భక్తజనకీలాద్రి

ABN , First Publish Date - 2021-10-11T06:02:04+05:30 IST

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో నాలుగో రోజైన ఆదివారం లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శనం చేసుకునేందుకు భక్తులు పోటెత్తారు.

భక్తజనకీలాద్రి
క్యూలైన్లలో భక్తుల రద్దీ

దసరా సెలవులివ్వడంతో పోటెత్తిన భక్తజనం 

లక్ష మందికి పైగా దర్శించుకున్నట్టు అంచనా 

క్యూలైన్లలో ఉక్కపోత.. దాహం కేకలు  

అమ్మ దర్శనానికి 4 గంటలకు పైగా అవస్థలు 


ఆంధ్రజ్యోతి, విజయవాడ : దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో నాలుగో రోజైన ఆదివారం లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శనం చేసుకునేందుకు భక్తులు పోటెత్తారు. విద్యాసంస్థలకు దసరా సెలవులు, ఆదివారం కూడా కలిసి రావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఇంద్రకీలాద్రి భక్తజనకీలాద్రిగా మారింది. సాధారణ భక్తులతోపాటు వీఐపీ, వీవీఐపీల తాకిడి కూడా పెరగడంతో కొండ పరిసరాలు భక్తులతో కళకళలాడాయి. ఘాట్‌రోడ్డు మీదుగా కొండపైకి మూడు వరసల క్యూలైన్లు, కొండపైన ఓం టర్నింగ్‌ నుంచి ఐదు కూలైన్లను ఏర్పాటు చేశారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు అన్ని క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. అమ్మవారి ప్రధాన ఆలయంలోని ముఖమండపం కూడా భక్తులతో నిండిపోవడంతో రద్దీని నియంత్రించేందుకు క్యూలైన్లలోని భక్తులను మధ్యలో నిలిపివేశారు. దీంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులకు దాదాపు నాలుగు గంటలకు పైగా సమయం పట్టింది. క్యూలైన్లలో అన్ని గంటలు నిలబడలేక భక్తులు నానా అవస్థలు పడ్డారు. భక్తులకు ఎక్కడికక్కడ మంచినీరు అందించేందుకు ఏర్పాట్లు చేసినా.. వలంటీర్లు అందుబాటులో లేకపోవడంతో భక్తులు దాహంతో అల్లాడిపోయారు. ఇన్ని ఇబ్బందులు పడుతూనే ఆదివారం దాదాపు లక్ష మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారనేది అంచనా. భక్తుల తాకిడిని చూసిన జిల్లా అధికారులు దుర్గగుడి అధికారులు ఏర్పాటు చేసిన క్యూలైన్లు ఏ మాత్రం సరిపోవని అభిప్రాయపడ్డారు. 


రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు

మూలా నక్షత్రం కారణంగా మంగళవారం దుర్గగుడి వద్ద పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. కాళేశ్వరరావు మార్కెట్‌ వైపు నుంచి గొల్లపూడి వెళ్లే వాహనాలను వివిధ మార్గాల్లోకి మళ్లిస్తారు. ఈ ఆంక్షలు సోమవారం రాత్రి 11 గంటల నుంచి మంగళవారం రాత్రి 11 గంటల వరకు అమలులో ఉంటాయి. గద్ద బొమ్మ, కాళేశ్వరరావు మార్కెట్‌  వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను పీఎన్‌బీఎస్‌ నుంచి పీసీఆర్‌, చల్లపల్లి బంగళా, ఏలూరు లాకులు, బీఆర్టీఎస్‌ రోడ్డు, బుడమేరు వంతెన, పైపుల రోడ్డు, వైవీ రావు ఎస్టేట్‌, సీవీఆర్‌ ఫ్లైఓవర్‌, సితార, గొల్లపూడి వై జంక్షన్‌ వైపు పంపుతారు. తాడేపల్లి, ప్రకాశం బ్యారేజ్‌, సీతమ్మ వారి పాదాలు, పీఎస్‌ఆర్‌ విగ్రహం, ఘాట్‌రోడ్డు, కుమ్మరిపాలెం వైపునకు ఏవిధమైన వాహనాలనూ అనుమతించరు.

Updated Date - 2021-10-11T06:02:04+05:30 IST