ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్ ఎక్కడ?: సుంకర పద్మశ్రీ
ABN , First Publish Date - 2021-03-24T18:33:51+05:30 IST
‘‘ఏపీకి ప్రత్యేక హోదా నేను తీసుకువస్తాను... మీరు నాకు 25 మంది ఎంపీలను ఇవ్వండి.... నా సత్తా ఏంతో చూపిస్తా అన్న ముఖ్యమంత్రి జగన్ ఎక్కడ ఉన్నారు’’

విజయవాడ: ‘‘ఏపీకి ప్రత్యేక హోదా నేను తీసుకువస్తాను... మీరు నాకు 25 మంది ఎంపీలను ఇవ్వండి.... నా సత్తా ఏంతో చూపిస్తా అన్న ముఖ్యమంత్రి జగన్ ఎక్కడ ఉన్నారు’’ అంటూ ఏపీ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ ప్రశ్నించారు. హోదా ఇవ్వకపోతే కేంద్రం మెడలు వంచేస్తా, మెడ విరిచేస్తా అంటూ ప్రగల్బాలు పలికిన పులివెందుల పిల్లి ఎక్కడ దాక్కుందని యెద్దేవా చేశారు. హోదా ఇవ్వడం కుదరదని నిన్న పార్లమెంట్ సాక్షిగా కేంద్రం ప్రకటిస్తే జగన్ తాడేపల్లి ప్యాలేస్‌లో ఏం చేస్తున్నారని నిలదీశారు. 2014 ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా నరేంద్ర మోదీ తిరుమల శ్రీనివాసుని పాదాల సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హమీ ఇచ్చారని అయితే... తిరుమల వెంకన్న పాదాల చెంత ఇచ్చిన హమీనే ప్రధాని మోదీ గాలికి వదిలేశారని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం మెదటి నుంచి కూడా ఏపీ విషయంలో సవతితల్లి ప్రేమ చూపిస్తోందని ఆరోపించారు. వైసీపీ, బీజేపీ, టీడీపీ నాయకులు ఏ మోహం పెట్టుకుని తిరుపతి ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడుగుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పోలవరం, అమరావతి రాజధాని పూర్తి చేయడంతో పాటు విభజన హమీలను అమలు చేస్తుందని హామీ ఇచ్చారు. ఎవరు మోసం చేస్తున్నారని... ఎవరు ప్రజల మంచి గురించి ఆలోచిస్తున్నారన్న విషయాన్ని ప్రజలు కూడా ఆలోచించాలని తెలిపారు. రాష్ట్రానికి అండగా నిలుస్తున్న కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. వైసీపీ ప్రజా ప్రతినిధులకు ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా హోదా కోసం కేంద్రంపై పోరాటం చేయాలని సుంకర పద్మశ్రీ డిమాండ్ చేశారు.