కృష్ణా యూనివర్సిటీని అభివృద్ధి చేస్తా
ABN , First Publish Date - 2021-02-06T06:42:48+05:30 IST
ప్రభుత్వ తోడ్పాటుతో కృష్ణా యూనివర్సిటీని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు యూనివర్సిటీ వీసీ కె.బి.చంద్రశేఖర్ తెలిపారు.

వసతీ గృహాల నిర్మాణానికి త్వరలో టెండర్లు
వీసీ చంద్రశేఖర్
ఆంధ్రజ్యోతి -మచిలీపట్నం : ప్రభుత్వ తోడ్పాటుతో కృష్ణా యూనివర్సిటీని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు యూనివర్సిటీ వీసీ కె.బి.చంద్రశేఖర్ తెలిపారు. తన చాంబరులో శుక్రవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. బాలుర, బాలికల వసతి గృహాల నిర్మాణానికి ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి అంచనాలు రూపొందించామన్నారు. 600 మంది ఉండేలా డిసెంబరు నాటికి వాటి నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. యూనివర్సిటీలో బయాలజీ, కెమిస్ట్రీ ల్యాబ్‌లను ఏర్పాటు చేసేందుకు రూ. 60నుంచి 70లక్షలు ఖర్చు అవుతుందని, వీటి ఏర్పాటుకు టెండర్లు పిలిచినట్లు వీసీ తెలిపారు. సైన్సు సబ్జెక్టులకు సంబంధించి యూనివర్సిటీ, అనుబంధ కలాశాలల్లో విద్యార్థులు అధికంగా చేరడం శుభపరిణామమన్నారు. ఇంగ్లీష్, తెలుగు సబ్జెక్టుల్లో పీజీ కోర్సుల్లో ఆశించినంత మేర విద్యార్థులు చేరలేదన్నారు. మరో విడత కౌన్సెలింగ్ నిర్వహించాలనుకుంటున్నామని వీసీ అన్నారు.
ఎం.ఫార్మసీ, ఇంజనీరింగ్ కళాశాలల ఏర్పాటు
యూనివర్సిటీ ప్రాంగణంలో ఇంజనీరింగ్, ఎం.ఫార్మసీ కళాశాలలను త్వరలో ప్రారంభించనున్నట్లు వీసీ తెలిపారు. కరోనా కారణంగా ఆలస్యం జరిగిందన్నారు. యూనివర్సిటీ చుట్టూ ప్రహారీ నిర్మాణం చేస్తామన్నారు. ప్రతిరోజు యూనివర్సిటీలో అధ్యాపకులు, సిబ్బంది సక్రమంగా వస్తున్నారా? లేదా? అనే అంశంపై తానే స్వయంగా పరిశీలన చేస్తానన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ సేవలు విస్త్రతం చేయడంతో పాటు, ఈ ఏడాది నుంచి డిగ్రీ చదివే విద్యార్థులకోసం ఎన్‌సీసీని ప్రవేశపెడతామన్నారు. విద్యార్థులు చేరని కోర్సులను రద్దు చేస్తామని, ఆ విభాగాల్లో పని చేసే అధ్యాపకులను వేరే యూనివర్సిటీలకు బదిలీ చేస్తామన్నారు. సమావేశంలో రిజిస్ట్రార్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.