లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ సామగ్రి అందుబాటులో ఉంచాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-10-29T06:34:37+05:30 IST

ఇళ్ల నిర్మాణాల పురోగతికి అవసరమైన నిర్మాణ సామగ్రిని లబ్ధిదారులకు అందుబాటులో ఉంచడంలో పూర్తి శ్రద్ధ కనబరచాలని అధికారులను కలెక్టర్‌ జె.నివాస్‌ ఆదేశించారు.

లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ సామగ్రి అందుబాటులో ఉంచాలి : కలెక్టర్‌

పాయకాపురం, అక్టోబరు 28 : ఇళ్ల నిర్మాణాల పురోగతికి అవసరమైన నిర్మాణ సామగ్రిని లబ్ధిదారులకు అందుబాటులో ఉంచడంలో పూర్తి శ్రద్ధ కనబరచాలని అధికారులను కలెక్టర్‌ జె.నివాస్‌ ఆదేశించారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి గురువారం ఇళ్ల నిర్మాణాల ప్రగతి తీరుపై మండల అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సిమెంట్‌, స్టీల్‌, స్టాక్‌ చేసేందుకు నిర్మాణాల్లోని 430 గ్రామ సచివాలయాలను గుర్తించడం జరిగిందన్నారు. వాటిలోని గ్రౌండ్‌ ఫోర్స్‌ను ఇందుకు వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి మండలంలో అవసరం మేరకు సిమెంట్‌, స్టీల్‌ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలన్నారు. కంకరను సరసమైన ధరకు అందించేందుకు క్రషర్‌ యాజమాన్యాలు అంగీకరం తెలిపి ధర నిర్ణయించారని, ఆ మేరకు సరఫరా అవుతుందీ, లేనిది పరిశీలించాలన్నారు. ఇసుక సరఫరాలో ఇబ్బందులుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. గత వారంలో 829 ఇళ్లు బేస్‌మెంట్‌ స్థాయికి వచ్చాయని, అయితే వీటి పురోగతి గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇళ్ల నిర్మాణాలు, ప్రగతిలో శ్రద్ధ కనబరచని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. జాయింట్‌ కలెక్టర్‌ కె. మాధవీలత, ఎల్‌. శివశంకర్‌, కె. మోహన్‌కుమార్‌, శ్రీనివాస్‌ నుపూర్‌ అజయ్‌కుమార్‌, హౌసింగ్‌ పీడీ రామచంద్రన్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-10-29T06:34:37+05:30 IST