కలల్ని మింగిన కల్లోలం

ABN , First Publish Date - 2021-03-21T15:43:27+05:30 IST

ఆశ.. మనిషికి ఊపిరి. అదే చచ్చిపోయినప్పుడు..

కలల్ని మింగిన కల్లోలం

జిల్లాలో తొలి కరోనా కేసు నమోదై నేటికి ఏడాది

విజయవాడ వన్‌టౌన్‌లో తొలి కేసు

మార్చి 22న జనతా కర్ఫ్యూ, ఆ తరువాత లాక్‌డౌన్‌

సంవత్సర కాలంలో జిల్లాలో 50వేల  మంది బాధితులు

వ్యాక్సిన్‌ వచ్చాక నెమ్మదించినా.. మళ్లీ విజృంభణ

పది రోజులుగా మళ్లీ పెరుగుతున్న వైరస్‌ వ్యాప్తి 


విజయవాడ, ఆంధ్రజ్యోతి: ఆశ.. మనిషికి ఊపిరి. అదే చచ్చిపోయినప్పుడు ఆ మనిషి ఏమవుతాడు? ప్రాణమున్న శవంలా మిగులుతాడు. బతుక్కి అర్థం తెలియక, చావును వెతుక్కుంటూ వెళ్లలేక ఉక్కిరిబిక్కిరి అవుతాడు. అప్పుడు పడే వేదన సామాన్యమైనది కాదు. అది ఎంత భయంకరంగా ఉంటుందో, గుండెల్ని ఎలా మెలిపెడుతుందో 2020 సంవత్సరాన్ని అడిగితే చెబుతుంది. కంటికి కనిపించని అతిచిన్న సూక్ష్మజీవి కరోనా ప్రపంచాన్ని ప్రాణసంకటంలోకి నెట్టింది. జీవితాలను నాశనం చేసింది. బంధాలను తెంచేసింది. ప్రాణాలను మింగేసింది. అయిన వారినే అంటురోగులుగా చూసేలా చేసింది. దహన సంస్కారాల్లోనూ దగ్గరకు రానివ్వని దుర్భర పరిస్థితి తెచ్చింది. ఉపాధి లేకుండా చేసి ఉసురుతీసింది. బయట అడుగు పెట్టనీయకుండా కట్టేసింది. ఈ మహావిలయానికి సరిగ్గా  నేటికి సంవత్సరం. కానీ, ఈ ఏడాది కాలంలో కరోనా నేర్పిన గుణపాఠమేంటి? వ్యాక్సిన్‌ పుణ్యమా అని చావుతప్పి బయటపడిన మనం నేర్చుకున్నదేమిటి? ఏమీ నేర్చుకోకపోగా, మళ్లీ మహమ్మారి విజృంభణకు కారణమవుతున్నాం. తస్మాత్‌ జాగ్రత్త.


2020, మార్చి 21వ తేదీన జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైంది. ప్యారిస్‌లో ఉన్నత విద్యనభ్యసిస్తున్న ఓ యువకుడు వన్‌టౌన్‌ ఏరియా మేకలవారి వీధిలోని తన ఇంటికి చేరుకున్న తర్వాత జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతూ వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. ఆ యువకుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అప్పటికే కరోనా గురించి తీవ్ర భయాందోళనతో ఉన్న జిల్లావాసులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జనతా కర్ఫ్యూ నుంచి..కరోనాను కట్టడి చేయడానికి భౌతికదూరం పాటించాలనే నిబంధనతో కేంద్ర ప్రభుత్వం గత ఏడాది మార్చి 22న దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూను విధించింది. ఒక్కరోజు కర్ఫ్యూతో కరోనా విలయాన్ని ఆపలేమని గ్రహించి అప్పటి నుంచి ఏకంగా రెండు నెలలపాటు లాక్‌డౌన్‌ను అమలు చేసింది. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోవడంతో ఇక జిల్లాలో కరోనా నియంత్రణలోకి వచ్చేస్తుందని అందరూ భావించారు. కానీ, అప్పటికే విదేశాల నుంచి జిల్లాలోని తమ స్వస్థలాలకు చేరుకున్న మరో ఐదుగురు యువకులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. జిల్లా అధికార యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారందరినీ గుర్తించి హోం ఐసోలేషన్‌లో ఉంచింది. వారి నుంచి కుటుంబ సభ్యులకు వైరస్‌ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంది. దానికి తగ్గట్టే గత ఏడాది మార్చి నెలాఖరుకు జిల్లాలో కేవలం 6 కరోనా కేసులే నమోదయ్యాయి. 


మర్కజ్‌ ప్రార్థనలతో మారిన పరిస్థితి

ఢిల్లీలోని మర్కజ్‌లో మత ప్రార్థనలకు హాజరై తిరిగి జిల్లాకు వచ్చిన వారిలో కరోనా లక్షణాలు కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అధికార యంత్రాంగం అప్రమత్తమై ఎక్కడికక్కడ కంటైన్‌మెంట్‌ జోన్లు పెట్టి కట్టడి చర్యలు చేపట్టినా వైరస్‌ జిల్లా మొత్తాన్ని చుట్టేసింది. జిల్లాలో తీవ్రతను అంచనా వేసేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసి విస్తృతస్థాయిలో పరీక్షలు నిర్వహించింది. పాజిటివ్‌ వచ్చిన వారిని ఆసుపత్రుల్లో చేర్పించి ఉచితంగానే మెరుగైన వైద్యసేవలందించింది. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోగా, ఏపిల్ర్‌ నుంచి జిల్లాలో కరోనా మరింత విజృంభించింది. జనంపై విషం చిమ్ముతూ విలయతాండవం చేసింది. వైరస్‌ ధాటికి తట్టుకోలేక జిల్లా ప్రజలు ప్రాణభయంతో వణికిపోయారు. రోజుకు 500 మందికి పైగా ప్రజలు కరోనా బారినపడ్డారు. అదే క్రమంలో  రోజుకు 15 నుంచి 20 మంది బలైపోయిన ఉదంతాలూ ఉన్నాయి. జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైన మార్చి 21 నుంచి ఈ ఏడాది మార్చి 20వ తేదీ వరకు ఏడాది కాలంలో జిల్లావ్యాప్తంగా 50వేల మంది వైరస్‌ బారిన పడ్డారు. ఇప్పటివరకు 682 మంది మరణించారు. 


వ్యాక్సిన్‌ వచ్చినా..

ఏడాది కాలంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కరోనా మహమ్మారితో ప్రభుత్వాలు, ప్రజలు పోరాటం చేస్తున్నా ఇంతవరకు వైరస్‌ నియంత్రణలోకి రాలేదు. మహమ్మారిని తరిమికొట్టేందుకు ఈ ఏడాది జనవరి, 16 నుంచి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా వైరస్‌ వ్యాప్తి ఆగలేదు. గత నెలలో వైరస్‌ తీవ్రత కాస్త తగ్గినట్టు కనిపించినా ఇటీవల మళ్లీ విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. 15 రోజులుగా జిల్లాలో పాజిటివ్‌ కేసులు  రెట్టింపు సంఖ్యలో పెరుగుతున్నాయి. లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించాక జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంది. చాలామంది ముఖానికి మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజర్లు వినియోగించడం మానేశారు. ఈ క్రమంలోనే వైరస్‌ మళ్లీ వ్యాపిస్తోంది. శనివారం ఒక్కరోజే జిల్లాలో 44 మందికి కరోనా సోకింది. 


Updated Date - 2021-03-21T15:43:27+05:30 IST