టిడ్కో ఇళ్ల ప్లాట్ల మార్పు..

ABN , First Publish Date - 2021-12-08T06:26:09+05:30 IST

విజయవాడ రూరల్‌ మండలం జక్కంపూడి ఆర్థిక నగరంలో (జెట్‌ సిటీ) ఏపీ టిడ్కో నిర్మించిన ఇళ్లలో ప్లాట్ల మార్పిడి జరుగుతోంది.

టిడ్కో ఇళ్ల ప్లాట్ల మార్పు..
జక్కంపూడిలో బ్యాంకు మేనేజర్‌తో లబ్ధిదారుల వాగ్వాదం

 జక్కంపూడిలో లబ్ధిదారుల ఆందోళన

మోసం చేస్తున్నారంటూ అధికారులపై ఆగ్రహం

విజయవాడ రూరల్‌, డిసెంబరు 7 : విజయవాడ రూరల్‌ మండలం జక్కంపూడి ఆర్థిక నగరంలో (జెట్‌ సిటీ) ఏపీ టిడ్కో నిర్మించిన ఇళ్లలో ప్లాట్ల మార్పిడి జరుగుతోంది. గతంలో ఇచ్చిన ప్లాట్లకు బదులు వేరేవి కేటాయించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. గతంలో లబ్ధిదారులకు కేటాయించిన బ్లాక్‌ల నిర్మాణం పూర్తయినప్పటికీ, స్వాధీనం చేయకుండా, ఇంకా నిర్మాణంలో ఉన్న బ్లాక్‌లను అంటగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. బ్యాంకు రుణం మంజూరైందని, ప్లాట్ల వద్ద ఫొటోలో తీయాలంటూ లబ్ధిదారులను బ్యాంక్‌ అధికారులు పిలిపించడంతో అసలు విషయం  బయటపడింది. దీంతో లబ్ధిదారులు మంగళవారం ఆందోళనకు దిగారు. టిడ్కో ఇళ్లలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ రూ.7 లక్షలుగా, రూ.50 వేలు లబ్ధిదారుల వాటా, బ్యాంకు రుణం రూ.3.50 లక్షలు, మరో రూ.3 లక్షలు సబ్సిడీగా ఉంది. 46 మంది లబ్ధిదారులకు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఇప్పటికే ఇళ్ల నిర్మాణం పూర్తవ్వడంతో, లబ్ధిదారులను రుణాన్ని మంజూరు చేయాలని బ్యాంకు అధికారులు నిర్ణయించారు. బ్యాంక్‌ మేనేజర్‌ లబ్ధిదారులకు అక్కడకు పిలిపించి ఫొటోలు తీసే ప్రక్రియను చేపట్టారు. అయితే, గతంలో ఇచ్చిన బ్లాక్‌లోని ప్లాట్ల వద్ద కాకుండా, పిల్లర్ల దశలో ఉన్న బ్లాక్‌ల వద్ద ఫొటోలు తీస్తుండటంతో లబ్ధిదారులకు అనుమానం వచ్చి మేనేజర్‌ ప్రశ్నించారు. తనకేమీ తెలియదని, విజయవాడ కార్పొరేషన్‌ అధికారులు ఇచ్చిన జాబితా ప్రకారం సమాచారం ఇచ్చి, ఫొటోలు తీస్తున్నట్లు చెప్పారు. నిర్మాణం పూర్తయిన వాటిని వేరేవారికి కేటాయించి, తమకు అసంపూర్తి నిర్మాణ బ్లాక్‌లను కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ ఇళ్ల సమస్య పరిష్కారమయ్యేంత వరకు బ్లాక్‌ల వద్ద ఫొటోలు దిగమని, బ్యాంక్‌ అధికారులతో ఎలాంటి ఒప్పందం కూడా చేసుకోమని లబ్ధిదారులు వెళ్లిపోయారు. 


Updated Date - 2021-12-08T06:26:09+05:30 IST