వాడివేడిగా..

ABN , First Publish Date - 2021-12-19T06:11:53+05:30 IST

వాడివేడిగా..

వాడివేడిగా..

నినాదాలు, నిరసనల నడుమ కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశం

ఓటీఎస్‌పై టీడీపీ వాదనలు, కొట్టిపడేసిన వైసీపీ

మహిళా కండక్టర్‌ డిప్యుటేషన్‌ను వ్యతిరేకించిన ప్రతిపక్షం

టీడీపీ వ్యాఖ్యలు బాధించాయి : మున్సిపల్‌ కమిషనర్‌

కార్పొరేటర్‌ జాస్తి సాంబశివరావు సస్పెన్షన్‌

వన్‌టౌన్‌, డిసెంబరు 18 : నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశం శనివారం గరంగరంగా జరిగింది. తొలుత సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టి మౌనం పాటించారు. అనంతరం ఓటీఎస్‌ రద్దు చేయాలంటూ టీడీపీ కార్పొరేటర్లు ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శనగా వచ్చారు. ఓ మహిళా కండక్టర్‌ ఆర్టీసీ నుంచి డిప్యుటేషన్‌పై కార్పొరేషన్‌లోకి రావడానికి చేసిన దరఖాస్తు గురించి చర్చ జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ కార్పొరేటర్‌ జాస్తి సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు తన మనసును బాధించాయని మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసన్న వెంకటేశ్‌ చెప్పడంతో సభ ఒక్కసారిగా వేడెక్కింది. కమిషనర్‌ స్థాయిలో ఈ మాటలు రావడం చర్చనీయాంశమయ్యాయి. అయితే, దీనికి సాంబశివరావు క్షమాపణలు చెప్పారు. అనంతరం మహిళలకు గౌరవం ఇవ్వడంపై మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు టీడీపీ వారిని నిలదీశారు. చివరికి సాంబశివరావును సస్పెండ్‌ చేస్తూ మేయర్‌ ఆదేశాలు ఇచ్చారు. మొత్తంగా 159 తీర్మానాల్లో కొన్ని తప్ప మిగతా వాటన్నింటికీ ఆమోదముద్ర వేశారు. ఓటీఎస్‌పై ప్రజల్లో వ్యతిరేకత ఉందని టీడీపీ కార్పొరేటర్లు చెప్పగా, ప్రజలు ఆమోదిస్తున్నారని వైసీపీ కార్పొరేటర్లు వాదించారు. ఎట్టకేలకు ఓటీఎస్‌కు కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. మంత్రి వెలంపల్లితో పాటు సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-19T06:11:53+05:30 IST