ఆరోగ్యశ్రీకి అవినీతి జబ్బు!
ABN , First Publish Date - 2021-10-29T06:52:30+05:30 IST
మచిలీపట్నంకు చెందిన ఓ మహిళ పది రోజుల క్రితం కొవిడ్ బారినపడ్డారు.

- డబ్బు చెల్లిస్తేనే కొవిడ్ చికిత్స...
- అడ్డుచెప్పకుండా ఆరోగ్యశ్రీ సిబ్బందికి నెలవారీ మామూళ్లు
మచిలీపట్నంకు చెందిన ఓ మహిళ పది రోజుల క్రితం కొవిడ్ బారినపడ్డారు. పరిస్థితి విషమించడంతో ఆమెను విజయవాడ పుష్పాహోటల్ సెంటర్ సమీపంలోని ఓ పేరున్న ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. తనకు తెల్లకార్డు ఉందని.. ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించాలని ఆమె కోరినా ఆసుపత్రి యాజమాన్యం ససేమిరా అంది. ఆమె నుంచి సుమారు రూ.3.5 లక్షలు వసూలు చేసి చికిత్స అందించారు. డిశ్చార్జి అయిన తర్వాత మచిలీపట్నం వెళ్లిన ఆమె మంత్రి పేర్ని నానికి ఫిర్యాదు చేయడంతో, ఆయన విచారణ జరపాలని ఆరోగ్యశ్రీ జిల్లా కో-ఆర్డినేటర్‌ను ఆదేశించారు. విచారణ జరిపిన కో-ఆర్డినేటర్ ఆసుపత్రి యాజమాన్యం ఆమె నుంచి డబ్బు వసూలు చేసింది వాస్తవమేనని నిర్ధారించి, ఆ మొత్తాన్ని ఆమెకు తిరిగి ఇప్పించారు. అనంతరం ఆసుపత్రి తీరుపై రాష్ట్రస్థాయి ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు ఫిర్యాదు చేశారు.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : పేదలకు మంచి వైద్యం అందాలన్న లక్ష్యంతో తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు ఎలా పక్కదారి పట్టిస్తున్నాయో తెలియజెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనం. ఈ ఆసుపత్రిపై 2019లో కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. నాడు జరిమానా విధించి, ఆ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశారు. కొవిడ్ సమయంలోనూ ఈ ఆసుపత్రి పనితీరు సరిగా లేదంటూ అధికారులు జరిమానా విధించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ అమలును పర్యవేక్షించాల్సిన జిల్లాస్థాయి సిబ్బంది మామూళ్ల మత్తులో జోగుతుండటమే ప్రైవేటు ఆసుపత్రుల విచ్చలవిడి తనానికి కారణమవుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ అమలు చేసేందుకు ఆరోగ్యమిత్రలు ఉంటారు. జిల్లాలో సుమారు 160 ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల ఉన్నాయి. వీటితోపాటు పీహెచ్‌సీల్లో ఆరోగ్యశ్రీ అమలుకు సుమారు 200 మంది ఆరోగ్యమిత్రలున్నారు. వీరిలో కొందరిని కొవిడ్ కమాండ్ కంట్రోల్ రూంలో నియమించారు. దీంతో రెండు మూడు ప్రైవేటు ఆసుపత్రులకు కలిపి ఒక ఆరోగ్యమిత్ర విధులు నిర్వహిస్తున్నారు. వీరి పనితీరును పర్యవేక్షించేందుకు 10 నుంచి 30 ఆసుపత్రులకు కలిపి ఒక టీంలీడర్ ఉంటారు. వీరిపై డీఎం, జిల్లా కో-ఆర్డినేటర్ ఉంటారు.
ఫిర్యాదులే ఉండకూడదు..!
ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ అమలు బాధ్యత ఆరోగ్యమిత్రలదే. రోగుల రిజిస్ట్రేషన్ మొదలు, వారి నుంచి ఆసుపత్రి యాజమాన్యం డబ్బు వసూలు చేయకుండా చూడడం వరకు వీరిదే బాధ్యత. అయితే ఆరోగ్యమిత్రలు ఆసుపత్రి యాజమాన్యాలపై ఫిర్యాదులు చేయకూడదన్న మౌఖిక ఆదేశాలు అమలవుతున్నాయి. రోగులకు సరైన సేవలు అందకున్నా.. వారి నుంచి అదనంగా డబ్బు డిమాండ్ చేసినా, వీరు ఆరోగ్యశ్రీ సైట్లో ఫిర్యాదు నమోదు చేయాలి. అయితే ఆసుపత్రి యాజమాన్యాల నుంచి నెలవారీ మామూళ్లకు అలవాటుపడిన జిల్లాస్థాయి సిబ్బంది ఫిర్యాదులు నమోదు చేయవద్దని ఆరోగ్యమిత్రలను ఆదేశిస్తున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాస్థాయిలో ఆఫీస్ అసోసియేట్‌గా వ్యవహరిస్తున్న ఓ వ్యక్తి ద్వారా నెలవారీ వసూళ్లు వెళతాయనే ఆరోపణలున్నాయి. కొన్నేళ్లుగా అదే పదవిలో పాతుకుపోయిన ఆ వ్యక్తి ప్రతి ప్రైవేటు ఆసుపత్రి నుంచి నెలనెలా రూ.10 నుంచి 30వేల వరకు వసూలు చేస్తున్నట్టు సమాచారం. ఈ వసూళ్ల కారణంగానే చాలా తక్కువ ఫిర్యాదులు జిల్లా నుంచి ఆరోగ్యశ్రీ వెబ్సైట్లో నమోదు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.