శుభస్య శీఘ్రం

ABN , First Publish Date - 2021-07-13T05:22:27+05:30 IST

శుభస్య శీఘ్రం

శుభస్య శీఘ్రం
పూర్తయిన ఎన్‌హెచ్‌16 ప్యాకేజీ-2 పనులు

జిల్లాలో కీలక ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి కేంద్రం సమాలోచనలు

విజయవాడ విమానాశ్రయంలో నూతన రన్‌వే, ఎన్‌హెచ్‌16 ప్యాకేజీ-2 పనులు పూర్తి

ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌ఐడీఎం పూర్తికి ఆదేశాలు

నెలలో ప్రారంభోత్సవానికి సన్నాహాలు

విజయవాడ, ఆంధ్రజ్యోతి : జిల్లాకు సంబంధించిన కీలక ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతన రన్‌వేతో పాటు కాజ వయా విజయవాడ-గుండుగొలను రోడ్డు ప్రాజెక్టులో అంతర్భాగమైన ప్యాకేజీ-2 ఆరు వరసల పనులను      ఈ నెలలో ప్రారంభించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. దీంతో పాటు నందిగామ బైపాస్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌ఐడీఎం భవన నిర్మాణాలపైనా దృష్టిపెట్టింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి ప్రారంభోత్సవ సాధ్యాసాధ్యాలపై సంబంధిత శాఖల అధికారులను సమాచారం కోరింది. 

ముస్తాబైన ప్రాజెక్టులివీ..

విజయవాడ విమానాశ్రయంలో నూతన రన్‌వే ఈనెల 15వ తేదీన అందుబాటులోకి రానుంది. దీనిని ప్రారంభించాలని కేంద్రం భావిస్తోంది. కానీ, అధికారికంగా ప్రకటించలేదు. దీనిని రూ.132 కోట్లతో నిర్మించారు. కాగా, ఎయిర్‌పోర్టు అధికారుల నుంచి సమాచారం కోరిన కేంద్రం వర్చువల్‌ ప్రారంభోత్సవంపై ఇంకా సమాచారం ఇవ్వలేదు. 

కాజ వయా విజయవాడ-గుండుగొలను ప్రాజెక్టుకు సంబంధించి ప్యాకేజీ-2 రోడ్డును ప్రారంభించటానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును 16వ నెంబర్‌ జాతీయ రహదారిపై కలపర్రు నుంచి చిన అవుటపల్లి వరకు ఆరు వరసలుగా అభివృద్ధి చేశారు. ఇందులో హనుమాన్‌ జంక్షన్‌ బైపాస్‌ పనులు కూడా ఉన్నాయి. దీనిని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

కొండపావులూరులో రెండు ప్రతిష్టాత్మక సంస్థల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వీటిలో ఒకటి ఎన్‌డీఆర్‌ఎఫ్‌ కాగా, మరొకటి ఎన్‌ఐడీఎం. ఈ రెండు సంస్థలకు సంబంధించి భవన నిర్మాణ పనులు తుదిదశకు చేరాయి. త్వరలో వీటిని కూడా ప్రారంభించేందుకు కేంద్రం ఆసక్తి చూపిస్తోంది. దీంతో ఇప్పటికే వీటి నిర్మాణ పనుల గురించి ఆరా తీసింది. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌ఐడీఎం ప్రాజెక్టులను ప్రారంభించే సమయంలోనే కొండపావులూరుకు మంజూరు చేసిన మరో రెండు కేంద్ర సంస్థలు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంటేషన్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐపీఎం), నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (ఎన్‌సీడీసీ)ను ప్రారంభించే అవకాశం ఉంది. 





Updated Date - 2021-07-13T05:22:27+05:30 IST