ఒక్క రైతూ మోసపోకూడదు
ABN , First Publish Date - 2021-12-30T06:42:43+05:30 IST
ఒక్క రైతూ మోసపోకూడదు

ధాన్యం కొనుగోలుపై సమీక్షలో అధికారులకు కలెక్టర్ నివాస్ ఆదేశాలు
వన్‌టౌన్, డిసెంబరు 29 : జిల్లాలో దళారీ వ్యవస్థను పూర్తిస్థాయిలో అరికట్టి రైతు పండించిన ధాన్యానికి మద్దతు ధరను అందించేందుకు ప్రభుత్వం ఆర్బీకేల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. ఆర్బీకేల్లో ఏర్పాటు చేసిన పీసీసీల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియపై డివిజన్, మండలస్థాయి, రెవెన్యూ, సివిల్ సప్లై, వ్యవసాయ శాఖ అధికారులతో జాయింట్ కలెక్టర్ మాధవీలతతో కలిసి కలెక్టర్ నివాస్ బుధవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి రైతు నుంచి ధాన్యాన్ని సేకరించేలా మండలస్థాయి అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఏ ఒక్క రైతు ఇబ్బంది పడినా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తహసీల్దార్లు మండల పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేస్తూ రోజూ వంద టన్నుల ధాన్యం సేకరించేలా చర్యలు చేపట్టాలన్నారు. వ్యవసాయ సహాయకులు, వీఆర్వో, వీఏవోలు క్షేత్రస్థాయిలో రైతుల కళ్లాల్లో పర్యటించి తేమశాతం రిపోర్టు రైతులకు అందించాలన్నారు. తహసీల్దార్లు, వీఆర్వో, వీఏవో, అగ్రికల్చర్ అసిస్టెంట్లు కళ్లాల్లో ధాన్యాన్ని పరిశీలించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. హమాలీ, ట్రాన్స్‌పోర్టు ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. అన్ని ఆర్బీకేల్లో హమాలీలను అందుబాటులో ఉంచి ధాన్యం బస్తాల లోడింగ్, అన్ లోడింగ్‌కు ఏ రోజుకారోజు వేతనాలు చెల్లించాలని చెప్పారు. ఏ ఒక్క రైతు దళారులను నమ్మి మోసపోకూడదన్నదే ప్రభుత్వం లక్ష్యం అని, ఈ మేరకు అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించాలన్నారు. ధాన్యం కొనుగోలుపై ఆయా మండల తహసీల్దార్లు రోజూ నివేదికను అందించాలన్నారు. ప్రతి మిల్లు వద్ద వీఆర్వో, వీఏవోలను నియమించాలన్నారు. జనవరిలో పూర్తిస్థాయిలో ధాన్యం వస్తుందని, ప్రతి రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేసేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి అవగాహన కల్పించి గన్నీ బ్యాగ్‌లను సిద్ధంగా ఉంచాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ శాఖ జేడీ మోహనరావు, పౌరసరఫరాల శాఖ, సహకార శాఖ అధికారులు పాల్గొన్నారు.