శివానీ.. భవానీ..!

ABN , First Publish Date - 2021-10-14T06:28:24+05:30 IST

ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు ముగింపు దశకు చేరుకున్నాయి.

శివానీ.. భవానీ..!
దుర్గాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు

ఏడో రోజు దుర్గాదేవిగా అమ్మవారి దర్శనం 

భారీగా తరలివచ్చిన భక్తజనం 

తెల్లవారుజాము నుంచి రాత్రి వరకూ కొనసాగిన రద్దీ 


ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో ఏడో రోజైన బుధవారం దుర్గాష్టమి పర్వదినాన అమ్మవారు తన నిజరూపమైన దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. శక్తి స్వరూపిణి దుర్గాదేవి అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు సాధారణ భక్తులతోపాటు భవానీలు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. కొండంతా అరుణ వర్ణం దాల్చింది. జై భవానీ.. అంటూ భక్తులు చేసిన జయజయ ధ్వానాలతో ఇంద్రకీలాద్రి మార్మోగింది. క్యూలైన్లు కిక్కిరిసి పోయాయి. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : లోక కంఠకుడైన దుర్గమాసురుడిని సంహరించి, దుర్గాదేవిగా ఇంద్రకీలాద్రిపై అవతరించిన అమ్మవారు బుధవారం నిజరూపమైన దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. త్రిశూల ధారియైు.. చిరు దరహాసంతో సింహాసనాన్ని అధిష్ఠించిన జగన్మాతను దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ‘లోకపావనీ.. పాహిమాం’ అంటూ శరణు వేడుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన సాధారణ భక్తులు కొండ దిగువన ఏర్పాటు చేసిన ప్రత్యేక కేశఖండనశాలలో తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సీతమ్మవారి పాదాలు, కృష్ణవేణి, పద్మావతి ఘాట్లలో పవిత్ర కృష్ణానదీ జలాలతో పుణ్యస్నానాలు ఆచరించి, భక్తిభావంతో అమ్మవారి దర్శన భాగ్యం కోసం బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. రాత్రి 10 గంటల వరకు అదే రద్దీ కొనసాగింది.


దుర్గమ్మ సన్నిధిలో ప్రముఖులు

రాష్ట్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా సాయంత్రం కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. పలువురు సినీ తారలు, రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర డీజీపీ గౌతంసవాంగ్‌, పలు రంగాలకు చెందిన ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున మూడు గంటలకు సుప్రభాత సేవతో అమ్మవారిని మేల్కొలిపిన వేదపండితులు శాస్త్రోక్తంగా స్నపనాభిషేకం, నిత్యపూజాదికాలను నిర్వహించిన అనంతరం అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించారు. ఉదయం నాలుగు గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు మహామండపం ఆరో అంతస్థులో నిర్వహించిన ఆర్జిత పూజల్లో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం 6.30 నుంచి 7.30 వరకు అమ్మవారికి మహానివేదన, పంచహారతుల అనంతరం ప్రదోష కాలంలో గంగా సమేత దుర్గామల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తులను మంగళ వాయిద్యాల నడుమ ఊరేగిస్తూ వైభవంగా పల్లకీ సేవ నిర్వహించారు. గురువారం మహర్నవమి.. దుర్గమ్మ మహిషాసుర మర్దినీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. 


ఇరుముడుల సమర్పణకు అవకాశం లేదు

దసరా మహోత్సవాల్లో ఈ ఏడాది భవానీ దీక్షల విరమణకు, ఇరుముడుల సమర్పణకు అవకాశం లేదని దుర్గగుడి ట్రస్ట్‌బోర్డు చైౖర్మన్‌ పైలా సోమినాయుడు, ఈవో భ్రమరాంబ తెలిపారు. బుధవారం వారిద్దరూ మీడియాతో మాట్లాడుతూ. కొవిడ్‌ నిబంధనల కారణంగా, ఇరుముడులు సమర్పించడానికి అనుమతి ఇవ్వడం లేదని, భవానీ భక్తులు వారి వారి ప్రదేశాల్లోనే దీక్ష విరమణలు చేసుకోవచ్చునని తెలిపారు. తలనీలాల సమర్పణ, జల్లు స్నానం, అమ్మవారి దర్శనానికి మాత్రమే అనుమతి ఉన్నదని తెలిపారు. 



Updated Date - 2021-10-14T06:28:24+05:30 IST