట్‌ను భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. 2015లో టీడీపీ హయాంలో పట్టిసీమ పెడితే, వట్టిసీమ అన్న వైసీసీ నాయకులు ఈ 29 నెలల్లో ఏ గడ్డి పీకారని నిలదీశారు. టీడీపీ హయాంలో రూ.65 వేల కోట్లు పెట్టి పోలవరాన్ని పరుగులు పెట్టించామన్నారు. జూరాల ప్రాజెక్టును గాలికి వదిలేశారని, ఆల్మట్టి ఎత్తు పెంచుతామంటే మాట్లాడడం లేదని అన్నారు. రాయలసీమ ద్రోహిగా జగన్మోహనరెడ్డి నిలిచిపోతారన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును 135 అడుగుల మేరకు తగ్గించి వైఎస్సార్‌ విగ్రహాన్ని పెట్టబోతున్నారని, పర్యాటక ప్రదేశంగా దానిని మార్చుతున్నారని ఆయన తెలిపారు.

Updated Date - 2021-10-19T06:29:23+05:30 IST