గుడివాడ డివిజన్‌లో అప్పీళ్లపై విచారణ పూర్తి

ABN , First Publish Date - 2021-02-08T06:19:50+05:30 IST

గుడివాడ డివిజన్‌లో అప్పీళ్లపై విచారణ పూర్తి

గుడివాడ డివిజన్‌లో అప్పీళ్లపై విచారణ పూర్తి
ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్‌ తిరస్కరణ అప్పీళ్లపై విచారణ

42 అప్పీళ్లలో 5 నామినేషన్లకే అనుమతి

నేటితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ గడువు

గుడివాడ, ఫిబ్రవరి 7: డివిజన్‌లోని 211 గ్రామ పంచాయతీలకు గాను తిరస్కరించబడిన నామినేషన్లపై 42మంది ఆర్డీవో జి.శ్రీనుకుమార్‌కు అప్పీలు చేసుకోగా వాటిలో ఐదు నామినేషన్లు ఆమోదం పొందాయని ఆదివారం తుది తీర్పు వెల్లడించారు. ఇన్‌చార్జి డీఎల్పీవో ఎం.నాగిరెడ్డి, ఆర్డీవోతో కలసి అప్పీళ్లను విచారించారు. సర్పంచ్‌లుగా నామినేషన్లు వేసి తిరస్కరించబడిన వారిలో 9 మంది అప్పీలు చేసుకోగా అన్ని అప్పీళ్లను తిరస్కరించారు. వార్డు సభ్యులుగా నామినేషన్లు వేసి తిరస్కరించబడిన వారిలో 33 మంది అప్పీలు చేసుకోగా వారిలో ఐదుగురి నామినేషన్లు అనుమతించారు. మండవల్లి, ముదినేపల్లి, నందివాడల్లో  ఒక్కో అప్పీలును అనుమతించగా పెదపారుపూడి మండలంలో రెండు నామినేషన్లను అనుమతించారు. కీలక ఘట్టమైన నామినేషన్ల ఉపసంహరణకు సోమవారం సాయంత్రం ఐదు గంటలతో గడువు ముగుస్తుంది. ఈ ఐదు నామినేషన్లతో కలుపుకొని డివిజన్‌లోని 1968 వార్డులకు గాను 4,027 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 211 సర్పంచ్‌ పదవులకు 1,036 మంది రంగంలో మిగిలారు.    

గుడ్లవల్లేరు మండలంలో 40 నామినేషన్ల ఉపసంహరణ

గుడ్లవల్లేరు, ఫిబ్రవరి 7: మండలంలో సర్పంచ్‌గా నామినేషన్‌ వేసిన వారిలో ఆదివారం ఐదుగురు ఉపసంహరించుకున్నారు. చంద్రాలలో ఒకరు, చిత్రంలో ఇద్దరు, వడ్లమన్నాడులో ఇద్దరు ఉపసంహరించుకున్నారు. వార్డు సభ్యులుగా నామినేషన్‌ దాఖలు చేసిన వారిలో 35 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. అంగలూరులో ముగ్గురు, చంద్రాలలో 11 మంది, డోకిపర్రులో ఐదుగురు, వడ్లమన్నాడులో ఐదుగురు, వేమవరంలో నలుగురు, విన్నకోటలో ఏడుగురు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మండలంలోని కుచికాయలపూడి, గాదేపూడి గ్రామాల సర్పంచ్‌ల పదవులు, 63 వార్డు సభ్యుల పదవులకు ఒక నామినేషనే మిగలడంతో ఏకగ్రీవమైనట్లు తేలాయి. 

గుడివాడ మండలంలో ముగ్గురు.. 

గుడివాడ రూరల్‌: గుడివాడ రూరల్‌ మండలంలో సర్పంచ్‌ పదవులకు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల్లో ముగ్గురు ఆదివారం ఉపసంహరించుకున్నారు. సర్పంచ్‌లకు దాఖలు చేసిన రామనపూడి, చిరిచింతల, శేరీవేల్పూరులకు చెందిన ముగ్గురు, వార్డు సభ్యుల్లో ఏడుగురు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. గుడివాడ రూరల్‌ మండలంలో ఎన్నికలు జరుగుతున్న 15 గ్రామ పంచాయతీలకుగాను 56 మంది అభ్యర్థులు సర్పంచ్‌ పదవులకు పోటీలో ఉన్నారు.  


Updated Date - 2021-02-08T06:19:50+05:30 IST