1.55 లక్షల మందికి కొవిడ్ వ్యాక్సిన్: కలెక్టర్
ABN , First Publish Date - 2021-03-24T06:43:55+05:30 IST
జిల్లాలో 1.55 లక్షల మందికి ఇప్పటి వరకూ కొవిడ్ వ్యాక్సినేషన్ వేసినట్లు కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ తెలిపారు.

గన్నవరం, మార్చి 23: జిల్లాలో 1.55 లక్షల మందికి ఇప్పటి వరకూ కొవిడ్ వ్యాక్సినేషన్ వేసినట్లు కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ తెలిపారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉద్యోగులు, సిబ్బందికి ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యాక్సిన్ తీసుకునే అవకాశం వచ్చినప్పుడు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. శుక్రవారం నుంచి దశల వారీగా సచివాలయ పరిధిలో వ్యాక్సినేషన్ అందించే ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలోని చంద్రగూడెం, చిల్లకల్లు సచివాలయాల్లో ప్రయోగాత్మకంగా కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాలను నిర్వహించి నూరు శాతం మంచి ఫలితాలను సాధించామన్నారు. వ్యాక్సిన్ వేయించుకునే ముందు, తరువాత కూడా కొవిడ్ ప్రాథమిక నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. 60 సంవత్సరాలు వయస్సు పైబడిన వారు 45-59 వయస్సు మధ్య ఉండి దీర్ఘకాలంగా వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి ముందు ప్రాధాన్యమని, మిగిలిన వారికి అవకాశం వచ్చినప్పుడు టీకా పొందాలన్నారు. కొవిషీల్డ్, కోవ్యాక్సిన్ రెండూ సురక్షితమని, వీటిలో ఏదైన తీసుకోవచ్చని తెలిపారు. ఎటువంటి అపోహలను నమ్మవద్దని చెప్పారు. విమానాశ్రయ ఉద్యోగులు, సిబ్బందికి వ్యాక్సినేషన్ అందించేందుకు ముందుకు వచ్చిన ఏపీడీ డైరెక్టర్ మధుసూదనరావును కలెక్టర్ అభినందించారు.
లాక్‌డౌన్‌పై వదంతులు నమ్మొద్దు
గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో లాక్‌డౌన్ అని ప్రచారం అవుతున్న వీడియో నిజం కాదని, అది గత సంవత్సరంలోదని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. గతేడాది వీడియోను పలు వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతోందన్నారు. దయచేసి ఈ ప్రచారాన్ని ప్రచారం నమ్మొద్దని చెప్పారు. జిల్లా యంత్రాంగం లాక్‌డౌన్ గురించి ఎక్కడ ప్రకటన చేయలేదన్నారు. ఈ ప్రచారంపై నగర పోలీస్ కమీషనర్‌కు తెలియజేయటం జరిగిందని ప్రచారం చేసేవారి పై చర్యలు తీసుకుంటామన్నారు. ఏపీడీ జి. మధుసూధనరావు, జనరల్ మేనేజర్ ఎండి తాజుద్దీన్, తహసీల్దారు సిహెచ్. నరసింహారావు, డాక్టర్ సురేష్ పాల్గొన్నారు.
గ్రామాల్లో తాగునీటి పరీక్షలు నేటి నుంచి
విజయవాడ సిటీ: జిల్లాలో 970 గ్రామ పంచాయతీల్లో తాగునీటి పరీక్షలు నిర్వహించేందుకు టెస్టింగ్ కిట్లు సిద్ధంగా ఉంచామని, నేటి నుంచి అన్ని పంచాయతీల్లో పరీక్షలు నిర్వహిస్తారని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. టెస్టింగ్ కిట్లను ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈతో కలిసి తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో తాగునీటి పరిస్ధితి ఏ విధంగా ఉన్నది ప్రజలు కోరిన వెంటనే ఆయా గ్రామ సచివాలయాల్లో ఏర్పాటు చేసిన ఈ టెస్టింగ్ కిట్ల ద్వారా 8 రకాల పరీక్షలు నిర్వహించవచ్చన్నారు. వీటితో పాటు జిల్లాలో ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యంలో విజయవాడ గుడివాడ, నందిగామ నూజివీడు, మచిలీపట్నంలో నిర్వహించే వాటర్ ల్యాబ్‌ల ద్వారా తాగునీటి విలువలకు సంబంధించి 21 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.