దసరా శోభ

ABN , First Publish Date - 2021-10-07T06:25:08+05:30 IST

కనకదుర్గమ్మ కొలువుదీరిన ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.

దసరా శోభ
విద్యుత్‌ కాంతుల్లో ఇంద్రకీలాద్రి

నేటి నుంచే శరన్నవరాత్రి ఉత్సవాలు 

తొలిరోజు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారు

సారె సమర్పించిన సీపీ బత్తిన శ్రీనివాసులు

నేటి ఉదయం 9 గంటల నుంచి దర్శనానికి అనుమతి

తొలిరోజే దర్శనానికి రానున్న గవర్నర్‌ 


కనకదుర్గమ్మ కొలువుదీరిన ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మరికొద్ది గంటల్లో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆనవాయితీ ప్రకారం బుధవారం సాయంత్రం వన్‌టౌన్‌  పోలీసుస్టేషన్‌ నుంచి నగర పోలీసు కమిషనర్‌ బి.శ్రీనివాసులు భారీ ఊరేగింపుతో వచ్చి, పోలీసు శాఖ తరఫున దుర్గమ్మకు తొలిసారె సమర్పించారు. దీంతో వేడుకలకు అంకురార్పణ జరిగింది. ఈ నెల 15వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో అమ్మవారు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : దసరా ఉత్సవాలకు సర్వం సిద్ధమయింది. గురువారం తెల్లవారుజామున మూడు గంటలకు వేదపండితులు, అర్చకులు సుప్రభాత సేవతో అమ్మవారిని మేల్కొలిపి.. శాస్త్రోక్తంగా స్నపనాఽభిషేకం, బాలభోగ నివేదన, నిత్యార్చనాదికాలను పూర్తి చేస్తారు. అనంతరం ప్రధాన ఆలయం నుంచి అమ్మవారి ఉత్సవమూర్తిని ఊరేగింపుగా తీసుకువచ్చి మహామండపం ఆరో అంతస్థులోని ప్రత్యేక వేదికపై ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. తొలిరోజు అమ్మవారు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. రెండోరోజు శుక్రవారం నుంచి ప్రతిరోజూ ఉదయం నాలుగు నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనాలు కొనసాగుతాయి. రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఉత్సవాల తొలిరోజే అమ్మవారి దర్శనానికి రానున్నారు. 12న అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం రోజున దుర్గమ్మ సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఆ రోజు మధ్యాహ్నం 3 - 4 గంటల మధ్య రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి జగన్‌ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఉత్సవాల సందర్భంగా అమ్మవారి ప్రధాన ఆలయంతోపాటు ఉపాలయాలను, రాజగోపురాలను, ఆలయ ప్రాకారాలను విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజూ రెండు దఫాలుగా ఆలయంలో లక్ష కుంకుమార్చన నిర్వహించనున్నారు. 

ఈ పూజల్లో భక్తులు ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం కల్పించారు. గుడికి రాలేని భక్తులు పరోక్ష పద్ధతిలో కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించుకోవచ్చు. కాగా కరోనా కారణంగా గంగా సమేత దుర్గా మల్లేశ్వరస్వామివార్ల నగరోత్సవాన్ని, భవానీ భక్తులు ఇరుముడులు సమర్పించే కార్యక్రమాలను రద్దు చేశారు. Updated Date - 2021-10-07T06:25:08+05:30 IST