ఇసుక రవాణాకు ఆటంకాల్లేకుండా చూడాలి

ABN , First Publish Date - 2021-05-20T06:29:42+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఇసుక సరఫరాపై ప్రత్యేక ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించిందని, ప్రజలకు నేరుగా ఇసుక పారదర్శక విధానంలో అందించేందుకు సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు.

ఇసుక రవాణాకు ఆటంకాల్లేకుండా చూడాలి

విద్యాధరపురం, మే 19 : రాష్ట్ర ప్రభుత్వం ఇసుక సరఫరాపై ప్రత్యేక ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించిందని, ప్రజలకు నేరుగా ఇసుక పారదర్శక విధానంలో అందించేందుకు సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు. బుధవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి రెవెన్యూ, పోలీస్‌, సర్వే అధికారులతో జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జయప్రకాష్‌ పవర్‌ వెంచర్‌ లిమిటెడ్‌ ఏజన్సీకి ఇసుక సేకరణ, వినియోగదారులకు సరఫరా చేసేందుకు నిర్ధిష్టమైన ఉత్తర్వులను జారీ చేశారన్నారు. ఇసుక రవాణాకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలన్నారు. ఇప్పటికే జిల్లాలో 58 రీచ్‌లను సంబంధిత ఏజన్సీకి అనుమతించటం జరిగిందన్నారు. జిల్లాలో 5 రీచ్‌లు ప్రారంభమయ్యాయని, మరో రెండు బుధవారం ప్రారంభం అయ్యాయని జేసీ వివరించారు. క్షేత్రస్థాయిలోని ఇబ్బందులను అధిగమించేందుకు నిర్ధిష్టమైన కార్యాచరణ అమలు చేయాలన్నారు. రాబోయే వరదలను పరిగణలోకి తీసుకుని తగిన నిల్వలను సిద్ధం చేసుకోవాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల జోక్యం ఉండకూడదని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలన్నారు. పట్టా ల్యాండ్‌ భూముల్లో ఇసుక కార్యకలాపాలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేశామని అక్కడ ఏమైన కార్యకలాపాలు జరుగుతుంటే నిఘా పెట్టి పర్యవేక్షించాలన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ (రెవెన్యూ) డాక్టర్‌ కె.మాధవీలత మాట్లాడుతూ పోలీస్‌, రెవెన్యూ, మైన్స్‌ శాఖాధికారులతో సమన్వయం చేస్తున్నామన్నారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా 7 నుంచి 10 మెట్రిక్‌ టన్నుల ఇసుకను సేకరించి రిజర్వ్‌లో ఉంచాలని ఏజెన్సీకి తెలిపామన్నారు. సాధారణ ప్రజలకు ఇసుకను అందించేందుకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. గ్రామ సచివాలయం ద్వారా కాకుండా నేరుగా ఏజెన్సీల ద్వారా రీచ్‌ల వద్దే కొనుగోలుకు అవకాశం ఉందన్నారు. పోలీస్‌ అధికారులు కూడా సంబంధిత రీచ్‌ల వద్ద పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేపడుతున్నట్లు తెలిపారు. ఈ జూమ్‌ కాన్ఫరెన్స్‌లో అడిషినల్‌ ఎస్పీలు బి.సత్యనారాయణ, సత్యపాల్‌, ఏపీ మైన్స్‌ వి.నాగిణి పాల్గొన్నారు.


Updated Date - 2021-05-20T06:29:42+05:30 IST