ఆవుకు అంత్యక్రియలు
ABN , First Publish Date - 2021-08-28T04:54:45+05:30 IST
ఆవుకు అంత్యక్రియలు
ఘంటసాల, ఆగస్టు 27 : మనిషి ప్రేమకు ఎల్లలుండవు. అది అయినవారి మీదైనా, పశువుల మీదైనా. ఎంతగా ప్రేమిస్తారో, దూరమైతే అంతగా విలవిల్లాడిపోతారు. రైతైతే తనను పోషిస్తున్న పశువులపై మరింత ప్రేమను పెంచుకుంటాడు. తాను కంటికి రెప్పలా చూసుకుంటున్న గోవు మృతి చెందటంతో ఓ రైతు కుటుంబం విలవిల్లాడిపోయింది. ఘంటసాల మండలం చిట్టూర్పు గ్రామానికి చెందిన రైతు గుత్తికొండ వరప్రసాద్‌కు చెందిన మూడోతరం ఆవుకు నెలలు నిండి దూడకు జన్మనివ్వబోయే సందర్భంలో అనారోగ్యానికి గురైంది. ఆవును కాపాడుకోవడానికి గన్నవరంలో ఉన్న పశువైద్య కళాశాలకు తీసుకెళ్లి శస్త్రచికిత్స చేయించారు. అప్పటికే కడుపులో మృతిచెందిన దూడను బయటికి లాగి ఆవుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూశారు. అయితే, ఇంటికొచ్చిన మరుసటిరోజే ఆవు మరణించింది. దీంతో వరప్రసాద్ కుటుంబసభ్యులు కన్నీంటిపర్యంతమయ్యారు. మృతిచెందిన ఆవుకు ప్రత్యేక పూజలు చేసి శాస్త్రోక్తంగా తమ పొలంలో అంత్యక్రియలు చేశారు. గ్రామస్థులు ప్రత్యేక పూజలు చేశారు.